అభిమానులకు ఆమె ఓ దేవసేన, తెలుగింటి రుద్రమదేవి, అందానికి అందం, అన్నిటికి మంచి మంచితనం…అనుష్క సొంతం. ఆమె సినీ ప్రస్థానానికి 15 ఏళ్లు. హీరోయిన్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగినా…ఆ తాలూకూ గర్వం ఏ మాత్రం ఆమె మాటల్లో, నడతలో కనిపించవు. అందుకే అనుష్క లక్షలాది మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. తన 15 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు ఆమె వెల్లడించారు. అంతేకాదు తన మనసుకు నచ్చిన హీరో ఎవరో కూడా చెప్పారామె.
తనది పూర్తిగా సంప్రదాయ కుటుంబమని, సినీరంగంలోకి వస్తానని అసలు అనుకోలేదని అనుష్క తెలిపారు. సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో తనకు అంతా ఎంతో కొత్తగా అనిపించిందని ఆమె తెలిపారు. జీవితంలో 15 ఏళ్లపాటు సినీ ప్రస్థానం అంటే చిన్న విషయం కాదన్నారు. ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం, భయం కలుగుతాయన్నారు. అయితే ఈ 15 ఏళ్లలో అందరూ అండగా నిలబడటం వల్లే ఈ రోజులో తాను ఈ స్థాయిలో ఉన్నట్టు ఆమె వెల్లడించారు.
మొట్టమొదటిసారి కెమెరా ముందు నిలబడినప్పుడు తన ఫీలింగ్స్‌ను ఆమె సరదాగా వెల్లడించారు. మొదటి సారి కెమెరా ముందు నిలిచినప్పుడు ‘తల పైకెత్తండి’ అని కెమెరామన్ సూచించారని, అప్పుడు యోగాలో మాదిరిగా మెడ పూర్తిగా పైకెత్తి ఆకాశంలోకి చూసినట్టు గుర్తు తెచ్చుకున్నారు. అలాంటి అమాయకంగా ఉన్న తాను…ప్రస్తుతం ఇంత దూరం ప్రయాణించడం తనకే ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఇప్పటికీ తాను ధ్యానం, యోగాసనాలు చేస్తుంటానని ఆమె వెల్లడించారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటానన్నారు. తన సినీ ప్రస్థానంలో జేజమ్మ (అరుంధతి), దేవసేన (బాహుబలి), రుద్రమ దేవి లాంటి పాత్రలు, ‘సైజ్ జీరో’, ‘వేదం’ లాంటి సినిమాలు చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. అలాగే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉత్సాహంగా చేసిన పనులతో గాయాల పాలయ్యానని చేదు జ్ఞాపకాలను కూడా ఆమె గుర్తు చేశారు. తమిళ ‘సింగం’ చిత్రం చేస్తున్నప్పుడు మంచులో కాలు ఇరుక్కు పోయి, బ్యాక్ ఇంజ్యురీ అయిందన్నారు.
తాజాగా తాను కొద్దిగా స్పీడ్ తగ్గించానన్నారు. విరామం తీసుకోవాలనుకుంటున్నట్టు అనుష్క తెలిపారు. తనతోనూ, తనవాళ్లతోనూ తాను గడపాలనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. చేసే పనిలో మానసిక ఆనందం లేనప్పుడు కొత్త పని వెతుక్కోవడం మంచిదని అనుష్క అభిప్రాయపడ్డారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు బబ్లూ (ప్రకాశ్)తో తనకు పెళ్లి అని రాస్తే ఎలా అనుష్క ప్రశ్నించారు. గతంలో తనకు కొందరు హీరోలు, క్రికెటర్లతో పెళ్లి చేస్తూ రాశారన్నారు. నిప్పులేనిదే పొగ రాదు కదా అనే ప్రశ్నకు ఆమె నవ్వుతూ స్పందిస్తూ….ఇక్కడ నిప్పు లేకపోయినా పొగ పుట్టించే గొప్పవాళ్లున్నారన్నారు.
తనకు వృత్తి మాత్రమే నటన అని అనుష్క పేర్కొన్నారు. జీవితంలో తాను చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. తన దృష్టిలో స్టార్ హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన తిరుగులేని లెజెండ్ అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆయనతో ఫుల్ లెంగ్త్ రోల్ చేయలేదని తెలిపారు.
చివరిగా తన మనసుకు నచ్చిన హీరో గురించి ఆమె బయట పెట్టారు. తన మనసుకు బాగా దగ్గరైన హీరో మన్మథుడైన నాగార్జున అని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నాగార్జున తన తొలి చిత్రం హీరో అని ఆమె వెల్లడించారు.