ఇంకా భ్రమల్లోనే ఉన్నావా జనసేనానీ!

పార్టీ పెట్టి ఆరేళ్లు గడిచినా పవన్ కల్యాణ్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారు. వైసీపీకి ఏపీలో ప్రత్యామ్నాయం జనసేనే అంటున్నారు. అందుకే టీడీపీ అభ్యర్థుల్ని వదిలిపెట్టి, జనసేన అభ్యర్థుల్ని నిలువరించే పనుల్లో వైసీపీ ఉందని చెప్పారు.…

పార్టీ పెట్టి ఆరేళ్లు గడిచినా పవన్ కల్యాణ్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారు. వైసీపీకి ఏపీలో ప్రత్యామ్నాయం జనసేనే అంటున్నారు. అందుకే టీడీపీ అభ్యర్థుల్ని వదిలిపెట్టి, జనసేన అభ్యర్థుల్ని నిలువరించే పనుల్లో వైసీపీ ఉందని చెప్పారు. జనసేన అభ్యర్థులపై దాడులు జరిగాయని, ఓ లిస్ట్ చదివి వినిపించారు. వైసీపీకి ఎదురు తిరిగి నిలబడ్డ జనసేన అభ్యర్థులకు ధైర్యం కూడా చెప్పారు.

జనసేన ఆవర్భావ దినోత్సవంలో దాదాపు పాత క్యాసెట్ నే రిపీట్ చేసిన పవన్ పిరికితనం నుంచి బైటపడాలని జనసైనికులకు హితబోధ చేశారు. ఆరేళ్లు కాదు.. ఇంకో అరవయ్యేళ్లయినా ప్రజల కోసం పార్టీ కోసం పనిచేస్తానని, విజయం దక్కకపోయినా నిజాయితీగా ఉన్నానన్న తృప్తి తనకు చాలని చెప్పారు. పార్టీ పెట్టి ఆరేళ్లవుతున్నా.. పవన్ కి ఇంకా సత్యం బోధపడలేదనే విషయం ఈ ప్రసంగంతో పూర్తిగా అర్థమవుతుంది.

వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారు అయినా మన ప్రయాణం ఆగకూడదని కార్యకర్తలకు ఉపదేశమిచ్చారు పవన్. ఇప్పుడు కాకపోయినా, ఎప్పటికైనా అధికారంలోకి వస్తామని చెప్పారు. తన ఓటమి నెపాన్ని ప్రజలపై నెట్టేందుకు పవన్ మరోసారి వెనకాడలేదు. ప్రజలు మంచివారిని ఎన్నుకోరని, ప్రలోభాలగు లొంగిపోతారని అందుకే వైసీపీ గెలిచిందని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

మొత్తమ్మీద ఆరేళ్లలో పవన్ కల్యాణ్ లో ఏమార్పూ రాలేదనే విషయం అర్థమవుతోంది. ఎంతసేపు ప్రజలు మంచివారు కాదని అంచనా వేసే పవన్, తనలో, తన పార్టీలో, తన అభ్యర్థుల్లో ఉన్న లోపాలేంటనే విషయాన్ని ఎందుకు విశ్లేషించుకోరు. అలా ఆలోచిస్తేనే పవన్ కి భవిష్యత్తులోనైనా విజయాలు దక్కుతాయి. లేకపోతే పాతికేళ్ల ప్రస్థానం మాటల వరకే మిగిలిపోతుంది.

స్క్రిప్టులో వేలు పెట్టట్లేదు..