ప్రతి కీలక దశలోనూ జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందమైంది జగన్ సర్కార్ వ్యవహారం. మూడు రాజధానుల బిల్లునే తీసుకొందాం. అసెంబ్లీలో బ్రహ్మాండమైన మెజార్టీ ఉండటం వల్ల మూడు రాజధానుల బిల్లుపై చర్చ జరిపి, ఆడుతూ పాడుతూ పాస్ చేసుకున్నారు.
ఇక ఆ బిల్లు మండలికి వచ్చింది. మండలిలోటీడీపీకి సంఖ్యా బలం ఉంది. దీంతో కీలకమైన బిల్లుపై చర్చ జరిగి…పాస్ చేయడమా లేక తిప్పి పంపడమా, రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుందని సామాన్య ప్రజల మాదిరే సీఎం జగన్ సహా ఆయన మంత్రి వర్గం భావించింది.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువ అంచనా వేసి మండలిలో బొక్క బోర్లా పడింది. రూల్ 71 ప్రకారం మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టకుండా మండలిలో టీడీపీ పక్షనేత నేతృత్వంలో అడ్డుకున్నారు. దీంతో వైసీపీకి దిమ్మ తిరిగింది. ఆ బిల్లును మండలిలో ప్రవేశ పెట్టేందుకు అనేక తర్జనభర్జనల అనంతరం ఓ కొలిక్కి వచ్చింది. వికేంద్రకరణ బిల్లును మండలిలో ప్రవేశ పెట్టగానే అయిపోలేదు. మండలిలో తీవ్ర గందరగోళం మధ్య చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపారు. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో భారీగా ఏకగ్రీవాలు చేసుకున్నామన్న ఆనందం వైసీపీకి ఎంతో సేపు లేకుండా ప్రతిపక్ష టీడీపీ ఎత్తుగడ వేసింది. ఎన్నికల ప్రక్రియపై ఎప్పటికప్పుడు వీడియోలు తీస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేస్తూ వచ్చాయి. అలాగే పనిలో పనిగా ఎన్నికల సంఘం కూడా కరోనా సాకుతో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకొంది.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా పది నెలలకు జగన్ తెలుగు మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ధర్మమేనా అని ఆయన ప్రశ్నించాడు. సీఎం మాట్లాడిన తర్వాత వైసీపీ మంత్రులు, ఎంపీలు పోటీలు పడి నిమ్మగడ్డను తిట్టిపోశారు. వైసీపీకి చెందిన ఓ ఎంపీ మరీ దూకుడుగా వెళ్లి నానా తిట్లు తిట్టాడు. ఇలా ధోరణులు రాజకీయ కాలుష్యాన్ని పెంచుతాయే తప్ప ఎలా ప్రయోజనం కలిగించవు.
కానీ ప్రతి కీలక దశలోనూ ప్రతిపక్ష టీడీపీ చేతిలో వైసీపీ చావు దెబ్బ తినాల్సి వస్తోందన్న వాస్తవాన్ని ముందుగా గ్రహించాలి. ఎంత సేపూ ప్రజలు తమకు 151 సీట్లు కట్టబెట్టారని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. జగన్ సర్కార్‌లో అనేక మంది సలహాదారులున్నారు. మరి వీళ్లంతా జగన్‌కు ఏం సలహాలిస్తున్నట్టు? అంత మంది సలహాదారుల నుంచి జగన్ ఎలాంటి విలువైన సలహాలు తీసుకుంటున్నట్టు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవీపీ, ఉండవల్లి, ధర్మాన, ఆనం రామనారాయణరెడ్డి లాంటి బలమైన పరిజ్ఞానం, వాగ్ధాటి కలిగిన నేతలు రక్షణ కవచంగా పనులు చక్కదిద్దేవారు. ఇప్పుడు జగన్‌కు అలాంటి వాళ్లు మచ్చుకు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. ఎంతసేపూ జగన్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని తమ పబ్బం గడుపుకుందామనే వాళ్లే కనిపిస్తున్నారు. దీనివల్ల జగన్ సర్కార్ ప్రజల్లో పరపతి కోల్పోతోంది. ఈ విషయాన్ని జగన్ గుర్తించే పరిస్థితి కనిపించడం లేదు.
కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతోంది. ఈ నష్టానికి ఏదో ఒక దశలో అడ్డుకట్ట వేయకపోతే రాబోవు సంవత్సరాల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంతిమంగా జగనే నష్టపోతాడు. అధికారం లేకపోతే …ముందుగా జగన్‌ను వీడేది కూడా ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న భజనపరులే. కావున సీఎం జగన్ పునరాలోచించి సరైన వ్యూహకర్తలను నియమించుకుని, పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని….గత కొన్ని నెలల్లో కీలక పరిణామాల్లో ఎదురైన చేదు అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి.