ఓవైపు ప్రాణాలు పోతున్నా మూర్ఖత్వం వీడడం లేదు

ప్రపంచంలో ఎప్పుడూ 2 రకాల మనుషులు ఉంటారు. ఒకడు చేస్తున్న పనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడానికి మరొకడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ కరోనా కష్టకాలంలో కూడా కొంతమంది జనాలు తమ మూర్ఖత్వం వీడడం…

ప్రపంచంలో ఎప్పుడూ 2 రకాల మనుషులు ఉంటారు. ఒకడు చేస్తున్న పనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడానికి మరొకడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ కరోనా కష్టకాలంలో కూడా కొంతమంది జనాలు తమ మూర్ఖత్వం వీడడం లేదు. మందులకే లొంగని కరోనా వైరస్ ను క్షుద్రపూజలు, శాంతిపూజలతో తరమికొట్టాలని చూస్తున్నారు. బహూశా ఇండియాలోనే ఇలాంటి విచిత్రాలు కనిపిస్తాయేమో.

మొన్నటికిమొన్న కర్నాటకలోని ఓ ప్రాంతంలో భారీ విగ్రహం కట్టారు. ఆ విగ్రహం పేరు కరోనా తల్లి. దాదాపు 40 అడుగుల ఆ కరోనా తల్లికి శాంతిపూజలు చేశారు. దేశాన్ని విడిచిపోవాలంటూ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులతో పాటు వేదపండితులు, అర్చకులు చాలామంది పాల్గొన్నారు. 

భారీగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంతమందికి కరోనా సోకిందో ఆ ''కరోనా తల్లి''కే తెలియాలి. టెక్నాలజీ హబ్ గా చెప్పుకునే బెంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో జరిగింది ఈ ఘటన.

ఇలాంటిదే మరో ఘటన అదే రాష్ట్రంలో జరిగింది. ఈసారి కరోనాకు క్షుద్రపూజలు చేశారు. మట్టితో కరోనా వైరస్ ను పోలిన బొమ్మ తయారుచేసి, దాని చుట్టూ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు చల్లి నానా హంగామా చేశారు. ఇక్కడితో ఆగలేదు వ్యవహారం. ఓ మేకను కూడా బలిచ్చి అక్కడే వదిలి వెళ్లారు.

ఇలాంటి ఓ ఘటన ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. ఏ వ్యాధినైనా, ఎంత పెద్ద రుగ్మతనైనా ప్రార్థనలతో నయం చేస్తామంటూ ఓ సామాజిక వర్గంలో ఎప్పటికప్పుడు కథనాలు చూస్తూనే ఉన్నాం. 

కాళ్లు లేని వాళ్లకు నడక, కళ్లు లేని వాళ్లకు చూపు తెప్పించిన వీడియోలు కూడా గతంలో చూశాం. ఇప్పుడు అదే వర్గానికి చెందిన ఓ మతప్రబోధకుడు శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగుల కోసం ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నిర్వహించాడు. అదొక మినీ కరోనా రోగుల సమ్మేళనాన్ని తలపించింది.

ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ప్రతి చోట ఇలాంటి మూర్ఖపు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ వేవ్ లో ఇలాంటి బుద్ధిలేని పనులు జరిగాయంటే తెలియనితనం అనుకోవచ్చు. దేశం ఇప్పుడు సెకెండ్ వేవ్ అనుభవిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొందరు ఇలా మూర్ఖంగా వ్యవహరించడం బాధాకరం.