ఆయ‌న‌కు తెలుగు జాతి సెల్యూట్ చేస్తుంద‌న్న జగ‌న్‌

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అనారోగ్యంతో మృతి చెంద‌డంతో తెలుగు స‌మాజం షాక్‌కు గురైంది. అనారోగ్యంతో ఆయ‌న చికిత్స పొందుతున్నార‌ని, త్వ‌ర‌గా కోలుకుని వ‌స్తార‌ని అంద‌రూ భావించారు. అయితే పాట‌ను మాత్రం మిగిల్చి ఆయ‌న దివికేగారు.…

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అనారోగ్యంతో మృతి చెంద‌డంతో తెలుగు స‌మాజం షాక్‌కు గురైంది. అనారోగ్యంతో ఆయ‌న చికిత్స పొందుతున్నార‌ని, త్వ‌ర‌గా కోలుకుని వ‌స్తార‌ని అంద‌రూ భావించారు. అయితే పాట‌ను మాత్రం మిగిల్చి ఆయ‌న దివికేగారు. ఆయ‌న మృతిపై ప‌లువురు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు. ఈ నేప‌థ్యంలో గ‌ద్ద‌ర్ మృతిపై సీఎం వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

గ‌ద్ద‌ర్ మృతిపై వైఎస్ జ‌గ‌న్ సంతాపం ప్ర‌క‌టించారు. అదేంటో తెలుసుకుందాం. “బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల విప్ల‌వ స్ఫూర్తి గ‌ద్ద‌ర్‌. ఆయ‌న పాట ఎప్పుడూ సామాజిక సంస్క‌ర‌ణ పాటే. గ‌ద్ద‌ర్ నిరంత‌రం సామాజిక న్యాయం కోస‌మే బ‌తికారు. గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం ఊహించ‌లేనిది. సామాజిక న్యాయ ప్ర‌వ‌క్త‌ల భావాలు, మాట‌లు, వారి జీవితాలు ఎప్ప‌టికీ స్ఫూర్తినిస్తూ జీవించే వుంటాయి. గ‌ద్ద‌ర్‌కు తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. గ‌ద్ద‌ర్ కుటుంబ స‌భ్యుల‌కు మ‌న‌మంతా బాస‌ట‌గా వుందాం” అని సీఎం జ‌గ‌న్ త‌న సంతాప ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

గద్ద‌ర్ సుదీర్ఘ కాలం పాటు విప్లవ రాజ‌కీయాల్లో కొన‌సాగారు. తుపాకి గొట్టం ద్వారా మాత్ర‌మే బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు రాజ్యాధికారం ద‌క్కుతుంద‌నే మావోయిస్టుల ఆలోచ‌నా విధానాల‌కు ఆక‌ర్షితుడై అడ‌వి బాట ప‌ట్టారు. ఆ త‌ర్వాత ఆయ‌న జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోయారు. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు ఆయ‌న ప్ర‌యాణం సాగింది. 

ఇటీవ‌ల ఆయ‌న సొంతంగా రాజ‌కీయ పార్టీని కూడా స్థాపించారు. ఇవాళ మ‌న ముందు విగ‌త జీవిగా గ‌ద్ద‌ర్ మిగిలారు. గ‌ద్ద‌ర్ జీవితంలో రెండు కోణాలున్నాయి. స‌మాజాన్ని ప్ర‌భావితం చేసేలా ఆయ‌న గ‌ళ‌మెత్తారు. వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్న‌ట్టు గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం ఎవ‌రూ ఊహించ‌నిది. తెలుగు స‌మాజంలో త‌న‌కంటూ ఒక పేజీని మిగిల్చిపోయారు. ఆయ‌న వ్యక్తిత్వానికి సెల్యూట్ చేయాల్సిందే.