ఎమ్బీయస్‌: ఎస్‌ బ్యాంక్‌ను ఎందుకు విలీనం చేయలేదు?

ముందే చెపుతున్నా- పై ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నా మదిలో మెదిలిన ప్రశ్నను మీముందు ఉంచుతున్నానంతే! దీనితో బాటు నాకు యింకో సందేహం కూడా ఉంది. బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభం గురించి…

ముందే చెపుతున్నా- పై ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నా మదిలో మెదిలిన ప్రశ్నను మీముందు ఉంచుతున్నానంతే! దీనితో బాటు నాకు యింకో సందేహం కూడా ఉంది. బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభం గురించి కనీసం మూడేళ్లగా బీభత్సమైన కథనాలు వచ్చేసి, నిఘా సంస్థలుప్రతీదీ పట్టిపట్టి చూస్తున్నాయని అందరూ అనుకుంటున్న యీ సమయంలో ఎస్‌ బ్యాంకు వ్యవహారాలను యింతదాకా ఎందుకు రానిచ్చారు? అని. ఈ రెండు సందేహాలకూ లింకుందేమో ప్రస్తుతానికైతే తెలియదు

మార్చి 5న ఎస్‌ బ్యాంకు పతనం గురించి చెపుతూనే నిర్మలా సీతారామన్‌ యిదంతా యుపిఏ ప్రభుత్వ నిర్వాకమే అనడం చాలా హాస్యాస్పదంగా తోచింది. ఏడంతస్తుల మేడపై ఎనిమిదో అంతస్తు వేసి చూపించుకుంటూ, 70 ఏళ్లగా ఎవరూ ఏమీ చేయలేదు, అంతా మా ఘనతే అంటున్నారు. పునాదుల నుంచి ఏడంతస్తుల దాకా కట్టిన వారెవరూ లేకుండానే ఎనిమిదో అంతస్తు వెలుస్తుందా!? ఇక యిలాటి వైఫల్యాల  దగ్గరకు వచ్చేసరికి పాతవాళ్లదే పాపమంతా అనేస్తున్నారు. ఎందుకంటే ఖాయిలా పడిన ఖాతాలన్నీ ఆ సమయంలో ప్రారంభించినవే అని వాదన. మీకో ఉదాహరణ చెప్తాను. నేనో బ్యాంక్‌ మేనేజర్ని. ఒకతన్ని కస్టమరుగా పరిచయం చేసి, అతని వ్యాపారం విస్తరించడానికి సరైన సమయంలో ఋణాలిస్తూ, అతని అభివృద్ధికి తోడ్పడ్డాను. అతనూ ఎప్పటికప్పుడు ఋణాలు తీర్చేస్తూ మంచి కస్టమరుగా ఉన్నాడు. 

నాకు బదిలీ అయిపోయింది. నా తర్వాతి మేనేజరు అతనితో ‘నీకేమైనా చాదస్తమా? ఇలా అయితే ఎప్పటికి పైకి వస్తావ్‌? మెషినరీ కొనకుండానే దొంగబిల్లులు తెచ్చేయి. నేను ఋణాలు యిచ్చేస్తాను. తిరిగి చెల్లించకపోయినా ఏమీ అనను, నీకొచ్చే లాభంలో వాటా ఇయ్యి.’ అన్నాడు. వాళ్లిద్దరూ కలిసి బ్యాంకును ముంచిన సంగతి బైటకు రాగానే నా తర్వాతి మేనేజరు ‘నాదేమీ లేదండీ, పాతాయన పరిచయం చేసిన కస్టమరేనూ’ అంటే ఒప్పుతుందా? ఎవరు పరిచయం చేసినా డిపాజిటర్ల డబ్బుతో డీల్‌ చేసేటప్పుడు ఋణగ్రహీతలపై నిరంతరం నిఘా వేసి ఉంచాలి. పాలు పొంగిపోతూ ఉంటే చూస్తూ కూర్చుని అదేమంటే ‘పొయ్యి మీద పాలు పెట్టినది వేరే వారు’ అంటే ఎలా? బాధ్యత నీకు అప్పగించాక పొంగకుండా చూడాల్సింది నువ్వే!

ఎస్‌ బ్యాంకు విషయంలో జరిగిందేమిటి? 2014 మార్చి నాటికి అది యిచ్చిన ఋణాులు రూ.56 వేలకోట్లు, 2019 నాటికి రూ. 241 వేల కోట్లు. అంటే 4.4 రెట్లు ఎక్కువ పెరిగాయి. 2014 మార్చి నాటికి దాని డిపాజిట్లు ఎంత? రూ. 74 వేల కోట్లు. 2019 మార్చి నాటికి  రూ. 210 వేల కోట్లు. అంటే 2.8 రెట్లు పెరిగాయి. అంటే 2014 మార్చి నాటికి ఉన్న తూకం 2019 నాటికి తప్పిందన్నమాట. ఒక్కసారిగా 2019లో డబ్బు పంచిపెట్టారని, అందువలననే యింత పెరిగిపోయిందని అనుకోవడానికి లేదు. ఏటేటా పెరుగుతూ పోయింది. మామూలుగా బ్యాంకులలో ఏటేటా ఋణవృద్ధి రేటు 7`8% ఉంటోంది. ఇప్పుడు ఎస్‌ బ్యాంకును ఆదుకుంటున్న మహామహా స్టేటు బ్యాంక్‌ విషయంలోనే 9% ఉంది.

కానీ ఎస్‌ బ్యాంక్‌ విషయంలో సరాసరిన 35% ఉంది. 2015 మార్చికి రూ. 76 వేల కోట్లు. (38% పెరిగింది), 2016 మార్చికి రూ.98 వేల కోట్లు (30%), 2017 మార్చికి రూ.132 వేల కోట్లు. (35%), 2018 మార్చికి రూ. 204 వేల కోట్లు (54%), 2019 మార్చికి రూ.241 వేల కోట్లు (19%). దీనిలో గమనించవలసిన మరో విషయం ఏమిటంటే 2017 నవంబరులో నోట్ల రద్దు తర్వాత, జిఎస్‌టి తర్వాత పరిశ్రమలన్నీ కుప్పకూలి, బ్యాంకులు ఎవరికైనా సరే అప్పులివ్వడానికి అడిలి చస్తూ ఉంటే ఎస్‌ బ్యాంక్‌ అదే సమయంలో డబ్బు పంచిపెట్టేసింది. 2017 మార్చి అంతానికి అది రూ. 132 వేల కోట్లు యిస్తే రెండేళ్ల తర్వాత అంటే 2019 మార్చి నాటికి అది రూ. 241 వేల కోట్లయింది. అంటే 82% పెరిగింది. ఎందుకిలా అసాధారణంగా పెరిగిపోతోంది, ఎవరికి యిస్తున్నారు, అనైనా రిజర్వ్‌ బ్యాంక్‌ చూసుకోవద్దా? అడగవద్దా?

ఋణాలివ్వగానే సరి కాదు, అవి ఎలా నడుస్తున్నాయో చూసుకోవాలి. వాయిదాలు సరిగ్గా కట్టకపోతే అవి నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఏ) అవుతాయి. వాటి గురించి యిప్పుడు అందరికీ అవగాహన వచ్చేసింది కాబట్టి విశేషంగా రాయవలసిన అవసరం లేదు. ఏ బ్యాంకుకైనా మొత్తం ఋణాల్లో ఎన్‌పిఏ శాతం తక్కువుంటే అది బాగా నడుస్తున్నట్లు లెక్క, ఎక్కువుంటే పరిస్థితి బాగా లేదని అర్థం. అందువలన బ్యాంకు  ఖాతా ఖాయిలా పడినా ఎన్‌పిఏగా చూపించకుండా లోనుని రీస్ట్రక్చర్‌ చేయడం, గడువు పెంచడం వంటి ట్రిక్కులు వేస్తూ ఉంటాయి. ఇలాటి వాటిని అరికట్టడానికి ఆర్‌బిఐ 2015 ఎక్యూఆర్‌ (అసెట్‌ క్వాలిటీ రిపోర్ట్‌) పై పట్టుబట్టింది. ఎస్‌ బ్యాంక్‌ విషయంలో 2016 మార్చి నాటికి అది రూ.749 కోట్లను ఎన్‌పిఏగా చూపించింది కానీ నిజానికి ఆ ఫిగర్‌ రూ.4926 కోట్లు అని తేలింది. ఆ మేరకు మీరు లోన్లను రీక్లాసిఫై చేయండి అని ఆర్‌బిఐ ఎస్‌ బ్యాంకును ఆదేశించింది.

తప్పనిసరి పరిస్థితుల్లో 2017 మేలో ఎస్‌ బ్యాంక్‌ యీ విషయాన్ని స్టాక్‌ మార్కెట్‌కు వెల్లడిస్తూ, ‘మీరేమీ బెంగ పడనక్కరలేదు, మేం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రకటించింది. ఇంకో ఐదు నెలలు గడిచేసరికి అంటే 2017 అక్టోబరులో ‘ఆర్‌బిఐ యింకో రూ.6355 కోట్లు ఎన్‌పిఏను కనిపెట్టింది’ అని చెప్పుకోవలసి వచ్చింది. బ్యాంకు నిర్వాకం అప్పుడే బయటపడింది. అయినా బ్యాంకు లోన్లు యిస్తూ పోయింది. 2018 మార్చి నాటికి గత ఏడాది కంటె 54% ఎక్కువ ఋణాలిచ్చింది. 2019 డిసెంబరు నాటికి మొత్తం ఋణాల్లో 19% ఎన్‌పిఏలు ఉన్నాయి. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులలో 12.7% ఉన్నాయని ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ రిపోర్టు తెలిపింది.

మొండిబాకీలు యిలా పోగుపడుతూ ఉంటే ఆర్‌బిఐ గుడ్లప్పగించి చూస్తోందా? ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఏం చేస్తోంది? బ్యాంకు యాజమాన్యాన్ని నిలదీయకుండా బ్యాంకు ప్రమోటర్‌ రాణా కపూర్‌ తన షేర్లు అన్నీ అమ్ముకుని వెళ్లేదాకా ఎందుకు ఓపిక పట్టింది? నాకెవరో ఇన్వెస్టర్లున్నారు. వాళ్లు వచ్చి బ్యాంకును ఉద్ధరించేస్తారు అని అతను చెప్తూ ఉంటే ఓహో అలాగా అని నోట్లో వేలేసుకుని ఎందుకు కూర్చుంది?  రేటింగు సంస్థలు రేటింగు తగ్గించేస్తూ ఉంటే నీ బ్యాంకులో పెట్టుబడి పెట్టేవాడెవడు అని అడగాలా వద్దా? నువ్వేదో మాయమాటలు చెప్పి ఇన్వెస్టర్లను తెస్తే తేవనూ వచ్చు. అంతమాత్రాన లోన్‌ పోర్ట్‌ఫోలియో చక్కబడిపోతుందా? ఎన్‌పిఏలన్నీ మాయమై పోతాయా? చిత్తమొచ్చినట్లు అర్హత లేనివారందరికీ ఋణాలు యిస్తూ పోతే వాళ్లందరూ డబ్బు వెనక్కి కట్టేస్తారా? అని అడగకుండా ఆర్‌బిఐ కాలక్షేపం చేసింది.

పైన అభయహస్తం ఉంది, వీళ్లు మననేమీ చేయలేరన్న ధీమాతో రాణా కపూర్‌ 2018 ఆగస్టులో ‘నన్ను కంపెనీ ఎండీగా, సిఇఓగా మరో మూడేళ్లు పొడిగించండి’ అని అడిగాడు. ఆర్‌బిఐ గవర్నరుగా ఉన్న ఊర్జిత్‌ పటేల్‌ కుదరదు పొమ్మన్నాడు. అంతకుమించి యాక్షన్‌ తీసుకోవడానికి ఊర్జిత్‌కు అనుమతి లభించలేదు. రాణాపై చర్య తీసుకోవాల్సిందేనని ఊర్జిత్‌ పట్టుబట్టారని, కానీ ప్రభుత్వ పెద్దలు అంగీకరించకపోవడంతో చికాకు వేసి రెణ్నెళ్ల తర్వాత రాజీనామా చేశాడని అంటున్నారు. తక్కిన కారణాలు కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా ఊర్జిత్‌ రాజీనామా తర్వాత ఆర్‌బిఐ ఎస్‌ బ్యాంకుపై ఫైన్లతో సరిపెట్టింది తప్ప రాణాను శిక్షించలేదు. పైగా 2019 జనవరి చివరి వరకు అతని టెర్మ్‌ను పొడిగించింది. ఎందుకు అలా చేసిందని కారణాలు చెప్పలేదు.

అతను ఇన్వెస్టర్ల గురించి చెప్పినవన్నీ గాలి కబుర్లని అందరికీ తెలిసిపోయాక తన షేర్లు, కుటుంబం షేర్లు అన్నీ అమ్ముకుని, డబ్బు చేసుకుని 2019 జనవరిలో వెళ్లిపోయాక 2019 మార్చి నాటికి ఉన్న ఎన్‌పిఏ కంటె రూ. 2299 కోట్లు తక్కువగా చూపించాడని ఆర్‌బిఐ కనుగొంది. అయినా రాణాని అడిగిన పాపాన పోలేదు. అతను వెళ్లినప్పటి నుంచి ఆర్‌బిఐ నియమించిన బోర్డు పాపాల పుట్టను తవ్వుతూ, తవ్వుతూ యిన్నాళ్లకు బ్యాంకు డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇప్పుడు దాన్ని బయటపడేయడం ఎస్‌బిఐ, యితర యిన్వెస్టర్ల బాధ్యత అయింది. అనగా ఎస్‌ బ్యాంక్‌ పాపాన్ని మోసే భారం ఆ బ్యాంకు డిపాజిటర్లపై పడిందన్నమాట.

అసలీ బ్యాంకుకు యీ గతి ఎందుకు పట్టింది? అన్ని విధాలా భ్రష్టమైన కంపెనీలకు ఋణాలు యివ్వడం చేత! అప్పటికే పీకలదాకా అప్పుల్లో మునిగిన కార్పోరేట్లకు ఉదారంగా అప్పులిచ్చింది. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎస్సెల్‌, ఓడాఫోన్‌, అన్నిటికి మించి అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌ (అడాగ్‌)కి భారీగా యిచ్చింది. నిజానికి నోట్ల రద్దు తర్వాత అనేక బ్యాంకులు కార్పోరేట్లను బాగా బిగించి, అదుపు తప్పిన ఖాతాలు సరిచెయ్యమని పట్టుబట్టాయి. అప్పుడు అవి ఎస్‌ బ్యాంకుకి వచ్చి, వీళ్ల దగ్గర డబ్బు తీసుకుని వాటికి కట్టాయి. తీసుకున్న డబ్బును వ్యాపారంలో పెట్టి లాభాలార్జిస్తే వీళ్లకు అప్పు తీర్చగలుగుతాయి. అది లేకుండా ఏం చేయగలుగుతాయి? చేతులెత్తేశాయి. వాళ్లతో పాటు బ్యాంకూ మునిగింది. అప్పిచ్చేటప్పుడు దీనితో ఏం చేస్తున్నావని బ్యాంకు అడగవద్దా? 15 ఏళ్లగా అస్తిత్వంలో ఉన్న బ్యాంకుకి ఆ విషయం తెలియదా? తెలియకపోతే దాదాపు పది పర్యవేక్షక వ్యవస్థలున్నాయి. అవైనా అడగవద్దా?

ఎస్‌ బ్యాంకును ఎలాగైనా నిలబెడదామని ప్రభుత్వం పట్టుదలతో ఉందని అర్థమయ్యాక, దానికి ఇండిపెండెంటు డైరక్టర్లలో ఒకరిగా ఉన్న ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ ఉత్తమ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌ నిర్వహణా సమస్యలు (గవర్నెన్స్‌ ఇస్యూ) ఉన్నాయంటూ రాజీనామా చేశారు. ఇప్పుడు ఎస్‌బిఐను బలిపెట్టి ఎస్‌ బ్యాంకును బతికించి ఉంచాలనే ప్రతిపాదనను ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నరు ఎన్‌.ఎస్‌.విశ్వనాథన్‌ వ్యతిరేకించారని వినికిడి. బ్యాంకుల, ఎన్‌బిఎఫ్‌సిల పర్యవేక్షణలో ఆయన నిపుణుడు. తనెంత చెప్తున్నా ప్రభుత్వం వినకపోవడంతో బాధపడి రిటైర్‌మెంట్‌కు మూడు నెలల ముందే అనారోగ్య కారణాలు చెప్పి వాలంటరీగా పదవి వదిలేశారు. మీరొకటి గమనించారో లేదో, మోదీ తీసుకుని వచ్చిన ఆర్థిక సలహాదారులు, ఆర్‌బిఐ గవర్నర్లు అందరూ బయటకు వచ్చాక అతని విధానాల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజానికి అందరి ఆలోచనాధోరణీ ఒకటే. కానీ అమలు చేయటం నీయలేదని వారి అభియోగం.

ఎస్‌ బ్యాంకు ప్రయివేటు బ్యాంకుల్లో నాలుగో పెద్ద బ్యాంకు. ప్రయివేటు బ్యాంకులనే కాదు, కార్పోరేట్లు కూడా ఎలా ఎదుగుతున్నాయో గమనిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ లిస్టెడ్‌ కంపెనీలన్నీ ఒక బోర్డు చేత నడపబడతాయి. ప్రమోటర్లు కంపెనీ ఎండీగా, సిఇఓగా ఉంటూ బోర్డుకి జవాబుదారీగా ఉంటారు. బోర్డులో ఇండిపెండెంట్‌ డైరక్టర్లుంటారు. వీళ్లు సాధారణంగా రిటైరైన టాప్‌ గవర్నమెంట్‌ బ్యూరోక్రాట్స్‌, మిలటరీ అధికారులు, పబ్లిక్‌ సెక్టార్‌లో పెద్ద పొజిషన్లలో ఉన్నవారు అయి వుంటారు. వీళ్ల కారణంగా ప్రభుత్వ కారిడార్లలో ఫైళ్లు తొందరగా కదులుతాయి, లైసెన్సులు వస్తూ ఉంటాయి. అంతేకాదు, డిపాజిటర్లలో విశ్వాసాన్ని రగిలించేందుకు వీళ్లు పనికి వస్తారు. కానీ వీళ్లెవరూ ఆడిటింగ్‌ సరిగ్గా చేయటం లేదు. ప్రమోటర్లను ప్రశ్నించటం లేదు. ఒకవేళ అడిగితే బయటకు పొమ్మంటారని తెలుసు.

ప్రమోటర్లు తమకు తాము డైనమిక్‌ అని పబ్లిసిటీ బాగా తెచ్చుకుంటారు. ఇక  రూల్సు వంచడంలో, అధిగమించడంలో తమ నైపుణ్యం చూపిస్తారు. అడ్డదారుల్లో పనులు చేసుకుని వస్తూ ఉంటే మీడియా దగ్గర్నుంచి అందరూ ‘స్మార్ట్‌’ అని మెచ్చుకుంటూ ఉంటారు. వాణిజ్యసంస్థలు, కన్సల్టెన్సీలు ఎవార్డులపైన ఎవార్డులు యిచ్చేస్తూ ఉంటారు. ఇక పెద్ద పెద్ద సంస్థలు కూడా వీటిల్లో డిపాజిట్లు పెడుతూంటాయి. టిటిడి పెద్ద డిపాజిట్టు పెట్టి తీసేసింది కానీ పూరీ జగన్నాథాలయంవి రూ. 550 కోట్లు బ్యాంకులో యిరుక్కుపోయాయి. ఇవన్నీ ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయకుండా యిలాటి రిస్కున్న బ్యాంకుల్లో ఎందుకు పెడతాయి?  వడ్డీ కోసమేనా? లేక నిర్వహణాధికారుల కమిషన్ల కోసమా? ఇప్పుడు మారటోరియం విధించాక లబోదిబో మంటున్న పెన్షనర్లు, డిపాజిటర్లు వీళ్లు ఎక్కువ వడ్డీ యిస్తాననగానే యిక్కడ డిపాజిట్‌ చేస్తారు. ఆర్‌బిఐ వీళ్లను అడ్డుకోకుండా డిపాజిటర్లను మోసం చేయనిస్తుంది.

తమ డబ్బు ఎలా వినియోగమవుతోందో డిపాజిటర్లకు తెలియదు. ప్రయివేటు బ్యాంకు అద్భుతం అని ప్రభుత్వమే బాకా ఊదుతుంది. వీళ్లని చూసి బుద్ధి తెచ్చుకోమని పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు నీతులు చెప్తూ ఉంటుంది. అంతా మునిగాక ఒడ్డున పడేయడానికి మళ్లీ పబ్లిక్‌ సెక్టారే గతి. బ్యాంకు మునగడంతో ఉద్యోగుల్లో, డిపాజిటర్లలో, షేర్‌ మార్కెట్లో అంతటా కలకలం. దేశ ఆర్థికపరిస్థితి  అల్లకల్లోలమైపోతోంది కాబట్టి రక్షిస్తున్నాం అంటూ పబ్లిక్‌ సెక్టార్‌ ఫండ్స్‌ వాడేస్తారు. ఇప్పుడు చూడండి ఎస్‌బిఐని 49% వాటా తీసుకోమంటున్నారు, ఎల్‌ఐసిని 10% వాటా తీసుకోమంటున్నారు. అంటే అసమర్థతకు మారుపేరైన పబ్లిక్‌ సెక్టారే దిక్కెందుకు అవుతోంది? ఇవాళ అవి ఉన్నాయి కాబట్టి వాడుకుంటున్నారు. రేపు మొత్తమంతా ప్రయివేటీకరణ చేశాక, ఎవరిని బలిపశువు చేస్తారట?

మేనేజ్‌మెంట్‌ సరిగ్గా లేక, ఏదైనా బ్యాంకు దెబ్బ తిన్నపుడు మరో పెద్ద పటిష్టమైన బ్యాంకులో విలీనం చేయడం యిప్పటిదాకా జరుగుతూ వస్తోంది. అప్పుడు డిపాజిటర్లకు ధీమా చిక్కుతుంది. వెంటనే విత్‌డ్రా చేయడానికి ఎగబడరు. బ్యాంక్‌పై ‘రన్‌’ రాదు. మోదీ ప్రభుత్వం వచ్చాక అనేక బ్యాంకులను విలీనం చేసేస్తోంది. అన్ని విలీనం చేయగాలేనిది యీ ఎస్‌ బ్యాంక్‌ అస్తిత్వాన్ని మాత్రం ఎందుకు కాపాడుతోంది అన్నదే అర్థం కావటం లేదు. ఇతర ప్రయివేటు బ్యాంకులను కూడా ఒత్తిడి చేసి యిన్వెస్ట్‌ చేయిస్తోంది. ఫైనాన్షియల్‌ ఎసెస్‌మెంట్‌ చేసి అవి యిన్వెస్ట్‌ చేసి ఉంటే పోనీలే అనుకోవచ్చు.

2019 డిసెంబరు 31 నాటికి ఎస్‌ బ్యాంకు పరిస్థితి ఎలా ఉందో అంకెలు బయటకు వచ్చాయి. డిపాజిట్లు రూ. 1.66 లక్షల కోట్లు. లోన్లు రూ. 2.14 లక్షల కోట్లు. 2014 మార్చితో పోలిస్తే డిపాజిట్లు 110 వేల కోట్లు పెరిగితే, అప్పులు 150 వేల కోట్లు పెరిగాయి.  వీటిల్లో ఎన్‌పిఏలు రూ.40,709 కోట్లు. కాపిటల్‌ ఏడిక్వసీ రేటు కేవం 4.1%! నష్టాలు చూడబోతే రూ.18,564 కోట్లు! సమస్య ఏమిటంటే ఎస్‌ బ్యాంకు ఋణాల్లో 70% కార్పోరేట్‌ రంగానికి యిచ్చినవే అంటున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో కార్పోరేట్ల గతి ఎలా ఉందో అందరికీ తెలుసు. పైగా ఇప్పటికే దివాలా తీసేసిన కంపెనీలకు భారీగా అప్పులిచ్చిన ఎస్‌ బ్యాంకులో ఎవరైనా బుద్ధి ఉన్నవాడు పెట్టుబడి పెడతాడా? మీరు పెట్టుబడి పెట్టండి, ఫలానా ఎక్స్‌పర్ట్‌ వచ్చి దాన్ని దారిలో పెట్టి లాభాలు తెప్పిస్తాడు అని ప్రభుత్వం ఎవరైనా మొనగాణ్ని చూపిస్తోందా? లేదే! అయినా రూ.2 ముఖలువ ఉన్న షేరును ఎస్‌బిఐ చేత రూ.10 కు కొనిపించడమేమిటి? మూడేళ్ల దాకా మీ పెట్టుబడి 26% తగ్గడానికి వీల్లేదని చెప్పడమేమిటి?

ఎస్‌ బ్యాంకు స్థాయి పెంచడానికి దాని ఆథరైజ్‌డ్‌ కాపిటల్‌ను రూ. 800 కోట్ల నుంచి రూ. 5000 కోట్లకు పెంచారు. ఎస్‌బిఐ చేత రూ.2450 కోట్లు పెట్టిస్తున్నారు. ఎస్‌బిఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అంచనా ప్రకారం ఎస్‌ బ్యాంకు ఆథరైజ్‌డ్‌ కాపిటల్‌ను రూ. 20 వేల కోట్లకు పెంచాల్సి వస్తుంది. దానిలో ఎస్‌బిఐ వాటా రూ.9800 కోట్లు ఉంటుంది. ఇది తక్కువ వడ్డీ రేట్లకు ఎస్‌బిఐలో డిపాజిట్‌ చేసిన వారి సొమ్ము. ఈ డబ్బుతో ఎస్‌ బ్యాంక్‌ డిపాజిటర్లకు ఎక్కువ వడ్డీ యిస్తారు. వారెవా! ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే ఎస్‌బిఐ చైర్మన్‌ దేశ ఆర్థికపరిస్థితి కాపాడడం కోసం అంటున్నారు. అది బ్యాంకు పని కాదు, ఆర్‌బిఐ పని, ప్రభుత్వం పని. తమ పదవులు కాపాడుకోవడం కోసం ప్రభుత్వం చెప్పినట్లు ఆడుతున్నారు తప్ప బ్యాంకు శ్రేయస్సు కోసం ధిక్కరించే ధైర్యం కనబరచటం లేదు.

62 ఏళ్ల రాణా కపూర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో 16 ఏళ్లు, గ్రిండ్లేస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులో రెండేళ్లు పని చేశాడు. తర్వాత తోడల్లుడు అశోక్‌ కపూర్‌తో కలిసి ఒక ఎన్‌బిఎఫ్‌సి నెలకొల్పి, ఐదేళ్ల తర్వాత  దానిలో వాటాలమ్మి ఎస్‌ బ్యాంకుకు నిధులు సంపాదించారు. రాణాకు 26% వాటా అశోక్‌కు 11% వాటాతో బ్యాంకు వెలసింది. అశోక్‌ 2008 నాటి 26/11 ముంబయి దాడుల్లో మరణించాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం 2019 జనవరిలో రాణా నెట్‌ వర్త్‌ 377 మిలియన్‌ డాలర్లు ఉంది. ఇప్పుడు బ్యాంక్‌ కుప్పకూలాక సిబిఐ అతనిపై లంచం, మనీ లాండరింగ్‌ కేసులు మోపింది. మార్చి 8న అరెస్టయ్యాడు. ఇన్నాళ్లూ రాణా ఆహా, రాణా ఓహో అంటూ వచ్చిన మీడియా వేరే రకమైన కథనాలు రాస్తోందిప్పుడు.

విజయ మాల్యా, నీరవ్‌ మోదీ, మరోరు, మరోరు… వీళ్లందరిదీ ఒకే రకమైన కథ. వాళ్లు మోసగాళ్లు సరే, మోసం జరగనిచ్చినవారి మాటేమిటి? నీరవ్‌ మోదీ సంఘటన తర్వాతైనా ఆడిటింగ్‌ పటిష్టం చేయాలి కదా. చేయలేదని స్పష్టమౌతోందిగా! మరి ఎవరిది తప్పు? పది రకాల పర్యవేక్షక సంస్థలది తప్పు. వాటిని నడిపించేవారిది తప్పు. వారిని అడించేవారిది తప్పు. ఆ తప్పులకు శిక్ష లేదా? జవాబుదారీతనం లేదా?  మోదీ ఏమన్నాడు? ‘న ఖావూంగా, న ఖానే దూంగా’ అన్నాడు కదా. మరి యిక్కడ తిననిస్తున్నాడుగా. తను తినటం లేదు కాబట్టి అతనికి యీ పాపం అంటదు అంటే మన్‌మోహన్‌ సింగ్‌ విషయంలోనూ అదే వాదన చేయాలి. ఆయన సొంతానికి పైసా తీసుకోలేదు. (తీసుకుని ఉంటే యీ పాటికి ఎప్పుడో పట్టుకుని వుండేవారు) కానీ వ్యవస్థలను కుళ్లబెట్టేశాడు. అందుకే కాంగ్రెసు పార్టీని అందరూ ఛీకొడుతున్నారు.

దాని నుంచి మోదీ ఏం నేర్చుకున్నాడు? ‘నాకు కుటుంబం లేదు, డబ్బు అవసరం లేదు’ అని చెప్పవచ్చు. కానీ పర్యవేక్షక సంస్థలను ఎందుకు విఫలం చేస్తున్నాడు? మోదీ భక్తులకు యిది తోచదు. ఏదైనా మంచి జరిగితే మోదీ ఖాతాలో వేస్తారు. ఇలాటి చెడు జరిగితే వ్యవస్థల లోపమండీ, ఆయన ఎన్నని చూసుకోగలడు అంటారు. ఇక్కడ నాకు ఓ కథ గుర్తుకు వస్తుంది. గతంలో చెప్పినా మళ్లీ చెప్పుకోవచ్చు. ఓ కుగ్రామంలో ఓ ముసలామె యింట్లో దొంగలు పడి దోచుకుని పోతే ప్రజల ఆస్తికి రక్షణ లేకుండా పోయిందంటూ ఆమె రాజుగారికి శాపనార్థాలు పెడుతోంది. మారువేషంలో అటు వచ్చిన రాజు ఆమెతో ‘ఎక్కడో రాజధానిలో వున్న రాజు యీ మూల జరిగేదాన్ని ఎలా చూసుకోగలడు? తిట్టే ముందు కాస్తయినా ఆలోచించాలి’ కదాని మందలించాడు. ‘చూసుకోగలిగినంతే ఏలుకోమను. తగుదునమ్మానని యింత రాజ్యం ఏలడానికి తయారవడం దేనికి?’ అని ఝాడించేసిందామె.

ఇది ఏ పాలకుడికైనా వర్తిస్తుంది. వ్యవస్థలను కాపాడి వాటి చేత పని చేయించే బాధ్యత తీసుకోవాలి. పోలీసు వాళ్లకు ఫ్రీ హ్యేండ్‌ యిస్తే అల్లర్లను పూటలో అణిచివేయగలుగుతారు. ఇవ్వకుండా ‘నువ్వు అటువైపు చూడకు, ఎవరైనా ఫిర్యాదు చేసినా పట్టించుకోకు’ అంటే ఎస్‌బాస్‌ అంటారు. నేరస్తుడు డిన్నర్‌ పార్టీలో ఉన్నట్టు పత్రికలలో ఫోటోలు వచ్చాయి కదా, పట్టుకుని అరెస్టు చేయలేదేం అని కోర్టు అడిగితే ‘మాకు కనబడలేదు యువరానర్‌’ అంటారు. ఇక్కడ పోలీసు వ్యవస్థది లోపం కాదు, దాన్ని వాడేవాళ్లది తప్పు. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ వంద ఏళ్లగా పనిచేస్తోంది. ఈ మధ్య జరిగినన్ని ఆర్థికనేరాలు ఎన్నడూ జరగలేదు. యుపిఏ హయాంలో శిఖరానికి చేరాయని అనుకున్నా, పరిస్థితి చక్కదిద్దడానికి గత ఆరేళ్లలో ఎన్‌డిఏ ఏం చేసింది అనే ప్రశ్న ఆటోమెటిక్‌గా వస్తుంది కదా! మన్‌మోహన్‌ ఐతే సోనియా చేతిలో కీలుబొమ్మ. కానీ మోదీ సర్వాధికారాలను గుప్పిట్లో పెట్టుకున్న ఆటోక్రాట్‌. అనిల్‌ అంబానీ వంటి ఆర్థిక నేరస్తుణ్ని విదేశాలకు వెంటబెట్టుకుని వెళ్లి అతనికి అనుభవం లేని రక్షణరంగంలో విదేశీ కాంట్రాక్టు యిప్పించడం ద్వారా నిఘా సంస్థలకు ఎలాటి సందేశం యిచ్చాను అని మోదీ సమీక్ష చేసుకోవాలి.

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020) 
  [email protected]