సూపర్ హిట్ సినిమాల డిలీటెడ్ సీన్లకు ఉండే క్రేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ బాగా విస్తృతం అయ్యాకా వివిధ సినిమాల డిలీటెడ్ సీన్లను అక్కడ పెడుతున్నారు. కొందరు కక్కుర్తి మూవీ మేకర్లు.. రెండో వారంలో తమ సినిమాకు అదనపు సీన్లను యాడ్ చేశామంటూ ప్రకటనలు చేసే వారు గతంలో. అయితే ఇప్పుడు అలాంటి టెక్నిక్స్ పనికి రావు. అందుకే మూవీ మేకర్లు వాటిని యూట్యూబ్ కు ఎక్కిస్తున్నారు.
కొన్నేళ్ల కిందట వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకు సంబంధించి సినిమాలో లేని చాలా సీన్లను యూట్యూబ్ లో చూపించారు. ఆ సీన్లన్నింటినీ కలిపితే ఒక చిన్న సినిమా అవుతుందేమో!
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు అల వైకుంఠపురంలో డిలీటెడ్ సీన్ల ట్రీట్ ఇస్తూ ఉంది. థియేటర్లో సినిమాలో భాగంగా ప్రదర్శితం కాని ఒక సీన్ ను యూట్యూబ్ లో వదిలారు. ఆ సీన్ బ్రహ్మాండంగా ఉంది. అల్లు అర్జున్ పాత్ర సుశాంత్ పాత్రపై ఒక రీవేంజ్ తీసుకునే తరహా సీన్ ఇది. ఆ రీవేంజ్ మురళీ శర్మ పాత్ర మీదే అనాలి.
ఇంట్లో వాళ్లకు తెలియని సుశాంత్ పాత్ర అసలు రూపాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ గా తీసి, దానికి అర్జున్ రెడ్డి పార్ట్ 2 టైటిల్ ఫిక్స్ చేసిన ఫన్నీ సీన్ అది. అయితే ఈ సీన్ పెడితే హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది అనుకున్నారో ఏమో కానీ, డిలీట్ చేశారు. ఇలా యూట్యూబ్ లోకి వదిలారు!