కరోనా బారిన పడ్డామనే ఆందోళన దంపతుల ఉసురు తీసింది. కరోనా సెకెండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న పరిస్థితుల్లో …పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కరోనాకు గురయ్యామంటే చాలు… ప్రాణాలు పోతాయేమోననే ఆందోళన నెలకుంది.
ఈ నేపథ్యంలో అలాంటి భయాందోళన కృష్ణా జిల్లా పెడన గ్రామంలో విషాదం నింపింది. ఆ గ్రామానికి చెందిన లీలాప్రసాద్ (40), భారతి (38) అనే దంపతులు వారం రోజులుగా స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు.
ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వారిలో మానసిక ఆందోళన అంతకంతకూ పెంచింది. తెలియని భయాన్ని నింపింది. దీంతో ఈ బతుకు కంటే చావడమే మంచిదనే నిర్ణయానికి వచ్చేలా కరోనా చేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి దంపతులిద్దరూ ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించారు.
వైద్యులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కంటే భయమే మనుషుల ప్రాణాలు తీస్తోందని చెబుతున్నారు. కరోనా బారిన పడినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని వైద్యులు, మానసిక శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నా ….ప్రయోజనం లేకుండా పోతుంది.