డ్రీమ్ ప్రాజెక్టు మేటర్ బయటపెట్టిన నాగార్జున

ప్రతి హీరోకు ఓ డ్రీమ్ ప్రాజెక్టు ఉంటుంది. తన మనసులో చాన్నాళ్లుగా ఉన్న ఓ పాత్రను పోషించాలని అనుకుంటారు. నాగార్జునకు కూడా అలాంటి ఓ డ్రీమ్ ప్రాజెక్టు ఉంది. అయితే అంతా అనుకుంటున్నట్టు అదేదో…

ప్రతి హీరోకు ఓ డ్రీమ్ ప్రాజెక్టు ఉంటుంది. తన మనసులో చాన్నాళ్లుగా ఉన్న ఓ పాత్రను పోషించాలని అనుకుంటారు. నాగార్జునకు కూడా అలాంటి ఓ డ్రీమ్ ప్రాజెక్టు ఉంది. అయితే అంతా అనుకుంటున్నట్టు అదేదో సినిమానో లేక విలక్షణమైన పాత్రో కాదు. నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టు మూవీ మ్యూజియం. 

తెలుగు సినిమాకు సంబంధించి ఓ మూవీ మ్యూజియం ఏర్పాటుచేయాలనేది నాగార్జున కల. కేవలం సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడమే కాకుండా.. వాటని భద్రపరచడం కూడా మన బాధ్యత అంటున్నాడు నాగ్. ఆ బాధ్యతను తను తీసుకున్నానని, అందరూ గర్వపడేలా మూవీ మ్యూజియం ఏర్పాటుచేస్తానని చెబుతున్నాడు.

టాలీవుడ్ కు సంబంధించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్ని భద్రపరచడంతో పాటు.. సినిమాకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉండేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటుచేస్తానని, దానికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధమైందని చెప్పుకొచ్చాడు.

ముందుగా తన తండ్రి ఏఎన్నార్ నటించిన సినిమాల నుంచి సేకరణ ప్రారంభించానని, అక్కినేని నటించిన కొన్ని చిత్రాలు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయాయని, వాటిని తను సేకరించానని నాగార్జున స్పష్టంచేశాడు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకొని, అధునాతన మూవీ మ్యూజియం ఏర్పాటుచేస్తానంటున్నాడు.

ఏ చరిత్ర గురించైనా తెలుసుకోవడానికి ఇప్పటితరం పుస్తకాలు తిరగేయడం లేదంటున్నాడు నాగ్. మొబైల్ తీసుకొని సెర్చ్ చేస్తున్నారని, వీడియోలు చూస్తున్నారని.. టాలీవుడ్ గొప్పదనాన్ని కూడా అలా మునివేళ్లకు అందుబాటులో ఉండేలా తీసుకొస్తానని అంటున్నాడు నాగ్. అదే తన డ్రీమ్ ప్రాజెక్టు అని తెలిపాడు.