టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు విసురుతుంటారు. విజయసాయిరెడ్డి ట్వీట్లలో వ్యంగ్యం, దెప్పి పొడుపు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. తండ్రీకొడుకులైన చంద్రబాబు, లోకేశ్‌లపై విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఒంటికాలిపై లేస్తుండడం గత కొంత కాలంగా చూస్తున్నాం.
తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తనదైన స్టైల్‌లో వెటకారాలతో విమర్శలను కొనసాగించారు. చార్మినార్ కూడా తానే కట్టానని చంద్రబాబు అంటారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం ఆకట్టుకుంది. చంద్రబాబుపై విరుచుకుపడిన ఆ ట్వీట్ సంగతేంటో చూద్దాం.
“ఇదీ హైదరాబాద్‌లో జెనోమ్ వ్యాలీ తానే పెట్టాను అంటూ పదేపదే డబ్బా కొట్టే ఫేక్ విజనరీ, మీడియా మేడ్ మాన్ చంద్రబాబు బతుకు -అన్నీ దొంగ మాటలు, డొల్లతనమే. ఈ జీవి జీవితమే అంత. వినే వాడుంటే చార్మినార్ కూడా నేనే కట్టా అంటాడు” చంద్రం అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఇటీవల తన ముందు చూపు వల్లే శాంతాబయోటెక్, భారత్ బయోటెక్ లాంటి ఫార్మా పరిశ్రమలను నెలకొల్పారని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇదే విషయమై విజయసాయిరెడ్డి కూడా ఘాటుగా స్పందించడం విశేషం.