నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫ్యామిలీకి ఢిల్లీలో కేంద్రపెద్దల నుంచి భరోసా దక్కలేదనే సమాచారం. మర్యాద కోసం విన్నపాలు వింటున్నారే తప్ప, అటు వైపు నుంచి గట్టి హామీ ఏదీ దొరకలేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రఘురామకృష్ణం రాజు అరెస్ట్‌పై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తన భర్తను జైల్లోనే చంపేస్తారని ఎంపీ భార్య రమాదేవి, కుమారుడు భరత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహంలో భాగంగా ఎంపీ భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కేంద్రహోంమంత్రి అమిత్‌షాను వారు కలిశారు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులపై అమిత్‌షా వద్ద ఏకరువు పెట్టినట్టు టీడీపీ, రఘురామ అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి.
విచారణ పేరుతో సీఐడీ పోలీసులు తమ తండ్రిని హింసించారని తెలిపారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేస్తూ జైలుకు పంపారన్నారు. సీఎం వైఎస్ జగన్ బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు… రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ముఖ్యమంత్రి కక్ష కట్టి తమ తండ్రిపై కుట్రపూరితంగా రాజద్రోహం కేసు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు.
అసలేం జరిగిందో, ఎందుకు అరెస్ట్ వరకూ ఎందుకు వెళ్లిందో రాష్ట్రం నుంచి వివరణ కోరుతామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతకు మించి ఎలాంటి భరోసా దక్కకపోవడంతో నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి ఇంటి నుంచి కుటుంబ సభ్యులు నిరాశగా వెనుదిరిగినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను రఘురామ కుటుంబ సభ్యులు కలిశారు. ఎంపీ అరెస్ట్‌కు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే ఆ పద్ధతులేవీ పాటించకుండా రఘురామను అరెస్టు చేయడంపై స్పీకర్‌కు వారు ఫిర్యాదు చేశారు. అలాగే కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడంపై కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. స్పీకర్ స్పందిస్తూ …ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పిస్తానని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి పంపారని సమాచారం.
ఎంపీ అరెస్ట్‌కు లోక్‌సభ స్పీకర్ అనుమతి అవసరం లేదని ఇప్పటికే పలువురు న్యాయ నిపుణులు చెప్పిన సంగతి తెలిసిందే. అరెస్ట్ తర్వాత స్పీకర్‌కు సమాచారం అందిస్తే సరిపోతుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ అనుమతిపై ఓం బిర్లాకు తెలియజేయడాన్ని కేంద్రం లైట్‌గా తీసుకున్నట్టు సమాచారం.
ఆవేదనలో తమ వద్దకు వచ్చిన వారి మాటను కాదనలేక కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని సమాచారం. అంతకు మించి ఈ కేసులో జోక్యం చేసుకునే ఉద్దేశం కేంద్ర పెద్దలకు లేదని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి నిదర్శనం కేంద్ర పెద్దల నుంచి రఘురామకృష్ణంరాజు కుటుంబానికి దొరకని భరోసానే.