ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా ప్రమోషన్ ఇవ్వకపోవడంపై టీడీపీ, ఒక వర్గం మీడియా తెగబాధపడిపోతోంది. తమకు తాముగా అన్నీ ఊహించుకుని, వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాబోతున్నారని గంటలు, రోజుల తరబడి ప్రత్యేక కథనాలు నడిపి, చివరికి అభాసుపాలయ్యారు. అంతిమంగా తమ రాష్ట్రపతి అభ్యర్థిగా నాయుడు గారు కాదు… గిరిజన మహిళ ద్రౌపది ముర్ము అని బీజేపీ ప్రకటించింది.
వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాకుండా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ అవేవీ కుదర్లేదని ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. వెంకయ్యను అమిత్‌షా, జేపీ నడ్డా కలవడంతో ఇక ఆయన ఎంపిక లాంఛనమే అనే ప్రచారాన్ని ఎల్లో మీడియా ఉధృతంగా చేసింది. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై బీజేపీ మొగ్గు చూపడంతో ఎల్లో మీడియా ఖంగుతింది. దీంతో వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అభ్యర్థి కాకపోవడానికి కారణంపై ఎల్లో మీడియా యూటర్న్ తీసుకుంది.
జగన్‌ను విలన్ చేసే ప్రయత్నంలో ఆయన్ను హీరో చేశామని పశ్చాత్తాప పడింది. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నించారనే సమాచారాన్ని జనంలోకి తీసుకెళ్లిన ఎల్లో మీడియా…. ఆ తర్వాత పరిణామాలతో షాక్‌కు గురైంది. అయితే అప్పటికే పచ్చ బ్యాచ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వెంకయ్యనాయుడును రాష్ట్రపతి కాకుండా జగనే అడ్డుకున్నారనే సంకేతాల్ని మాత్రం ఎల్లో మీడియా విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లింది. ఇందులో జగన్, వెంకయ్యనాయుడులకు ఏ మాత్రం సంబంధం లేకుండానే అన్నీ జరిగిపోయాయి. నిజానికి వెంకయ్యనాయుడుతో జగన్‌కు శత్రుత్వం లేదు. ఇటీవల వెంకయ్యనాయుడు కుటుంబంలో వివాహ శుభకార్యకలాపాలకు జగన్ వెళ్లి వచ్చారు. అయినా తమ ఎజెండాను జనంపై రుద్దడానికి… వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎల్లో మీడియానే ప్రకటించి, జగన్ మెడకు చుట్టి, ఆ తర్వాత యూటర్న్ తీసుకుంది.
దీంతో ప్రధాని మోదీపై ఎల్లో మీడియా ఎక్కుపెట్టింది. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకున్నారనే ప్రచారాన్ని ఒక్కసారిగా ఆపేసింది. వైఎస్ జగన్ ఎక్కడ హీరో అవుతాడో అని టీడీపీ మీడియా నాలుక్కరుచుకుంది. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ అడ్డుకున్నారనే సరికొత్త ప్రచారానికి తెరలేపడం గమనార్హం. ఏబీవీపీ కార్యకర్తగా మొదలుపెట్టి.. జనసంఘ్, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి సుదీర్ఘకాలం ఆ పార్టీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్యను రాష్ట్రపతి పదవి విషయంలో మోదీ విస్మరించారని సదరు మీడియా రాయడం విశేషం.
ఎల్‌కే ఆడ్వాణీని, ఆయన టీమ్‌ను పక్కన పెడుతూ, తన సొంత టీమ్‌ను నిర్మించుకుంటూ వస్తున్న మోదీ.. వెంకయ్యను కూడా పక్కన పెట్టారని రాయడం విశేషం. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేందుకు వెంకయ్య నిరాకరిస్తే, ఆయనపై మోదీ ఒత్తిడి తెచ్చారని రాయడం ద్వారా…రాజకీయాలకు దూరం చేయాలనే కుట్ర జరిగిందని చెప్పకనే చెప్పారు. అనేక సందర్భాల్లో మోదీకి వెంకయ్య అండగా నిలిచినా…. ప్రధాని మాత్రం ఆ స్థాయిలో అభిమానం ప్రదర్శించలేదనే వాదన తెరపైకి తేవడం ప్రాధాన్యం సంతరించు కుంది.
అంతేకాదు, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తున్నది కూడా వెంకయ్యను మంగళవారం కలిసిన కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పలేదని సదరు మీడియా వాపోవడం చూస్తే….ఎల్లో అంతరంగం ఏంటో పసిగట్టొచ్చు. ఇలాంటి రాతలు వెంకయ్యకు గౌరవమో, అగౌరవమో ఎల్లో మీడియా ఆలోచించుకుంటే మంచిది. మోదీ వద్దనుకుంటే వెంకయ్య మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా సేవలు అందించేవారా? ఈ కోణంలో ఎందుకు ఆలోచించరో మరి!