జనసేనాని పవన్‌కల్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయి పదినెలలు కావస్తోంది. కానీ ఆయన ఇంకా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఉన్నట్టుగానే భావిస్తున్నాడు. ఎంత సేపూ తన గొప్పదనం గురించి జనానికి చెప్పడమే తప్ప, అటు వైపు నుంచి ప్రశంసలు అందుకోవాలనే ధ్యాసే కొరవడింది.
జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన నాయకుల సమావేశంలో పవన్ సూక్తులు చెప్పడానికే పరిమితమయ్యారు. పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే తాను జనసేన పార్టీని స్థాపించానన్నాడు. అంతేకాదు ఆయన తన పిరికితనాన్ని బయట పెట్టుకున్నాడు.
‘నాలోని పిరికితనంపై చిన్నప్పటి నుంచే అనుక్షణం నాలో నేనే ఎంతో పోరాడా. జిమ్‌కు వెళ్తే కండలొస్తాయ్. కానీ మనల్ని భయపెట్టే పరిస్థితుల్ని ఎదుర్కోకపోతే ధైర్యమనే కండ పెరగదు. సమాజంలో నేను పిరికివాడిలా బతకదలచుకోలేదు. పిరికితనం అంటే నాకు చాలా చిరాకు. కేవలం యువతను నమ్మే పార్టీ పెట్టాను. పిడుగు మీద పడ్డా …ఫిరంగి గుండు వదిలినా గానీ చొక్కా తీసి ఎదురొడ్డి నిలబడే ధైర్యం కల్గిన వ్యక్తులు కావాలి. కేవలం ఆవేశం ఉంటే సరిపోదు’ అని తనదైన శైలిలో పవన్ ఉపన్యాసం చేస్తూ పోయారు.
పిరికితనంపై చిన్నప్పటి నుంచే అనుక్షణం తనలో తానే ఎంతో పోరాడతానని పవన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. యువతను నమ్మి పార్టీ పెట్టానని, ఫిరంగి గుండు వదిలినా గానీ చొక్కా తీసి ఎదురొడ్డి నిలబడే ధైర్యం కల్గిన వ్యక్తులు కావాలని కూడా పవన్ పదేపదే చెబుతుండటం గమనార్హం. అంటే పార్టీ స్థాపించి ఆరేళ్లు కావస్తున్నా…తన ఆశయాలకు తగ్గట్టు యువత దొరకలేదని అర్థం చేసుకోవాలా?
ఇదే చంద్రబాబు, జగన్ ఏనాడూ ఇలా పిరికితనంపై మాట్లాడిన సందర్భాలు లేవు. అంతేకాదు నాకలాంటి యువత కావాలి, ఫిరంగి గుండ్లకు ఎదురొడ్డే ధైర్యపరులు కావాలి అని ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఉన్నవాళ్లలోనే మెరికల్లాంటి యువతను ప్రోత్సహిస్తూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించుకునేందుకు బాబు, జగన్ నిత్యం పోరాడుతూ ఉన్నారు. కానీ పవన్ షూటింగ్‌లు లేనిరోజు ఇలా వచ్చి…అలా రెండు సూక్తులు చెప్పి…మరెప్పటికో కనిపిస్తాడు.
నిజానికి ఆయనలోని పిరికితనంపై చిన్నప్పటి నుంచి పోరాడుతున్నాడే తప్ప…దాన్ని ఇప్పటికీ అధిగమించలేకపోతున్నాడు. అందువల్లే ఆయన సినిమాలు, రాజకీయాలనే రెండు పడవలపై ప్రయాణం చేయడం. అసలు తనను విజయం వరించకపోవడానికి కారణం…తనలోని పిరికితనమే అనే వాస్తవాన్ని పవన్ ఎప్పుడు గ్రహిస్తాడో?