ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం ఫెయిల్ అవడానికి కారణాలు అనేకం. వాటిలో ఒకటి టీడీపీ అతి. బయోపిక్ సినిమాని తెలుగుదేశం పార్టీ నాయకులు అతిగా ఓన్ చేసుకోవడం. సినిమా షూటింగ్ టైమ్ నుంచీ ఈ ఓవర్ యాక్షన్ ఉన్నా… రిలీజ్ టైమ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా ప్రచారం చేసి బాలయ్య, ఆయన బావయ్య మెప్పు పొందాలని చూశారు.
దీంతో ఆటోమేటిగ్గా సినిమాకి టీడీపీ కలర్ వచ్చేసింది. అందుకే మిగతా వాళ్లెవరూ బయోపిక్ వైపు కన్నెత్తి చూడలేదు, దీంతో ఓపెనింగ్స్ కి భారీగా కోతపడింది. ఈలోపే సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
దీంతో రియలైజ్ అయిన బాలకృష్ణ రెండోపార్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పార్ట్-1 మిగిల్చిన చేదు అనుభవాన్ని కొన్నిరోజులు వాయిదా వేయడానికే సినిమాని ఫిబ్రవరి 14కు పోస్ట్ పోన్ చేశారు. దీనికితోడు ప్రచారంలో కూడా టీడీపీ నేతలెవరికీ చోటివ్వకూడదని నిర్ణయించారు.
రిలీజ్ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు హడావిడి చేయకుండా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పార్టీ ప్రస్తావన లేకుండా చేయాలనుకుంటున్నారు. అయితే మహానాయకుడు విషయంలో ఇలా చేయాలనుకోవడం సరికాదని కొంతమంది బాలకృష్ణకు హితబోధ చేస్తున్నారట.
కథానాయకుడు ఆయన సినిమా కథ అయితే, మహానాయకుడు పూర్తిగా రాజకీయ కోణం. మరి టీడీపీ ప్రస్తావన, పార్టీనేతల ప్రమేయం లేకుండా సినిమా ఎలా జనాల్లోకి వెళ్తుందని అడుగుతున్నారు. అయితే బాలయ్య మాత్రం ఈ విషయంలో మంకుపట్టుతో ఉన్నాడని తెలుస్తోంది.
సినిమా సినిమాలాగే రిలీజ్ కావాలని అంటున్నాడట. పార్ట్-1 విషయంలో జరిగిన తప్పిదాలను పార్ట్-2లో రిపీట్ కాకుండా చూడాలనుకుంటున్నాడు. ఇంతకీ బాలయ్య ప్రయత్నం ఫలిస్తుందా? టీడీపీ దూరంగా ఉంటే మహానాయకుడికి మంచి జరుగుతుందా?
నిజానికి బాలయ్య చేయాల్సింది మహానాయకుడ్ని టీడీపీకి దూరం చేయడం కాదు, సినిమాను ప్రజలకు దగ్గర చేయడం.