దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే విశ్వవ్యాప్తం అని చెబుతారు. ఇపుడు కరోనాను కూడా అలాగే అనుకోవాల్సి వస్తోంది. కరోనాకు కాదేదీ అనర్హమైన చోటు అన్నట్లుగా సీన్ ఉంది.
విశాఖలో కరోనా కేసులు ప్రతీ రోజూ రెండు వేలకు తక్కువ కాకుండా నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో డాక్టర్లు, న్యాయవాదులు, అద్యాపకులు, వ్యాపారులు, సామాన్యులు ఇలా అన్ని వర్గాల ప్రజానీకం కరోనా కాటుకు బలి అవుతున్నారు.
ఇపుడు విశాఖలోని కేంద్ర కారాగారంలో కూడా కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. విశాఖలో ఉన్న ఈ కారాగారంలో 120కి పైగా ఖైదీలు ఉంటే ఇందులో 60 మంది దాకా కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది.
తాజాగా ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే కరోనా బాధితులు పెద్ద సంఖ్యలో తేలారు. దీంతో ఇంత మందికి వైద్యం గురించి కారాగారం సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. వారిని అక్కడే ఉంచితే మొత్తానికి మొత్తం కరోనా చుట్టుకుంటుందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.