రమ్యకృష్ణ కెరీర్ ను బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పుకోవాలి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ సినిమాలో ఆమె చేసిన శివగామి పాత్ర రమ్యకృష్ణకు లైఫ్ టైమ్ గుర్తింపు తీసుకొచ్చింది. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ పాత్రల ఎంపిక విధానం కూడా మారిపోయింది. ఆమె కోసం మేకర్స్ ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ పాత్రే రమ్యకృష్ణ కోసం తయారైంది.
రీసెంట్ గా సాయితేజ్-దేవకట్ట కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకుంటున్నారు. పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో రమ్యకృష్ణ ఈ సినిమాలో కనిపించబోతోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ద్వారానే విలనిజం చూపిస్తారని తెలుస్తోంది.
నిజానికి బాహుబలితో రమ్యకృష్ణకు మంచి పేరైతే వచ్చింది కానీ, ఆ తర్వాత ఆమె నుంచి మంచి సినిమాలైతే రాలేదు. ఆమె చేసిన శైలజారెడ్డి అల్లుడు సినిమా ఫ్లాప్ అయింది. హలో మూవీలో చేసిన తల్లిపాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీతో పాటు సాయితేజ్-దేవకట్టా సినిమాకు కూడా ఓకే చెప్పింది. ఈ రెండు సినిమాలకు తనను మళ్లీ ట్రాక్ పైకి తీసుకొస్తాయని గట్టిగా నమ్ముతోంది రమ్యకృష్ణ.