ఉత్తుత్తి మాటల బదులు పందెం పెట్టుకోరాదా చంద్రబాబూ!

కీలకమైన కొందరు రాజకీయ నాయకులకు వారి తిరుగులేని ప్రాబల్యాన్ని నిరూపించే సొంత నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. అలాంటి నియోజకవర్గాలలో వారిని ఓడించడం గురించి ఎవరూ ప్రయత్నించరు, పట్టించుకోరు, సాహసించి భంగపడాలని అనుకోరు!  Advertisement పైకి…

కీలకమైన కొందరు రాజకీయ నాయకులకు వారి తిరుగులేని ప్రాబల్యాన్ని నిరూపించే సొంత నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. అలాంటి నియోజకవర్గాలలో వారిని ఓడించడం గురించి ఎవరూ ప్రయత్నించరు, పట్టించుకోరు, సాహసించి భంగపడాలని అనుకోరు! 

పైకి ఎన్ని మాటలు చెప్పినా తాము ఎన్నికల బరిలో తలపడే స్థానాల్లో ఆ కీలకమైన వాటిని మినహాయించి మిగిలిన వాటిని లెక్క వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం లాగానే, వైఎస్ కుటుంబానికి నీరాజనం పడుతూ ఉండే పులివెందుల నియోజకవర్గం కూడా ఒకటి.

పులివెందుల నియోజకవర్గంలో వైయస్సార్ కుటుంబం లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢంకా బజాయించి గెలుస్తారనే స్క్రిప్టును దేవుడు తిరగరాస్తున్నాడని ఈసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఓడిపోతాడని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెబుతున్నారు. 

తమ కీలక ప్రత్యర్థిని సొంత నియోజకవర్గంలో కూడా ఓడించాలని కోరుకోవడం రాజకీయంలో తప్పు కాదు! కానీ, అందుకోసం చాలా కసరత్తు జరగాలి. కష్టపడాలి. వ్యూహం ప్రకారం ముందుకు సాగాలి. పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని అనుకుంటే, అందుకోసం గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఏం కసరత్తు చేసింది? ఏం కష్టం చేశారు గనుక ఇవాళ తమ పార్టీని ప్రజలు గెలిపిస్తారని వారు అనగలుగుతున్నారు! ఇవన్నీ ప్రశ్నలే!!

అదేవిధంగా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనను ఓడించాలని వైఎస్ఆర్సిపి కలగనడం కూడా తప్పు కాదు. అయితే ఆ కలను నిజం చేసుకోవడానికి ఈ నాలుగేళ్లలో వారు చాలా పెద్ద కృషి చేశారు. కుప్పం మునిసిపాలిటీలో తెలుగుదేశాన్ని అత్యంత దారుణంగా ఓడించి తమ వశం చేసుకోవడం ఆ కృషి ఫలితమే. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ మరింతగా బలోపేతం కావడానికి స్థానికనేతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు. 

వైనాట్ 175 అనే నినాదం లో భాగంగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా గెలుచుకోవాలని సీరియస్ గానే పావులు కలుపుతున్నారు. అలాంటి నిర్మాణాత్మక కృషి నామమాత్రంగా కూడా చేయకుండా.. పులివెందులలో జగన్ ఓడిపోతాడంటూ చంద్రబాబు గాలి కబుర్లు పోగేసి మాట్లాడుతున్నారు!

పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని ఆయనకు నిజంగా అంత నమ్మకం ఉంటే కనుక ఓ పందెం పెట్టుకోవచ్చు కదా అనేది పలువురి సందేహం. కావలిస్తే కుప్పంలో తాను ఓడినా, లేదా పులివెందులలో జగన్ ను ఓడించ లేకపోయినా రాజకీయ సన్యాసం చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే బాగుంటుంది. 

అప్పుడు అటు పులివెందులలో జగన్ ను ఓడించడానికి గానీ, కుప్పంలో ఆయనను గెలిపించడానికి గానీ తెలుగు తమ్ముళ్లకు ఒక కాంపిటీటివ్ స్పిరిట్ ఉంటుంది. అలాంటి పందేలు లేకుండా.. ఉబుసుపోని మాటలు ఎన్ని చెబితే ఏం లాభం అని ప్రజలు అంటున్నారు..!