జనసేనాని పవన్‌కల్యాణ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. పొత్తులపై పవన్ రోజుకో మాట, పూటకో సిద్ధాంతం చెబుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గమ్యం ఏంటో తెలియక, ఇష్టానుసారం రాజకీయ నడక సాగిస్తున్నారనే విమర్శలను పవన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం పర్చూర్ బహిరంగ సభలో పవన్ ప్రసంగం గతం కంటే కొంత భిన్నంగా సాగింది.
తాజా మార్పుపై కూడా నెటిజన్లు సృజనాత్మక సెటైర్స్‌తో విరుచుకుపడుతున్నారు. పవన్ పేర్కొన్న అంశాల్నే తీసుకుని రివర్స్ ఎటాక్ చేయడం విశేషం. ఇంతకూ పవన్‌కల్యాణ్ ఏమన్నారంటే….
“కొత్త తరం నాయకులు రాజకీయాల్లోకి రావాలి. ఒకసారి అందరూ జనసేన వైపు చూడండి. ఒక్కసారి జనసేనను నమ్మి అవకాశం ఇవ్వండి. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాను” అని పవన్ చెప్పుకొచ్చారు.
“ఒకసారి అందరూ జనసేన వైపు చూస్తారనే అనుకుందాం. కానీ జనసేనాని మాత్రం టీడీపీ వైపు చూస్తారు. అప్పుడు లాభం ఏంటి సార్” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “జనాలకు నమ్మకం కలిగించే రాజకీయం జనసేనాని ఎప్పుడు చేశారు. ఇప్పుడు ఆయన్ని ఏమని నమ్మాలి? ఆయన వైపు చూడాలంటే, ముందు పవన్ ప్రజల వైపు చూడాలి కదా! పవన్ చూపులన్నీ చంద్రబాబు వైపు వుంటే ఎలా” అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.
“అసలు తనపైనే పవన్‌కు నమ్మకం లేదు. అందుకే తాను ముఖ్యమంత్రి అవుతానని పవన్ ఎప్పుడూ భరోసా ఇవ్వలేదు. అలాంటప్పుడు నన్ను నమ్మండి, రాష్ట్రాన్ని కాపాడుతానని పవన్‌కల్యాణ్ చెబితే… నమ్మేదెలా? ముందు తాను చంద్రబాబు దత్త పుత్రుడనే మచ్చను తుడిపేసుకుంటే, మిగతావి వాటికవే వస్తాయి” అని మరికొందరు నెటిజన్లు హితవు చెప్పడం ఆకట్టుకుంటోంది.