రాజకీయాల్లో ప్రజలు ఆదరిస్తే ఎవరైనా ఏమైనా కావచ్చు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజాతీర్పే నేతల తలరాతలను మార్చేది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే సినిమా రంగం నుంచి కమల్హాజన్, రజనీకాంత్ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ హాస్యనటుడు వడివేలు ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల అనంతరం తానూ ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నట్టు ఆయన తెలిపాడు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ మనసులో మాటను బయట పెట్టాడు.
పార్టీకి ఒకరు, పాలనకు మరొకరు అనే రీతిని రజనీకాంత్ వెల్లడించడంపై వడివేలు ఆనందం వ్యక్తం చేశాడు. రజనీకాంత్ అభిప్రాయాన్ని ఆయన స్వాగతించాడు. అయితే రజనీ ఆదర్శాలు బాగున్నాయని, ఇంతకూ ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా అనే విషయం మాత్రం తెలియడం లేదన్నారు. అంతెందుకు స్వయంగా ఆయనకే ఆ విషయం తెలియదేమో అని వడివేలు హాస్యాన్ని పండించాడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అవన్నీ ఆలోచిద్దామని వడివేలు అన్నాడు. మొత్తానికి బాషాపైనే వడివేలు సెటైర్లు వేయడం గమనార్హం.