ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు పలువురు మంత్రులు బడ్జెట్ సమావేశాల్లో మాస్కులు ధరించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక్కటి కాదు, ఏకంగా రెండు రకాల మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు ఒక వైపు హెచ్చరిస్తుంటే, మరోవైపు సాక్ష్యాత్తు ఏపీ ముఖ్యమంత్రి మాత్రం కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. యథా సీఎం తథా మంత్రులు అన్నట్టు …మంత్రులతో పాటు ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మాస్కులు ధరించకుండానే కనిపించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాస్క్ ధరించకపోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. మాస్క్‌ను ధరించకుండా జనానికి ఎలాంటి సందేశం ఇస్తారని జగన్‌ను లోకేశ్ నిలదీశారు. జగన్‌ను ప్రశ్నిస్తూ సాగిన ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.
‘ముఖ్యమంత్రి గారూ! మాస్క్ ధరించడం తప్పనిసరి అని మీ ఫొటో, పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారు. ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు?
తొలి విడతలో కోవిడ్ వైరస్ చిన్నపాటి జ్వరం లాంటిదేనని, పారాసెటమాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చల్లితే చస్తుంది ..ఇట్ కమ్స్ ఇట్ గోస్.. ఇట్ షుడ్‌బీ నిరంతర ప్రక్రియ, సహజీవనం అంటూ ఫేక్ మాటలతో వేలాది మందిని బలిచ్చారు.
సెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మశానంగా మారుతుంటే చిరునవ్వులు చిందిస్తూ, మీరే మాస్క్ ధరించకుండా ఇంకెన్ని వేలమంది ప్రాణాలు పణంగా పెడతారు? మాస్క్ లేకుండా మూర్ఖుడిగా ఉంటారో, మాస్క్ వేసుకుని మనిషినని నిరూపించుకుంటారో మీ ఇష్టం’ అని నారా లోకేశ్ ఘాటు ట్వీట్ చేశారు.
జగన్ తప్పుల కోసం ప్రతిపక్ష నేతలు ఎలా ఎదురు చూస్తున్నారో ఈ ట్వీటే నిదర్శనం. సీఎం మాస్క్ ధరించకపోవడంపై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. అయినా జగన్‌లో మాత్రం తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన కొరవడడం గమనార్హం.
నారా లోకేశ్ ప్రశ్నిస్తున్నారని కాదు కానీ, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం అత్యంత ప్రాధాన్యత అంశం. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రే మాస్క్ ధరించకపోతే, ఇక ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతారని లోకేశ్ ప్రశ్నించడంలో తప్పేం ఉంది.