చంద్రబాబు ఇంకా మీడియా భ్రమల్లోనే ఉన్నారా..?

మీడియా సపోర్ట్ ఫుల్లుగా ఉండొచ్చు, సోషల్ మీడియాలో సెటైర్లు వేసే సీబీఎన్ ఆర్మీ కూడా సపోర్ట్ గా ఉండొచ్చు. అంతమాత్రాన అంతా మీడియా వల్లే అయిపోతుందనుకుంటే ఎట్లా? సరిగ్గా గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు…

మీడియా సపోర్ట్ ఫుల్లుగా ఉండొచ్చు, సోషల్ మీడియాలో సెటైర్లు వేసే సీబీఎన్ ఆర్మీ కూడా సపోర్ట్ గా ఉండొచ్చు. అంతమాత్రాన అంతా మీడియా వల్లే అయిపోతుందనుకుంటే ఎట్లా? సరిగ్గా గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇదే ఫార్ములాని నమ్మి బాగా దెబ్బతిన్నారు. 

వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటే పర్లేదు కానీ, ఇంకా అదే ఊబిలో కూరుకుపోతున్నారు. ఎంతలా అంటే.. ఓ పక్క అసెంబ్లీ జరుగుతుంటే, మరో పక్క మాక్ అసెంబ్లీ అంటూ బాబు రచ్చచేశారు.

మాక్ అసెంబ్లీతో ఎవరికి ప్రయోజనం..? ఏంటి ప్రయోజనం..?

అసెంబ్లీ ఒకరోజే కదా అని బహిష్కరించడం దారుణమైన విషయం. బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ నేతలు.. స్థానిక ఎన్నికల వైఫల్యాలు, తిరుపతి ఉప ఎన్నికల పరాభవం, రఘురామ ఎపిసోడ్ లో బఫూన్ కావడం.. ఇలాంటి వాటన్నిటినుంచి తప్పించుకున్నామని సంబరపడుతున్నారు. అయితే అదే సమయంలో మాక్ అసెంబ్లీ అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేయడం మాత్రం మరో పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకోవడమే.

అసలీ మాక్ అసెంబ్లీతో ఎవరికి ఉపయోగం, అది ఎక్కడ జరిగింది, ఎవరికి కనిపించింది, ఎవరికి వినిపించింది. సదరు మాక్ వ్యవహారాన్ని సగటు ప్రజలు ఎలా చూస్తారన్న ఆలోచన కూడా బాబుకి లేకపోవడం విచిత్రం. ఇలాంటి వ్యవహారాలకు కామెంట్లు, లైక్ లు వస్తాయి కానీ ఓట్లు రావు.

మీడియా, సోషల్ మీడియాకు పరిమితం అయ్యే ఇలాంటి మాక్ వ్యవహారాన్నిటినీ చూసుకుని చంద్రబాబు ఇంకా భ్రమల్లో కూరుకుపోతున్నారు. ప్రజల్లో ఉండాల్సిన ప్రతిపక్షనేత, ఎక్కడో దూరంగా పరాయి రాష్ట్రంలో తలదాచుకోవడం, కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోవడం దేనికి సంకేతం. ఇలాంటి పరాయి రాష్ట్ర కిరాయి నేతల్ని తెలుగు ప్రజలు ఎందుకు ఆదరించాలి?

కుప్పంలో కూసాలు కదులుతున్నాయి అని తేలగానే పరిగెత్తుకుంటూ వెళ్లి రెండు రోజులు మకాం వేసి వచ్చిన బాబు, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు. నట్టేట ముంచినా కూడా.. ఇంకా చంద్రబాబు మీడియా హడావిడినే నమ్ముకున్నారు.

రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ లో కాలి గాయాలు మీడియాలో హైలెట్ చేసి ప్రజల్లో సింపతీ తెచ్చుకోగలిగారు కానీ, వైద్యుల్ని మాయ చేయలేకపోయారు కదా, కోర్టుల్ని తప్పుదారి పట్టించలేకపోయారు కదా. ఇలాంటి చీప్ ట్రిక్స్ తో, పచ్చమీడియా తప్పుడు రాతలతో తానింకా రాష్ట్రానికి నాయకుడిని అనే భ్రమల్లో ఉన్నారు బాబు. 

అందుకే జగన్ ని కాదని, తానే సభా నాయకుడిగా మాక్ అసెంబ్లీ పెట్టుకున్నారు. బహుశా రాబోయే రోజుల్లో టీడీపీ నేతలెవరూ అసెంబ్లీ మెట్లెక్కకపోయినా పర్లేదు, ఇలాంటి డూప్ వ్యవహారాలతో నెట్టుకొచ్చేయొచ్చు. ఎలాగూ గెలిచేంత సీన్ లేదు కాబట్టి, రాబోయే రోజుల్లో వీళ్లకు ఇదే అసెంబ్లీ.