ఎమ్బీయస్‌ : ‘డాన్‌ కామిలో డైలమా’

ఇది ఒక కథ. దీన్ని ఇటాలియన్‌ భాషలో రాసినది గియోవానీ గురేషీ (Gఱశీఙaఅఅఱ Gబaతీవంషష్ట్రఱ) అనే రచయిత. 1908లో పుట్టి 1968లో మరణించిన అతను జర్నలిస్టు, పత్రికా సంపాదకుడు, సినిమా రచయిత. ఉత్తర ఇటలీలో…

ఇది ఒక కథ. దీన్ని ఇటాలియన్‌ భాషలో రాసినది గియోవానీ గురేషీ (Gఱశీఙaఅఅఱ Gబaతీవంషష్ట్రఱ) అనే రచయిత. 1908లో పుట్టి 1968లో మరణించిన అతను జర్నలిస్టు, పత్రికా సంపాదకుడు, సినిమా రచయిత. ఉత్తర ఇటలీలో ఉన్న పో నదీతీరంలోని ఒక గ్రామంలో డాన్‌ కామిలో అనే చర్చి పూజారి, అదే వూళ్లో పెపోన్‌ అనే కమ్యూనిస్టు పార్టీకి చెందిన మేయరు మధ్య 1950లో యీ కథలు జరిగినట్లు రాశాడు. వీరిద్దరి మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ తరహా పోరాటం జరుగుతూ ఉంటుంది. జీవితసత్యాలను ఆవిష్కరిస్తూనే, పూజారులను, కమ్యూనిస్టులను కాస్తకాస్త వెక్కిరిస్తూ, మంచి వ్యంగ్యంతో, చమత్కార సంభాషణలతో సామాజిక విమర్శ కూడా సాధించాడు. కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇంగ్లీషులోకి కూడా అనువదితమయ్యాయి.

ముళ్లపూడి వెంకటరమణగారికి యీ కథలు చాలా యిష్టం. తన ‘‘బుద్ధిమంతుడు’’ కథకు స్ఫూర్తిని యీ కథల్లో ఒకదాని నుంచి తీసుకున్నానని చెప్పారు. ఆయన సిఫార్సుతోనే ‘‘డాన్‌ కామిలోస్‌ డైలమా’ అనే పుస్తకం కొని చదివాను. పెంగ్విన్‌ ప్రచురణ.  25 కథలుంటాయి. వాటిలో ‘‘ద ఎక్స్‌కమ్యూనికేటెడ్‌ మడొన్నా’’ అనే కథను పరిచయం చేస్తున్నాను. ఒకానొక సందర్భంలో పూజారి ఎదుర్కున్న సంకటస్థితిని చెపుతుందీ వ్యంగ్యేతర కథ. దానిలోని ఐరనీ నన్ను ఆకట్టుకుంది – 

పట్నం నుంచి ఓ రోజు ఒక చిత్రకారుడు సైకిలు మీద ఆ పల్లెటూరికి వచ్చి చర్చికి ఎదురుగా ఉన్న కూడలిలో దిగి, తన సరంజామా అంతా బయటకు తీశాడు. రోడ్డు పక్కన ఉన్న ఒక పాత పొదరిల్లును చూసి బొమ్మ గీయడం మొదలెట్టాడు. కాస్సేపటికే ఊరంతా అక్కడ పోగడింది. ‘‘నది ఒడ్డుకి వెళితే అక్కడ ఎన్నో సుందరదృశ్యాలున్నాయి. అవి వదిలేసి యీ పాడుబడ్డ దాన్ని పట్టుకున్నాడేవిటి?’’ అన్నారొకరు. అది వినబడి చిత్రకారుడు తల తిప్పకుండానే ‘‘అలాటివి అందరూ గీస్తారు. దీనిలో నాకు అందం కనబడింది. దాన్ని కాన్వాస్‌పైకి దింపుదామని నా ప్రయత్నం.’’ అన్నాడు.

సాయంత్రానికి బొమ్మ చాలాభాగం పూర్తయింది. అప్పటికే ఊళ్లో అందరికీ అది నచ్చేసింది. అటుగా వచ్చిన మేయరు పెపోన్‌ ‘‘50 ఏళ్లగా ఈ ఆర్కేడ్‌ను చూస్తూనే ఉన్నా, ఎప్పుడూ యింత అందంగా కనబడలేదు.’’ అని ఒప్పుకున్నాడు. ‘‘ఇప్పుడు వెలుతురు తగ్గిపోయింది. బొమ్మ గీయలేను. రేపు వచ్చి పూర్తి చేస్తాను. అప్పుడు ఎలా వుందో చెప్దురుగాని’’ అన్నాడు ఆర్టిస్టు వినయంగా. ‘‘ఇప్పుడీ తడి కాన్వాస్‌ వెంటపెట్టుకుని మళ్లీ సిటీకేం వెళతావు, సామానంతా మా చర్చిలో పెట్టుకో. నువ్వూ కావాలంటే పడుక్కోవచ్చు.’’ అన్నాడు పూజారి. ఆర్టిస్టు సరేనన్నాడు సంతోషంగా.

‘‘ఈ చర్చివాళ్లున్నారే, చేపలు పట్టినట్లు ఎవణ్ని ఎలా పడదామా అని చూస్తూంటారెప్పుడూ’’ అని విసుక్కున్నాడు మేయరు. అంతేగాని, తనింట్లో ఉండమని మాత్రం అనలేదు. ఆ రాత్రి మాటల్లో ఆర్టిస్టుకి రోజు గడవడమే కష్టంగా ఉందని, ఏ పూటకా పూట పని వెతుక్కోవసి వస్తోందని పూజారికి తెలిసింది. అప్పుడో ప్రతిపాదన చేశాడు – ‘నువ్వు ఓ నెల్లాళ్లపాటు చర్చిలో ఉండి, యిక్కడే భోజనం చేస్తూ, రోజులో కొన్ని గంటలు చర్చి గోడపై బొమ్మలు వేస్తూ ఉండు. రొక్కం మాత్రం ఏమీ యివ్వను. రోజులో మిగతా సమయంలో నువ్వు వేరే చోట పని చేసుకుని సంపాదించుకుంటున్నా ఏమీ అనను.’’ అన్నాడు. ఆర్టిస్టు ఒప్పుకున్నాడు.

తీరా చూస్తే చర్చిలో పని రెండు రోజుల్లో ముగిసిపోయింది. ఇంకా పెద్ద పనేమైనా ఉంటే చెప్పు అన్నాడు ఆర్టిస్టు. పూజారి జంకుతూనే ఓ పెద్ద పని అప్పగించాడు. పైన చూరు నుంచి నీళ్లు కారి, దాని కింద ఉన్న పెద్ద మడొన్నా (క్రీస్తు తల్లి మేరీమాత) కుడ్యచిత్రం చెరిగిపోయింది. ‘పైన రిపేరు చేయిస్తాను. ఆ బొమ్మ మళ్లీ పెయింటు చేయగలవా?’ అని అడిగాడు.

‘చేస్తాను, కానీ కన్యమేరీ మొహంలో ప్రతిఫలించే అమాయకత్వం, సౌకుమార్యం, ముగ్ధత్వం ఉన్న అమ్మాయి దొరకాలి. తనను మోడల్‌గా పెట్టుకుని కాగితంపై స్కెచ్‌ గీసుకుని, దాని ఆధారంగా రంగుల్లో యీ బొమ్మ గీస్తాను. అయితే ఒక షరతు. బొమ్మ పూర్తయ్యేదాకా ఎవరూ చూడకూడదు. మొన్నట్లాగ వెనక్కాలే నిబడి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే కుంచె ముందుకు సాగదు. ఇది భక్తిశ్రద్ధలతో చేయాల్సిన పని.’’ అన్నాడు ఆర్టిస్టు. పూజారి ఒప్పుకున్నాడు.

ఇక మర్నాటి నుంచి ఆర్టిస్టు సైకిలు వేసుకుని తను అనుకున్న మోడల్‌ కోసం వూరంతా తిరిగాడు. పక్క ఊళ్లకు కూడా వెళ్లి, పొలాల్లో పనిచేసే పడతులను, గృహిణులను, స్కూలుకి వెళ్లే బాలికలను పరీక్షగా చూసేవాడు. రెండువారాలు గడిచినా తను అనుకున్న అమ్మాయి కనబడలేదు. ఇటు చూస్తే గడువు దాటిపోతోంది. చివరకు ఓ రోజున ‘‘ఇవాళ కనబడకపోతే పని కట్టిపెట్టి సిటీకి వెళ్లిపోతా’’ అనుకుని సైకిలెక్కాడు. మధ్యాహ్నానికి ఆకలేసి భోజనానికి ఓ పల్లెటూళ్లో ఒక పూటకూళ్లింటికి వెళ్లాడు. ఖాళీగా వుంది. వెళ్లి టేబులు మీద కూర్చున్నాడు. ‘ఎవరండీ, భోజనం కావాలి’ అని కేక పెట్టి బయటకు చూస్తూ కూర్చున్నాడు.

కాస్సేపటిలో కంచం పట్టుకున్న ఒక అందమైన చెయ్యి కనబడింది. తలెత్తి చూస్తే అద్భుతసౌందర్యవతి కనబడింది. తను వెతుకుతున్న అమ్మాయి యీమెయే అనుకుంటూ చూస్తూ ఉండిపోయాడు. ఆమె వయసు పాతిక ఉంటుంది కానీ పద్ధెనిమిదేళ్ల అమ్మాయికి ఉండే హుషారు ఉంది. ఆమెను చూస్తూనే భోజనం చేశాడు. భోజనమయ్యాక అక్కడే కూర్చుని ఓ స్తంభానికి ఆనుకుని ఏదో అల్లుకుంటున్న ఆ అమ్మాయిని చూస్తూ తన ప్యాడ్‌లో బొమ్మ వేయసాగాడు. కాస్సేపు చూసి ఆ అమ్మాయి ఏమిటి చేస్తున్నావని అడిగింది. నీ బొమ్మ గీస్తున్నా అన్నాడు. ఆమె ఏమీ అనలేదు, భుజాలెగరేసి ఊరుకుంది.

ఓ గంట గడిచాక కుట్టుకుంటున్నది పక్కన పెట్టి, లేచి వచ్చి తన బొమ్మ చూసింది. ‘‘నేనిలా ఉంటానా?’’ అంది నవ్వుతూ. ‘‘బొమ్మ పూర్తవలేదు. రేపు వచ్చి యింకా గీయాలి. ఇవాళ్టి భోజనానికి ఎంతయింది?’’ అన్నాడు ఆర్టిస్టు. ‘‘రేపు వస్తారుగా, అప్పుడు యిద్దురుగాని లెండి.’’ అందామె. ఇంకో మూడు రోజులు వెళ్లి బొమ్మకు పూర్తి మెరుగులు దిద్దుతూ దిద్దుతూ అతి సుందరంగా తయారుచేశాడు.

ఆ తర్వాత చర్చిలో మంచె వేసుకుని ఎక్కి గోడపై ఆ బొమ్మ పెయింటు చేయసాగాడు. ఎవర్నీ చూడనివ్వలేదు. చివరకు ఓ రోజు మంచె యిప్పివేసి, పైన గుడ్డ కప్పి కిందకు దిగాడు. పూజారిని పిలుచుకుని వచ్చి, ఒక గడకర్రతో ఆ గుడ్డ తొలగించి చూపించాడు. చూసీచూడగానే పూజారి నోరు తెరిచేశాడు. అంత పరమాద్భుతంగా ఉందా బొమ్మ. అంతలోనే అతనికి ఏదో తట్టి, నుదుటిపై చెమట పట్టింది. ‘‘సెలెస్టినా’’ అని ఒక్క అరుపు అరిచాడు. ‘‘సెలెస్టినా ఎవరు?’’ అడిగాడు ఆర్టిస్టు.

‘‘లా రోకాలో ఉన్న పెజంట్‌ సత్రం యజమాని కూతురు’’.
‘‘అవును, నిజమే పెజంట్‌ సత్రం నడిపే అమ్మాయే!’’ ఒప్పుకున్నాడు ఆర్టిస్టు.

పూజారి గబగబా ఒక నిచ్చెన పట్టుకుని వచ్చి చరచరా గోడపైకి ఎక్కి ఒక గుడ్డ దానిమీద కప్పేశాడు. తన గదిలోకి ఆర్టిస్టును తీసుకెళ్లి ‘‘ సెలెస్టినా అంటే ఎవరనుకున్నావ్‌? పెద్ద కమ్యూనిస్టు. పరమ నాస్తికురాలు. తన పోలికతో మడొన్నా బొమ్మ వేయడమంటే స్టాలిన్‌ పోలికతో క్రీస్తు బొమ్మ వేసినట్లే! నువ్వెంత అపచారం చేశావో నీకు అర్థం కావటం లేదు. నువ్వు అమాయకుడని తెలుసు కాబట్టి ఊరుకుంటున్నాను కానీ లేకపోతే యీపాటికి మెడబట్టి గెంటుదును.’’ అని తిట్టిపోశాడు.

‘‘మడొన్నాకు అత్యంత అందమైన ముఖాన్ని సమకూర్చానని నా ఉద్దేశం. ఆ మొహం దేవుడిచ్చినది, కమ్యూనిస్టు పార్టీ యిచ్చినది కాదు.’’ అన్నాడు ఆర్టిస్టు స్థిరచిత్తంతో.

‘‘ఆ బొమ్మలో నీ సహృదయం కనబడటం లేదు. ఆ దుర్మార్గురాలి పాపపు బుద్ధే కనబడుతోంది. ఆ బొమ్మ కింద ‘బహిష్కృతురాలైన మడొన్నా’ అని రాయాలి తప్ప పవిత్రమాత అని రాయలేం.’’ అని వాపోయాడు పూజారి. ‘‘నేనొప్పుకోను. ఒక వ్యక్తిలోని పవిత్ర గుణాలన్నీ కలబోసి దాన్ని తయారుచేశాను…’’ అని ఆర్టిస్టు అంటూండగానే పూజారి అడ్డు తగిలాడు. ‘‘అలాటి హీనచరితురాలి మొహంలో ఆధ్యాత్మిక లక్షణాలు ఎలా వుంటాయయ్యా బాబూ, ఆమె నోరు తెరిస్తే చాలు, బూర్జువా, గీర్జువా, దేవుడు, దెయ్యం అంటూ తిట్లు లంకించుకుంటుంది. అవి విని లారీ డ్రైవర్లు కూడా చెవులు మూసుకుంటారు.’’ అన్నాడు.

ఆర్టిస్టు యింకేమీ మాట్లాడలేదు. తల వంచుకుని తన గదిలోకి వెళ్లిపోయాడు. రాత్రి భోజనానికి రాలేదు. పది గంటల సమయంలో పూజారి అతని గదిలోకి వెళ్లాడు. ‘‘నువ్వెంత అపరాధం చేశావో అర్థమైందా? నువ్వు కుర్రవాడివి. తను వగలాడి. నిన్ను బుట్టలో పెట్టేసి, తన బొమ్మ వేయించేసుకుంది. ఆ స్కెచ్‌ను యిద్దరం కలిసి చూద్దాం. ఆమెలోని అశ్లీలత, అసభ్యత నీకు కళ్లకు కట్టినట్లు కనబడుతుంది,  చూడు.’’ అన్నాడు. ఆ స్కెచ్‌లన్నీ చింపేశానంటే అయితే వెళ్లి పెయింటింగు చూద్దాం రా.’’ అన్నాడు.

ఇద్దరూ చర్చికి వెళ్లి పై లైట్లు వేసుకుని పరీక్షగా చూశారు. తీరా చూస్తే ఆ బొమ్మ కళ్లల్లో, ఫీచర్లలో ప్రసన్నత, ప్రశాంతత పూజారికి కూడా స్పష్టంగా గోచరించాయి. అతనికి చికాకు వేసింది. ‘‘ఈ బొమ్మలో పవిత్రత ఉందేమో కానీ, సెలెస్టినాలో లేదు. అసలు దాని మొహంలోంచి పవిత్రభావాన్ని ఎలా లాక్కుని వచ్చావో నాకు అర్థం కావటం లేదు. అదెంత రాకాసో యీ వూళ్ల వాళ్లందరికీ తెలుసు. ఇది చూడగానే సెలెస్టినా మడొన్నా వేషం కట్టింది అంటారు తప్ప అసలైన మడొన్నా యిలాగే వుండి వుంటుంది అని ఎవరూ అనరు.’’ అని వాపోయాడు.

ఆర్టిస్టుకి అతని బాధ బోధపడింది. చెరిపేసి మళ్లీ వేస్తానన్నాడు. కానీ అంతటి అద్భుత కళాఖండాన్ని తుడిపేయడానికి పూజారి కూడా సంశయించాడు. మర్నాడు ఒక అయిదారుగురు ఆప్తులను పిలిపించాడు. వాళ్లు పక్క ఊళ్లల్లోని చర్చిల్లో పూజారులు. చూస్తూనే ‘వాప్‌ా’ అన్నారు. ఉత్తరక్షణంలో ‘సెలెస్టినా కదా’ అన్నారు. విషయమంతా తెలుసుకుని ‘ఇది మాస్టర్‌పీస్‌. చెరిపివేయడం అన్యాయం. అలా అని వెలివేసిన కమ్యూనిస్టు ఫీచర్లతో మడొన్నాను ఊహించడమూ దుర్భరంగా ఉంది.’ అన్నారు. కంగారు పడకండి, ఏదో ఒకటి ఆలోచించి చేద్దాం అంటూ సెలవు తీసుకున్నారు.

ఈ విషయాన్ని బయట ఎక్కడా పొక్కనీయవద్దని పూజారి ప్రత్యేకంగా కోరాడు కాబట్టి మర్నాడు మధ్యాహ్నానికల్లా అన్ని వూళ్లకూ కార్చిచ్చులా వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా చర్చికి రాసాగారు. కానీ పూజారి ఎవర్నీ రానివ్వటం లేదు. రోజంతా తరిమివేస్తూనే వున్నాడు. చీకటిపడే వేళ తలుపు మూసేస్తూ ఉంటే, ఓ మూల తెరల చాటున సెలెస్టినా మొహం కనబడింది. ‘‘నువ్వా, చర్చిలోనా!?’’ అంటూ నివ్వెరపోయాడు పూజారి. ‘‘ఆ పెయింటరు గాడిదను చూద్దామని వచ్చాను.’’ అంది సెలెస్టినా.

అతను రాగానే ‘‘మా హోటల్లో నాలుగు పూటలు అప్పనంగా మెక్కిందే కాక, నా బొమ్మ గీస్తావా? నా మొహాన్ని దురుపయోగం చేసే హక్కు నీకెవరు యిచ్చారని అడుగుతున్నాను.’’ అని అరిచింది. ఆ మొహం చూడగానే ఆర్టిస్టుకి పూజారి మాటల్లో సత్యం గోచరించింది. ఇంతటి గయ్యాళిలో తనకు అంతటి ప్రశాంతత ఎలా కనబడిందో అర్థం కాలేదు. పూజారి ఎంత వారించినా ఆమె యింకా అరుస్తూనే ఉంది – ‘‘ఇది ఒక రకమైన దోపిడీ. నా మొహాన్ని పట్టుకెళ్లి మడొన్నా మొహానికి అతికించడం అక్రమం, అన్యాయం.’ అని. ‘అది నీ మొహం కాదు, కావాలంటే వచ్చి చూడు.’ అంటూ పూజారి ఆమెను తీసుకెళ్లి బొమ్మ చూపించాడు.

అది చూస్తూండగానే ఆమె మొహంలో రంగులు మారిపోయాయి. ఆగ్రహం, ఆవేశం మటుమాయమై పోయి, అత్యంత ప్రసన్నంగా, ఆహ్లాదకరంగా మారిపోయిందామె మొహం. బొమ్మలో మొహానికి ఉన్న సమస్త సల్లక్షణాలూ ఆమె ముఖంలో ప్రతిబింబించాయి. ఆర్టిస్టు పూజారి చేతిని గట్టిగా పట్టుకుని ‘‘అదిగో, ఆ మొహమే నేను చూసినది’’ అని గొణిగాడు. సెలెస్టినా ‘‘ఎంత అద్భుతంగా ఉంది’’ అని మెచ్చుకుని మృదుస్వరంతో ‘‘దాన్ని చెరిపేయకండి, కనీసం కొంతకాలమైనా ఉండనివ్వండి.’’ అని కోరింది. ఆ బొమ్మ ముందు మోకరిల్లి ఛాతీపై శిలువ గుర్తు వేసుకుంది.
మర్నాడు ఆర్టిస్టు సైకిలేసుకుని సెలెస్టినాను కలవడానికి వెళ్లాడు. ‘‘బాకీ తీర్చడానికి వచ్చాను.’’ అన్నాడు. అమె అతన్ని చూస్తూ, గొంతులో మార్దవం తొణికిస లాడుతూండగా ‘‘నువ్వు గొప్ప ఆర్టిస్టువి. ఆ బొమ్మను నాశనం చేయకుండా చూడాలి.’’ అంది. ‘‘నిజమే, నేను ఎంతో మనసు పెట్టి ఆ బొమ్మ గీశాను. కానీ ఏం చేస్తాం? వెలివేసిన వాళ్ల పోలికతో మడొన్నా ఉండడానికి వీల్లేదంటున్నారు వాళ్లు.’’ అని  బాధపడ్డాడు.

‘‘నేనికపై వెలివేసిన దాన్ని కాదు. మతం స్వీకరించి చర్చికి వస్తాను. పొద్దున్నే నిశ్చయించుకున్నాను.’’ అంది. ఆర్టిస్టు ఆశ్చర్యపడ్డాడు. ఆపై వాళ్లిద్దరూ అవీయివీ మాట్లాడుకున్నారు. నీ బట్టలు యింత చక్కగా అమరడానికి కారణం మీ ఆవిడా? అని ఆమె అడిగింది. ‘పెళ్లి చేసుకునే భాగ్యం ఎక్కడ? ఒంటరివాణ్ని, పిల్లను చూసిపెట్టేవాళ్లు లేరు, ఉన్నా సిటీలో నా కొచ్చే సంపాదనతో యిద్దరం బతకగమా?’ అన్నాడతను.

‘సిటీలో కాబట్టి ఖర్చు సరిపోదు కానీ, యిలాటి పల్లెటూళ్లో ఉంటే సరిపోతుంది. ఓ యిల్లు, కాస్త పొలం ఉన్న పల్లెటూరి అమ్మాయి నెవరినైనా చేసుకుంటే యిద్దరూ కలిసి సైడుగా యిలాటి హోటల్‌ వ్యాపారం పెట్టుకోవచ్చు.’ అని సలహా యిచ్చింది. పెళ్లీడు వచ్చాక ఒంటరిగా ఉండడం మహా కష్టమని యిద్దరూ అభిప్రాయ పడ్డారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే గంటలు గంటలు గడిచిపోయాయి. అతను లేవబోతూ ‘అవునూ, నీకెంత బాకీయో చెప్పనే లేదు’ అన్నాడు. ‘రేపిద్దువు గానిలే’ అందామె.

మడొన్నా బొమ్మను యింకో నెల పాటు తెర చాటున దాచి వుంచారు. ఆర్టిస్టు, సెలెస్టినా చర్చిలో ఘనంగా పెళ్లి చేసుకున్న రోజున పూజారి ధైర్యం చేసి తెర తీసేశాడు. ఎవరైనా ఏమైనా అంటారేమోనన్న శంక మనసులో ఉంది. కానీ అందరూ ముక్తకంఠంతో ఒక్కటే అన్నారు ` ‘మడొన్నా అంత అందంగా ఉండాలని సెలెస్టినా ప్రార్థించాలి. కానీ మడొన్నా కున్న దైవిక సౌందర్యం మామూలు మనుష్యులకు రావడం అసంభవం కదా!’

ఇదీ కథ. నాకు దీనిలో నచ్చిన అంశం ఏమిటంటే మన ప్రీ కన్సీవ్‌డ్‌ నోషన్స్‌ మన దృష్టిని ప్రభావితం చేస్తాయి. కృష్ణుడి బొమ్మను ఎన్టీయార్‌ పోలికతో వేస్తే ఒప్పుకుంటాం. రాజనాల పోలికతో వేస్తే ఒప్పం. కెఆర్‌ విజయ పోలికతో అమ్మవారి విగ్రహం ఓకే. జయమాలిని పోలికైతే నో. ఎందుకలా? వాళ్లు వేసిన పాత్రల బట్టి! ఆ సినిమాలు చూడని ఏ బెంగాలీ వాళ్లకో రాజనాల జయమాలిని పోలికలతో యిబ్బందేమీ రాదు. ఇప్పుడు మన గుళ్లల్లో ఉన్న విగ్రహాలు, చిత్రాలు దర్పణసుందరి, నాగకన్య, పద్మపాణి, కామాక్షీ దేవి.. యిలాటి వాటికి మోడల్స్‌గా పనిచేసిన వారెవరో మనకు తెలియదు కాబట్టి వాటిని మనం గౌరవిస్తున్నాం. వ్యక్తిగతంగా వారెటువంటి వారో తెలిస్తే మనం ప్రభావితమయ్యే వారమేమో!

అయినా వ్యక్తిగత లక్షణాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతి వ్యక్తిలోను మంచీ, చెడూ రెండూ ఉంటాయి. మనం చూసే చూపులో ఉంటుంది. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు ఒక్కోళ్లూ ఒక్కోలా బ్రాండ్‌ చేస్తారు. పై కథలో సెలెస్టినాలో సౌమ్యతా వుంది, గయ్యాళితనమూ ఉంది. సందర్భం బట్టి ఏదో ఒకటి బయటకు వస్తుంది. ఏదో ఒక కోణాన్ని బట్టి మనిషిపై ముద్ర కొట్టకూడదు. మనుషులు మారనూ వచ్చు. కథలో యింకో నీతి కూడా ఉంది. మనిషిలో దైవత్వం ఉంది. దాన్ని వెలికితీసుకుని వస్తే, అది మూలపదార్థమైన మనిషిని కూడా అధిగమిస్తుంది. కథలో చివరి వాక్యంలో వ్యంగ్యమూ ఉంది, తాత్త్వికతా ఉంది.

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020)

   [email protected]