పరిషత్ ఎన్నికలకు సంబంధించి జగన్ సర్కార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏకంగా పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడం రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ తీర్పు జగన్ సర్కార్‌కు ఊహించని పరిణామమే.
ఎందుకంటే ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వలేదనే కారణంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం విశేషం.
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పరిషత్ ఎన్నికలను పూర్తి చేయకుండానే పదవీ విరమణ చేశారు. అనంతరం ఎస్ఈసీగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఆమె వచ్చీరాగానే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చి వారం గడువుతో 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించలేదంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సహా జనసేన, భాజపా నేతలు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సింగిల్ జడ్జి విచారణ చేపట్టి ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేశామని.. కచ్చితంగా 4 వారాల పరిమితి లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది డివిజన్ బెంచ్ ముందు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్‌కు అనుమతించిన డివిజన్ బెంచ్.. ఓట్ల లెక్కింపు చేయొద్దని ఆదేశించింది.
ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఇరు పక్షాల తరఫున పలు మార్లు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో విచారణను పూర్తిచేసిన ఉన్నత న్యాయస్థానం తాజాగా ఎన్నికలు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
తిరిగి రీనోటిఫి కేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తాయో తెలియాల్సి ఉంది. మొత్తానికి ఎన్నికల రద్దు రాజకీయ దుమారం రేపుతోంది.