మలయాళంలో బిగ్ బాస్ హౌస్ కరోనా బారిన పడింది. బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే వారిలో మొత్తం 8 మందికి కరోనా సోకింది. అయినా కూడా నిర్వాహకులు షో ని ఆపకుండా కంటిన్యూ చేశారు. ఈ సమాచారం బయటకు రావడంతో తమిళనాడు అధికారులు బిగ్ బాస్ హౌస్ పై దాడులు నిర్వహించారు.
చెన్నైలోని ఈవీపీ స్టుడియోలో మలయాళ బిగ్ బాస్ -3 షూటింగ్ జరుగుతోంది. స్థానిక ఆర్డీవో, ఇతర అధికారులు, పోలీసుల సహాయంతో ఈవీపీ స్టుడియోపై దాడులు చేశారు. బిగ్ బాస్ హౌస్ ని సీజ్ చేశారు. కంటెస్టెంట్ లు, కెమెరామెన్ లు, సహాయకులు.. అందరినీ అక్కడి నుంచి తరలించారు. ఈవీపీ స్టుడియోకి నోటీసులు అంటించారు.
మలయాళంలో బిగ్ బాస్ షో కి మొదటి నుంచీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. గతేడాది కొవిడ్ కారణంగా బిగ్ బాస్ సీజన్ 2ని ఏకంగా రద్దు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న బిగ్ బాస్ సీజన్-3 మొదలైంది. ఇప్పటికి 95 రోజులు నిరంతరాయంగా సాగింది. 14 మంది కంటెస్టెంట్ లలో ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. తమిళనాడులో లాక్ డౌన్ పెట్టిన తర్వాత రెండు వారాల పాటు షోని పొడిగించారు.
అయితే బిగ్ బాస్ హౌస్ సిబ్బందికి కరోనా సోకినా నిర్వాహకులు ఆ విషయాలను బయటకు రానివ్వలేదు. చివరకు పోలీసుల సహకారంతో ప్రభుత్వ అధికారులు దాడులు చేసి బిగ్ బాస్ హౌస్ సీజ్ చేయడం సంచలనంగా మారింది.
దీంతో బిగ్ బాస్ సీజన్-3 తాత్కాలికంగా ఆగిపోయినట్టు ప్రకటించింది యాజమాన్యం. పోలీసు దాడుల గురించి మాత్రం ప్రకటించలేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత షో తిరిగి మొదలవుతుందని తెలిపారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో.. ఎక్కడికక్కడ సినిమా షూటింగ్ లు ఆగిపోయినా.. సీరియళ్లు, ఇతర షోలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ షూటింగ్ లపై కూడా అధికారులు దృష్టిపెడుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయంపై నిఘా పెట్టారు.