టీడీపీ పాత కాపులతో ఎన్టీయార్ తనయుడు

తెలుగుదేశం పార్టీ పుట్టినపుడు పెట్టినపుడు పాతికేళ్ల వయసు ఉన్న యువకులు అంతా రాజకీయాల్లోకి వచ్చేశారు. వారి ఉడుకు రక్తాన్ని ఎన్టీయార్ తన కొత్త రాజకీయ పార్టీకి ఇంధనంగా మార్చుకున్నారు. అలా తెలుగుదేశం ఒక తరాన్ని…

తెలుగుదేశం పార్టీ పుట్టినపుడు పెట్టినపుడు పాతికేళ్ల వయసు ఉన్న యువకులు అంతా రాజకీయాల్లోకి వచ్చేశారు. వారి ఉడుకు రక్తాన్ని ఎన్టీయార్ తన కొత్త రాజకీయ పార్టీకి ఇంధనంగా మార్చుకున్నారు. అలా తెలుగుదేశం ఒక తరాన్ని రాజకీయాలకు చేరువ చేసింది. రాజకీయ వాసనలకు దూరంగా ఉన్న వారిని సైతం తెచ్చి అందలం అందించి అధికార పదవులు దక్కించిన ఘనత ఎన్టీఆర్ కే చెందుతుంది.

ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలు 2022 మే 28 నుంచి మొదలై ఈ ఏడాది మే 28లో ముగిసాయి. విశాఖలో ఎటువంటి కార్యక్రమం జరగలేదు. దాంతో స్మార్ట్ సిటీలో ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన తనయుడు నందమూరి రామక్రిష్ణ హాజరయ్యారు.

ఎన్టీయార్ తెలుగు జాతికి చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి ఉన్న నాయకులు ఇపుడు చాలా మంది కనిపించడంలేదు. అయితే రామక్రిష్ణ తో పాటు పాత కాపులు అంతా ఈ కార్యక్రమంలో కనిపించడం విశేషం.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, ఆర్ ఎస్ డీపీ అప్పల నరసింహ రాజు వంటి వారు ఎన్టీయార్ రాజకీయ ప్రస్థానం గురించి తలచుకున్నారు. పైసా ఖర్చు లేకుండా రాజకీయాలు ఎలా చేయవచ్చో ఎన్టీయార్ నిరూపించారని వారు గుర్తు చేసారు. డబ్బున్న వారికే రాజకీయం అనుకున్న రోజుల నుంచి అందరికీ రాజకీయం అన్న దానికి తీసుకెళ్లిన వారు ఎన్టీయార్ అని వారు కొనియాడారు.

విశాఖకు ఎన్టీయార్ తనయుడు రావడం విశేషం అయితే ఈ కార్యక్రమం పెట్టడం వెనక ఉద్దేశ్యం ఏంటి అన్నది ఇపుడు రాజకీయాల్లో తర్జన భర్జనగా ఉంది. వచ్చే ఎన్నికల్లో రామక్రిష్ణ పోటీకి దిగుతారా అన్న దాని మీద తెలుగుదేశంలో చర్చిస్తున్నారు.ఎన్టీయార్ తనయుడుగా బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు. రామక్రిష్ణ కూడా రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నారని అంటున్నారు.