అల్లుఅర్జున్ కు ప్రచారం సరదా పట్టుకుందా? లేక తనకు ఎలాగూ సమీపంలో సినిమాలు లేవు కనుక, ఈ విధంగా లైవ్ లో వుండాలనుకుంటున్నాడా? ఏదో సంక్రాంతికి సరదా చుట్టాలింటికి, ఫంక్షన్ కు వెళ్లి, ఈ హడావుడి ఏమిటి? ఈ ఓపెన్ టాప్ వెహికిల్ యాత్ర లేమిటి? ఈ జనసమీకరణ, హడావుడి ఏమిటి?
సంక్రాంతికి బన్నీ పాలకొల్లు వెళ్లాలని డిసైడ్ అయిన దగ్గర నుంచి మొదలైంది హడావుడి. వాస్తవానికి బన్నీ పాలకొల్లు వెళ్లింది అక్కడ ఓ చుట్టాల ఇంట్లో ఓ ఫంక్షన్ వుంది అని. అయితే సంక్రాంతి కలిసి వచ్చింది. దీంతో ముందుగానే బన్నీ ఈసారి సంక్రాంతి పాలకొల్లులో చేసుకుంటారహో… అనే ఫీలర్లు మొదలయ్యాయి.
అరగంట అడియో ఫంక్షన్ అయితేనే బన్నీ టీమ్ ముందుగా వెళ్లి వాలిపోతుంది. అలాంటిది రోజుల తరబడి కార్యక్రమం అంటే చెప్పేది ఏముంది? టీమ్ వెళ్లింది. ఇక హడావుడి మొదలయింది. గ్రూప్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు, ఊరేగింపులు ఎక్స్ ట్రా. ఎక్స్ ట్రా.
వాస్తవానికి గోదావరి జిల్లాల్లో సినిమా పిచ్చి ఇంతా అంతా కాదు. జబర్దస్త్ నటులు వెళ్లినా జనం వేలాదిగా మూగేస్తారు. అభిమానం అలాంటిది. మరి బన్నీ వస్తే జనం రారా? దానికోసం బైకుల ర్యాలీలు, ఓపెన్ టాప్ ఊరేగింపులు, అభివాదాలు. ఇదేమన్నా రాజకీయాలు, ఓట్లు, ఎన్నికల వ్యవహారమా?
దీంతో జనసేన నుంచి పాలకొల్లు అభ్యర్థిగా అల్లుఅర్జున్ సన్నిహితుడు బన్నీ వాస్ పోటీ చేస్తారని, అందుకే ఇదంతా అని గ్యాసిప్ లు. నిజానికి బన్నీ వాస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో లేరు. పవన్ కళ్యాణ్ ఓపెన్ ఆఫర్ అయితే బన్నీవాస్ కు వుంది కానీ, ఈ ఎన్నికల్లో చేయనని ఇప్పటికే బన్నీ వాస్ స్పష్టం చేసారు.
మరి ఇలాంటి నేపథ్యంలో హీరో బన్నీ ఎందుకు ఇదంతా చేస్తున్నట్లు? మళ్లీ రెండే కారణాలు కనిపిస్తున్నాయి.. ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఒకటి బన్నీకి ప్రచారం తహ తహ పెరిగిందని, రెండవది సినిమాల గ్యాప్ పెరుగుతూ పోవడంతో, ఈ విధంగా లైమ్ లైట్ లో వుండాలని అనుకుంటున్నారని.