ఆలోచన..మొండితనం..మధ్యలో జగన్

ఆంధ్ర సిఎమ్, వైకాపా నేత వైఎస్ జగన్. ఈ రెండింటికీ తేడా వుంది. ఆంధ్ర సిఎమ్ గా పాలన తదితర వ్యవహారాలు చూసుకోవాలి. వైకాపానేతగా రాజకీయాలు చేయాల్సిందే. మళ్లీ అధికారం సాధించడం కోసం, తనను…

ఆంధ్ర సిఎమ్, వైకాపా నేత వైఎస్ జగన్. ఈ రెండింటికీ తేడా వుంది. ఆంధ్ర సిఎమ్ గా పాలన తదితర వ్యవహారాలు చూసుకోవాలి. వైకాపానేతగా రాజకీయాలు చేయాల్సిందే. మళ్లీ అధికారం సాధించడం కోసం, తనను ఇబ్బంది పెట్టే ప్రత్యర్థులను కట్టడి చేయడం కోసం ఏదో ఒకటి చేయాల్సిందే. లేదా పార్టీ జనాలు చేతగాని నాయకుడి కింద జమకడతారు. 

కానీ జగన్ అటు సిఎమ్ గా కానీ, ఇటు పార్టీ నేతగా కానీ ఓ బలమైన ప్రతిపక్షాన్ని ఢీకొనడం లేదు. ప్రతిపక్షం అంత గొప్ప బలంగా ఏమీ లేదు. కానీ జగన్ అటు సిఎమ్ గా, ఇటు పార్టీ నేతగా ఢీ కొంటున్నది ఓ బలమైన సామాజిక వర్గాన్ని. ప్రతి వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ఓ బలమైన వర్గాన్ని, 

అంగబలం, అర్థబలం, మీడియా బలం, వ్యవస్థల్లో వేళ్లూనుకున్న వారి అండదండలు అన్నీ కలిసి ఓ బలమైన వర్గంగా మారిపోయింది. దశాబ్దాల కాలంగా అప్రతిహతంగా సాగుతున్న తమ హవాకు జగన్ అడ్డుకట్ట వేసేసరికి ఆ వర్గం తట్టుకోలేకపోతోంది. అలా అని జగన్ రాజీ పడడం లేదు. ఆ వర్గాన్ని చేరదీయడం లేదు. ఇప్పటి వరకు ఏ సిఎమ్ అధికారంలో వున్నా, ఏ పార్టీ అయినా ఆ వర్గానికి వచ్చిన ఢోకా లేదు. పనులు చేసుకున్నారు. వ్యాపారాలు సాగాయి. ఆఖరికి వైఎస్ జమానాలో కూడా.

కానీ జగన్ వచ్చిన తరువాత అలా కాదు. ఆ సామాజిక వర్గ చరిత్రలోనే ఇంతటి గడ్డుకాలం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఇలా వదిలేస్తే మరో రెండేళ్ల తరువాత పరిస్థితి ఏమిటి? జగన్ మళ్లీ సిఎమ్ అయితే ఇక ఆ సామాజిక వర్గం దశ, దిశ ఎటు? పైగా కేంద్రలో మోడీ సహకారం కూడా అంతంతమాత్రంగా వుంది. కేంద్రంలో హవా సాగించే వీలు కనిపించడం లేదు. అందువల్ల తక్షణం ఏదో ఒకటి చేసి జగన్ ను గద్దె దించాలి.

అర్జునుడిని ఒక్క రోజు దూరంగా పంపిస్తే చాలు, మిగతా నేను చూసుకుంటాం అనుకున్నారు కౌరవులు. అదే మాదిరిగా జగన్ అధికారంలో లేకుండా వుంటే చాలు, వైకాపాను కకావికలు చేయడం అన్నది సులువు. భారతి సిఎమ్ అయినా మరెవరు సిఎమ్ అయినా. అయితే ఆ వర్గానికి దాసోహం అనాలి. అలా అన్నా కూడా వచ్చే ఎన్నికల్లో వైకాపా మట్టిలో కలిసిపోవాలి. అదీ లక్ష్యం.

ఇదే సువర్ణ అవకాశం గట్టిగా రెండేళ్లు టైమ్ లో ఈ లక్ష్యం సాధించేయాలి. జగన్ ను ఎలాగో అలా ఇరుకున పెట్టాలి. వీలయితే బెయిల్ క్యాన్సిల్ చేయించాలి. గతంలో పలువురు రాజకీయ నాయకుల విషయంలో ఇలా జరిగింది. జగన్ జైలుకు పోతే భారతి సిఎమ్ అయితే ఇక మన మీడియా, వ్యవస్థల్లో వేళ్లూనుకుపోయిన మన జనాలు కలిసి ఓ ఆట ఆఢించేయవచ్చు. 

మరి ఇలాంటి టైమ్ లో జగన్ ఛేయాల్సింది ఏమిటి? మన టైమ్ కాదు అని రెండేళ్ల పాటు మౌనంగా కేవలం పాలనా వ్యవహారాలు మాత్రం చూసుకుంటూ వుండిపోవడమా? పోనీ అలా వుండిపోతే ప్రతిపక్షం ఇరుకున పెట్టకుండా వుంటుందా? జగన్ కేవలం జనాలకు డబ్బులు పంచే వ్యవహారాలు మాత్రం చేసుకుంటూ పోవాల్సిందే. ఎందుకంటే దానికి అడ్డం పడలేరు. కోర్టులకు వెళ్లి అడ్డుకోలేరు. పార్టీని పటిష్టం చేసుకుంటూ, జనాల మనసు చూరగొంటూ పాలన సాగించుకుంటూ వెళ్లిపోవడమే.

ఇక బెయిల్ వ్యవహారం అన్నది మాత్రం జగన్ చేతిలో లేనిది. న్యాయస్థానం, న్యాయమూర్తులు, న్యాయవాదుల నడుమ సాగే వ్యవహారం అది. గమ్మత్తేమిటంటే వందలు, వేల కోట్ల బ్యాంకు బకాయిల విషయంలో కేసులు ఎదుర్కొంటూ, అరెస్ట్ కాకుండా నిబంధనల నడుమ నుంచి దోబూచులాడుతున్న వ్యక్తి, జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని కోరడం. 

ఇక బెయిల్ విషయంలో మాత్రం జగన్ తన తల రాతను అదృష్టానికి వదిలేయాల్సిందే. గాలి వాన వచ్చినపుడు గడ్డి పోచ తలవంచి ఊరుకుంటుంది. గాలివాన వెళ్లిపోయాక తలెత్తి నిల్చుంటుంది. విజ్ఞులైన వారి లక్షణం అది. పిరికిచర్య కాదు. టైమ్ మనది కానపుడు చేయాల్సిన పని. 

మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు కేవలం సంక్షేమ పాలన మీద దృష్టి పెట్టాలి. పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టుకోవాలి. ఇక ఆ వర్గాన్ని, దాని వ్యవహారాలను పక్కన పెట్టేయాల్సిందే. ఎందుకంటే నిత్యం దాని మీదే దృష్టి పెట్టి, ఏదో ఒకటి చేసి, కోర్టులకు ఎక్కి తల బొప్పి కట్టించుకోవడం అవసరమా? తమకు పట్టు లేని చోట పోరాటం చేయడం విజ్ఞుల లక్షణం కాదు కదా?

అలా కాకుండా మూడేళ్ల పాటు జనాలకు సంక్షేమ పాలన అనేది రుచి చూపించుకుంటూ వెళ్లిపోతే, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి అదే వర్గంతో ఎలాగూ బహుముఖంగా పోరాడాల్సిందే. అదేదో అప్పుడు చూసుకోవచ్చు కదా. ఇప్పటి నుంచీ నిత్యం ఇదే యాగీ అన్నట్లుగా గడపడం అవసరమా? అన్నది జగన్ ఆలోచించుకోవాలి. 

ముందు జనాల్లో తన బలాన్ని, బలగాన్ని మరింత బాగా పెంచుకోవాలి. ఆ తరువాత ఎన్నికల్లో మరోసారి విజయం సాధించగలిగితే, ఇక ఆ సామాజిక వర్గం ఎంత బహుముఖ పోరు సాగించినా జగన్ ను ఏమీ చేయలేకపోవచ్చు. కానీ అలా కాకుండా ఇప్పటి నుంచి ఇటు అటు చెరో కాలు వేసి ఫీట్లు చేద్దాం అనుకుంటే జగన్ కు తలకాయనొప్పి తప్పకపోవచ్చు.