తప్పు చేయడం అన్నది మనిషి లక్షణం. ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయనివాడు మాత్రం గొప్పోడు. కానీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేసేవారిని బోయపాటి అనాలేమో? లెజెండ్ పెద్దహిట్. కానీ నిర్మాతలకు నష్టమా? లాభమా? అన్నది వాళ్లనే ఆఫ్ ది రికార్డుగా అడిగితే చెబుతారు అసలు సంగతి. దమ్ము సినిమా సంగతి జనాలకు తెలిసిందే. ఆ తరువాత వంతు జయజానకీ నాయకకు వచ్చింది. పాపం ఈ సినిమాతో ఓ మంచి నిర్మాత కుదేలైపోయారు.
సినిమాలకు దూరంగా వున్నారు. లేటెస్ట్ గా వినయ విధేయరామ. ఈ సినిమా గురించి యూనిట్ జనాలు ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నిర్మాత చేత బోయపాటి డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేయించేసారట. బీహార్ బ్యాక్ డ్రాప్ కోసం అజర్ బైజాన్ వద్దని మొత్తుకున్నా బోయపాటి వినలేదట.
వైజాగ్ తనకు సెంటిమెంట్ ఒక్క సీన్ అయినా తీయాల్సిందే అన్నారట. ఓపెనింగ్ లో వచ్చే అయిటమ్ సాంగ్ కోసం కోట్లు కుమ్మరించేసారట. ఇలా సినిమా కోసం కోట్లు ఖర్చు చేయించేసారు. ఇంత భారీ సినిమా నిర్మించినా కూడా నిర్మాత దానయ్యకు గట్టిగా అయిదు కోట్లు కూడా మిగలలేదట.
భారీ పెట్టుబఢి, వడ్డీలు, భారీగా సాగించిన ప్రచారం, పైగా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ కు లాభాల్లో వాటా అన్నీపోగా మిగిలింది చాలా తక్కువంట. సాధారణంగా బోయపాటి సినిమాలకు నిర్మాతలు బలవుతుంటారు. ఇప్పుడు ఈ సినిమాకు మాత్రం అవుట్ రేట్ కొనుక్కున్న యువి క్రియేషన్స్ సంస్థ బలయిపోయింది.
72 కోట్ల రేటు, ఖర్చులు పెడితే, గట్టిగా యాభై కోట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఈ సినిమా తరువాత బోయపాటి చేస్తారని వినిపిస్తున్న సినిమా నందమూరి బాలకృష్ణ స్వంత సినిమా. లెక్కలు పెట్టి మరీ ఖర్చు చేసే దర్శకుడు క్రిష్ తోనే షూటింగ్ టైమ్ లో నిత్యం కిందామీదా అయ్యింది ఎన్టీఆర్ బయోపిక్ కు.
అలాంటిది డబ్బులు మంచి నీళ్లలా ఖర్చుచేయించే బోయపాటి అక్కడ సినిమా చేయడం సాధ్యమేనా అన్నది అనుమానంగా వుంది. బయోపిక్ తో లాభాలు చేసుకున్నా, సినిమా బయ్యర్లు మాత్రం దారుణంగా దెబ్బతిన్నారు. మరి బోయపాటితో తమ బ్యానర్ మీద రెండో సినిమా తీస్తే, ఏమవుతుందో మరి?