ప్రొబేషన్ కు ఓటీఎస్ తో లింక్ పెడితే తప్పేంటి?

ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం, వివాదాలు రేపే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియాకు అలవాటుగా మారిపోయింది. మొన్నటివరకు టెన్త్ క్లాస్ ఫలితాలపై రాద్దాంతం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను టార్గెట్ చేసింది.…

ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం, వివాదాలు రేపే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియాకు అలవాటుగా మారిపోయింది. మొన్నటివరకు టెన్త్ క్లాస్ ఫలితాలపై రాద్దాంతం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను టార్గెట్ చేసింది.

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈమధ్య తీపి కబురు అందించారు. వాళ్లకు ప్రొబేషన్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు శాశ్వతం అవుతున్నాయి. ఓవైపు వీళ్లంతా ఇలా ఆనందంగా ఉంటుంటే, మరోవైపు ఎల్లో మీడియా పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఇళ్ల క్రమబద్దీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ కు, ఉద్యోగుల ప్రొబేషన్ కు అధికారులు లింక్ పెట్టారు. ప్రజల నుంచి వసూలు చేసిన 82.46 కోట్ల రూపాయల మొత్తంపై ఇంకా లెక్క తేలలేదు. ఆ లెక్క తేల్చాల్సిన బాధ్యత గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై ఉంది. అది తేలిన తర్వాతే సంబంధించి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగికి ప్రొబేషన్ ఇస్తారు.

ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇప్పటివరకు ఉద్యోగులు నిర్వర్తించిన బాధ్యతే ఇది. దానికి లెక్కలు అప్పజెప్పే పనుల్లో వాళ్లు ఉన్నారు. చలానాలు జనరేట్ చేసే పనిలో ఉన్నారు. అంతమాత్రానికే ఓటీఎస్ కు, ప్రొబేషన్ కు లింక్ పెట్టారని, ఉద్యోగుల్ని టెన్షన్ లో పెట్టారంటూ ఎల్లో మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

ఒక ఉద్యోగికి ప్రొబేషన్ ఖరారు చేసేముందు, అతడి పనితీరు మదింపు వేయడం తప్పా? అప్పటివరకు అతడు నిర్వర్తించిన బాధ్యతల్లో పెండింగ్ పనులుంటే వాటిని పూర్తిచేయాలని పురమాయించడం తప్పు ఎలా అవుతుంది? దీన్ని పెద్ద పనిగా ఉద్యోగులు ఫీల్ అవ్వడం లేదు. కానీ ఎల్లోమీడియా మాత్రం తెగ ఫీల్ అయిపోతోంది.