“అగ్నిపథ్” నిరసనలో రైళ్లను కాల్చి, ధ్వంసం చేసారు. వీళ్లంతా ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం శిక్షణ తీసుకున్న వాళ్లు. ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్లు. సడన్‌గా పార్ట్ టైం ఉద్యోగాలు అనేసరికి ఫస్ట్రేషన్ వచ్చింది. ఆగ్రహంతో రోడ్లమీది కొచ్చారు. నిరసన తప్పు కాదు. అది ప్రజాస్వామ్య హక్కు. అయితే విధ్వంసం తప్పు.
ఈ యువకులు చేరాలనుకున్న ఉద్యోగాలు దేశ రక్షణ చేసేవి. వీళ్లు చేసింది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. ఎవరో వాట్సప్ మెసేజ్‌లు పంపితే రెచ్చిపోయి, పెట్రోల్‌తో తగలబెట్టే మనస్తత్వం వున్న వాళ్లు సైన్యానికి అర్హులా అనేది ప్రశ్న.
ఎందుకంటే సైనికుడికి చాలా నిగ్రహం కావాలి. అతని చేతిలో తుపాకీ వుంటుంది. ఆయుధం వున్న వాడికి కఠిన క్రమశిక్షణ వుండాలి. రెచ్చగొడితే రెచ్చిపోకూడదు. వీళ్లేం చేసారు! ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి రైల్వేస్టేషన్‌ని కాల్చారు. మరి కోచింగ్ సెంటర్లో వీళ్లకి డిసిప్లిన్ నేర్పించలేదా? అందరిలాంటి అల్లరి మూక మనస్తత్వంతోనే వీళ్లు కూడా వుంటే సైనికులుగా న్యాయం చేస్తారా? విచక్షణ లేకపోవడంతో వీళ్లు ఏళ్ల తరబడి కోర్టులకి తిరిగే పరిస్థితి తెచ్చుకున్నారు.
ఇక ప్రభుత్వం గురించి మాట్లాడితే అది వ్యాపార సంస్థ కాదు. ఒక ప్రయివేట్ వ్యాపారి పది మంది చేసే పనిని డబ్బులకి కక్కుర్తిపడి నలుగురితో చేయిస్తే అది అతని దురాశ. అదే పని ప్రభుత్వాలు కూడా చేస్తే.
గవర్నమెంట్ అంటే జవాబుదారీ సంస్థ. ప్రజలతో పన్నులు కట్టించుకుని, ఆ డబ్బులతో మౌళిక వసతులు, శాంతిభద్రతలు కల్పించడం దాని బాధ్యత. జనంతో లాభనష్టాల వ్యాపారం చేసి బ్యాలెన్స్ షీట్ నింపడం దాని ప్రాథమిక చర్య కాదు.
ఒక ఉద్యోగి మాగ్జిమం దేశం కోసం, ప్రభుత్వం కోసం నిబద్ధతతో పని చేయడమంటే నిజాయితీగా, అవసరమైతే ఎక్కువ గంటలు పని చేయడం. అంతే తప్ప అతను ప్రాణత్యాగం చేసే అవసరం ఉండదు. కానీ ఒక సైనికుడు అవసరమైతే ప్రాణాన్ని ఇచ్చేందుకు విధుల్లోకి వస్తాడు.
సైనికుడు, ఉద్యోగి ఎపుడూ ఈక్వల్ కాదు. ఏ దేశంలోనైనా అత్యున్నత ఉద్యోగి సైనికుడే. ఎందుకంటే దేశం శాంతియుతంగా వుండాలంటే అతను మంచుకొండల్లో కాపలా కాస్తేనే. అతను తుపాకీ గుళ్లకీ, బాంబులకి ఎదురొడ్డి నిలబడితేనే?
మరి అంత గొప్ప సైనికుడికి పెన్షన్ ఇవ్వలేని దుస్థితిలో వుందా ఈ దేశం? పెన్షన్ బిల్లు తగ్గించడానికి పార్ట్ టైం సైనికుల్ని తీసుకుంటారా? వ్యాపారులకి రాయితీలు ఇస్తారు. వాళ్లు ఎగ్గొట్టిన డబ్బుకి శిక్షలు లేని వ్యవస్థలో సైనికుడి డబ్బుల దగ్గరే లాభనష్టాలు వచ్చాయా? లెక్కలు చూసుకుని సైన్యాన్ని నియమించుకుంటారా? మోదీ ప్రభుత్వాన్ని సామాన్య ప్రజలు అడిగే ప్రశ్నలివి!