బన్నీ సినిమా ఇటు.. రామ్ సినిమా అటు

కథలు ఇట్నుంచి అటు మారడం, ముందుగా అనుకున్న హీరో చేతి నుంచి మరో హీరో చేతికి వెళ్లడం ఇండస్ట్రీలో సర్వసాధారణం. కొన్ని కథలకైతే దర్శకులు కూడా మారిపోయిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి రెండు…

కథలు ఇట్నుంచి అటు మారడం, ముందుగా అనుకున్న హీరో చేతి నుంచి మరో హీరో చేతికి వెళ్లడం ఇండస్ట్రీలో సర్వసాధారణం. కొన్ని కథలకైతే దర్శకులు కూడా మారిపోయిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి రెండు ప్రాజెక్టులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెగా కాంపౌండ్ నుంచి రామ్ చేతికి ఓ సినిమా వెళ్తే, అదే రామ్ నుంచి మెగా కాంపౌండ్ లోకి మరో ప్రాజెక్టు వచ్చి చేరింది.

రీసెంట్ గా వరుణ్ తేజ్ కు ఓ కథ వినిపించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. కాస్త గ్యాప్ తీసుకొని, బాగా ఆలోచించి వరుణ్ తేజ్ ఆ స్టోరీకి ఓకే చెప్పాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వస్తుంది.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గతంలో హీరో రామ్ కోసం ప్రవీణ్ సత్తారు రాసుకున్న కథ ఇది. చాన్నాళ్లు స్రవంతి బ్యానర్ దగ్గర ఈ కథ నలిగి ఫైనల్ గా ఆగిపోయింది. బడ్జెట్ ఎక్కువవ్వడంతోనే ఆ సినిమా ఆగిపోయిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు అదే కథ వరుణ్ తేజ్ చేతికొచ్చిందని అంటున్నారు.

ఇక రీసెంట్ గా రామ్ కూడా ఓ సినిమాకు ఓకే చెప్పాడు. లింగుసామి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ కథను గతంలో అల్లు అర్జున్ కు వినిపించాడు లింగుస్వామి. ఎనౌన్స్ మెంట్ కూడా జరిగిన తర్వాత సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథను రామ్ టేకప్ చేస్తున్నాడు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి ఓ కథ రామ్ చేతికొస్తే.. రామ్ వదులుకున్న స్టోరీ ఒకటి మెగా కాంపౌండ్ కు చెందిన వరుణ్ తేజ్ చేతికి చేరింది.