కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న స్కూల్స్, కాలేజీలు అన్నీ మూసేయాలని నిర్ణయించారు. ఈ నెల 31 వరకు తెలంగాణలో విద్యాసంస్థలన్నీ మూసేయాలని ఆదేశాలు జారీచేశారు. అయితే టెన్త్, ఇంటర్ పరీక్షల్ని మాత్రం యథాతథంగా షెడ్యూల్ నిర్వహించాలని అన్నారు.
కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదు.. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ కూడా మూసేయాలని కేసీఆర్ ఆదేశించారు. కొద్దిసేపటి కిందట కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేసీఆర్, ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ తక్షణం అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనొద్దని సూచించారు సీఎం.
మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. వివిధ దేశాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికుల్ని మాత్రమే కాకుండా.. ఎయిర్ పోర్ట్ స్టాఫ్ కు కూడా ప్రతి రోజూ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే ముంబై, గోవా, కర్ణాటక, ఢిల్లీ, కోల్ కతా, యూపీలో విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ మూసేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తెలంగాణ కూడా చేరింది.
అటు తిరుమలలో కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు. కంపార్ట్ మెంట్స్ లో వేచి ఉండే పద్ధతికి స్వస్తిచెప్పారు. టైమ్ స్లాట్స్ ద్వారా మాత్రమే టిక్కెట్స్ కేటాయించి, క్యూ లైన్లో ఎక్కడా ఆగకుండా నేరుగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేసింది. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఎక్కువమంది ఒకే చోట ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.