నిర్మాతలు తమ కోసం టికెట్ రేట్లు పెంచుకున్నారు. హీరోలు తమ కోసం పారితోషికాలు పెంచుకున్నారు. థియేటర్ యాజమాన్యాలు మళ్లీ పార్కింగ్ ఫీజు పెట్టుకున్నాయి. మరి సామాన్య సినీ కార్మికుడి పరిస్థితేంటి? అతడికి జీతాలు పెరిగాయా? అందుకే ఇవాళ్టి నుంచి టాలీవుడ్ లో బంద్ మొదలైంది. కనీస వేతనాలు డిమాండ్ చేస్తూ, 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మె షురూ చేశారు.
ఈ మేరకు తెలుగు ఫిలిం ఫెడరేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం నుంచి కృష్ణానగర్ లో సినీకార్మికులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్ లకు తీసుకెళ్లేందుకు జూనియర్ ఆర్టిస్టులు, ఇతర సిబ్బంది కోసం వచ్చిన బస్సులు ఖాళీగా కనిపించాయి. మరికొన్ని బస్సుల్ని ఫెడరేషన్ సభ్యులు అడ్డుకున్నారు. కార్మికులంతా కృష్ణానగర్ లోని తమ యూనియన్ ఆఫీసులకు చేరుకుంటున్నారు.
ఇంతకీ మేటర్ ఏంటి..?
కరోనా తర్వాత అన్ని రేట్లు పెరిగాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు నిర్మాతలు, హీరోలు కూడా హ్యాపీ. కానీ సినీ కార్మికుడి జీతాలు మాత్రం పెరగలేదు. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి 24 విభాగాలకు చెందిన కార్మికుల జీతాలు పెంచాలి. కానీ ఈసారి నాలుగేళ్లయినా జీతాలు పెంచలేదు. మరీ ముఖ్యంగా కరోనా టైమ్ లో ఎన్నో ఇబ్బందులు పడిన కార్మికులకు, జీతాలు పెంచుతామనే హామీ ఇచ్చి మరీ నిర్మాతలు తమ షూటింగులకు వాడుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ సంగతి మరిచారు. అదే ఇప్పుడు సమస్యకు కారణమైంది.
సమ్మె చేయాలా వద్దా అనే అంశంపై నిన్న ఫిలింఫెడరేషన్ ఆఫీస్ లో కీలక చర్చ జరిగింది. వేతనాల పెంపుపై నిర్మాతల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో 24 విభాగాలకు చెందిన కార్మిక సంఘం నేతలతో మాట్లాడి ఇవాళ్టి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు.
ఇకపై ఇలా అడుక్కునే పద్ధతి తీసేసి.. నిర్మాతల మండలి తమతో కనీస వేతన సవరణ ఒప్పందం చేసుకోవాలనే ప్రధాన డిమాండ్ తో సమ్మెకు దిగారు కార్మికులు. ఈ మేరకు ఇవాళ్టి నుంచి షూటింగులు బహిష్కరించారు.
సినిమాలపై ప్రభావం ఎంత..?
చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ కొత్త షెడ్యూల్ నిన్ననే మొదలైంది. అటు నాని దసరా, సాయితేజ్ కొత్త సినిమాతో రామ్ చరణ్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోల సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిపై సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడో సమస్య ఉంది.
24 విభాగాలకు చెందిన యూనియన్లలో వాళ్లలో వాళ్లకు పడదు. యూనియన్ల మధ్య ఐక్యత సంగతి పక్కనపెడితే, ఒకే యూనియన్ లో అభిప్రాయబేధాలున్నాయి. ఉదాహరణకు కెమెరా డిపార్ట్ మెంట్ నే తీసుకుందాం. కెమెరామెన్లంతా ఒకటే యూనియన్. కానీ కొందరు షూటింగ్స్ కు వెళ్తున్నారు, మరికొందరు ఆగిపోతున్నారు. షూటింగ్ కు వెళ్లకపోతే, ఎక్కడ తమ అగ్రిమెంట్ రద్దు చేసి, చెన్నై నుంచి కెమెరామెన్లను తెచ్చుకుంటారో అనేది వీళ్ల భయం.
కేవలం ఈ భయం కెమెరామెన్లలో మాత్రమే కాదు, అన్ని క్రాఫ్టుల్లో ఉంది. ఒక విభాగం సమ్మె చేస్తే, దానికి ప్రత్యామ్నాయంగా మరో యూనిట్ ఇటు బెంగళూరులో, అటు చెన్నైలో సిద్ధంగా ఉంది. దీనికితోడు సొంత యూనియన్ లోని సభ్యుల మధ్య కూడా తేడాలున్నాయి. దీంతో ఈ సమ్మె, ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.