కరోనా సెకెండ్ వేవ్ భారత్‌ను అతలాకుతలం చేస్తున్న కష్ట కాలంలో , దాని నుంచి బయట పడేందుకు అందరూ కృష్ణపట్నం వైపు ఆశగా చూస్తున్నారు. దీంతో దారులన్నీ కృష్ణపట్నం వైపే అన్నట్టుగా, అక్కడికి వెళ్లే మార్గాల గురించి అన్వేషిస్తున్నారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నం ఉంటుంది. ఆ గ్రామంలో ఆనందయ్య అనే వ్యక్తి కరోనాకు పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు బాగా పనిచేస్తోందనే ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో ఒక్కసారిగా జనం అంతా అక్కడికి క్యూ కట్టారు. సుమారు ఐదు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పైగా శుక్రవారం నుంచి ఆనందయ్య నేతృత్వంలో ఆయుర్వేద మందు పంపిణీ చేయనున్నట్టు స్వయంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఒక రోజు ముందు ప్రకటించారు. దీంతో ఆ గ్రామానికి సుదూర ప్రాంతాల నుంచి జనం పోటెత్తారు. సుమారు 40 వేల నుంచి 50 వేల వరకూ జనం శుక్రవారం గ్రామానికి చేరుకున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఈ రోజు కేవలం కరోనా రోగులకు మాత్రమే మందు పంపిణీ చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ రోజు ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. అయితే రోజుకు 10 వేల మందికి లోపు మాత్రమే మందు తయారీ, పంపిణీ కెపాసిటీ ఉందని సమాచారం. అయితే జనం మాత్రం నాలుగైదు రెట్లు రావడంతో వారందరినీ అదుపు చేయడం కష్టమైంది. దీంతో గ్రామ పొలిమేర్లలోనే వాహనాలను అడ్డుకునేందుకు గ్రామస్తులు చర్యలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో భౌతిక దూరం లేకుండా క్యూ లైన్‌లు కడుతుండటంతో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తూనట్టు నిర్వాహకులు ప్రకటించారు. మళ్ళీ పంపిణీ తేదీ ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు.
అయితే రేపటి నుంచి విశాలామైన గ్రౌండ్‌లో మందు పంపిణీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా మందు పంపిణీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.