తేదేపా..తెల్లారిపోతోంది

చంద్రబాబు నాయుడు. ఆయన అనేక యుద్దములందు ఆరితేరిన వృద్దమూర్తి. భారతంలో భీష్ముడూ వృద్ధుడే. కానీ ఆయనకు కౌరవులు, పాండవులూ ఇష్టులే. కౌరవులు, పాండవులు ఇరువురికీ ఆయన అంటే అభిమానం, గౌరవం. ఇలా అన్ని వైపుల…

చంద్రబాబు నాయుడు. ఆయన అనేక యుద్దములందు ఆరితేరిన వృద్దమూర్తి. భారతంలో భీష్ముడూ వృద్ధుడే. కానీ ఆయనకు కౌరవులు, పాండవులూ ఇష్టులే. కౌరవులు, పాండవులు ఇరువురికీ ఆయన అంటే అభిమానం, గౌరవం. ఇలా అన్ని వైపుల నుంచి అభిమానం సంపాదించుకోవడం అన్నది ఈ కలియుగంలో సాధ్యమయ్యే పని కాదు.

అలా అని చంద్రబాబు నాయుడు సాధించలేనిది లేదు. అధిగమించని ఎత్తులు లేవు. సాధించని విజయాలు లేవు. పన్నని వ్యూహాలు లేవు. ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అనిపించుకోవాలని సదా సరదాపడే, ఉబలాటపడే నాయకుడు. ఆయనే చంద్రబాబు నాయుడు. నిజంగానే వర్తమాన రాజకీయాల్లో ఆయనకు చాణక్యుడు అనేంత పేరు వుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆయనకు మంచి పేరు వుంది. మంచి ఆడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నారు. అన్నీ బాగానే వున్నాయి. కానీ..

చంద్రబాబు నాయుడును నమ్ముకున్నవారు వుండొచ్చు.
చంద్రబాబును నమ్ముకుని వుండొచ్చు అనుకునేవారు మాత్రం లేరనే చెప్పాలి.
వీళ్లను మనతోనే వుంచుకోవాలి ఎప్పటికైనా అని చంద్రబాబు నాయుడు అనుకున్నవారు తక్కువ.
ఆయనతో వుంటే ఎప్పటికైనా మనను పైకి తీసుకువస్తారు. ఆయన్నే నమ్ముకుని వుండాలి అనుకునే వారు అంతకన్నా తక్కువ.

పైగా ఎన్టీఆర్ బతకి వున్న రోజుల్లో చాలా మంది తెలుగుదేశం పార్టీని వీడిపోతూ చేసిన ఆరోపణ కామన్ గా ఒకటి వుంది. తమను బయటకు పోయేలా చంద్రబాబు పొగపెట్టారనే వారు చెప్పి వెళ్లారు. ఉపేంద్ర, దగ్గుబాటి, రేణుక చౌదరి, జయప్రద ఇలా చాలా మంది దగ్గర ఇలాంటి కామన్ కామెంట్ వినిపించింది.

ఒక్కమాటలో చెప్పాలంటే, చంద్రబాబు ఎవరినీ పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోరు. అలాగే చంద్రబాబుకు విశ్వాసపాత్రులు ఎవ్వరూ లేరు. చంద్రబాబు చుట్టూ వున్నవాళ్లు కావచ్చు, లేదా చంద్రబాబు చేరదీసిన వాళ్లు కావచ్చు. అందరూ అవసరార్థం పాదసేవ టైపు మనుషులే.

చంద్రబాబు-వైఎస్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించినవారు. ఇద్దరూ రాయలసీమ వాసులే. కానీ రాజకీయాల్లో ఓ స్థాయికి వచ్చేసరికే వైఎస్ కు ఆ చివర శ్రీకాకుళం నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రతి జిల్లాలో, ప్రతి ఏరియాలో ఒక నమ్మకమైన అనుచరుడు. ప్రాణాలిచ్చేంత అభిమానం కలిగిన అనునాయులు. కానీ చంద్రబాబు అలా కాదు. ఆయన కొన్నాళ్లయినా పక్కన పెట్టకుండా, ఒక్కసారి అయినా దూరం చేయకుండా కూడా వుంచుకున్న అనుచరులు ఎవరన్నా వున్నారా? అంటే కాస్త దిక్కులు చూడాల్సిందే. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.

ఎందుకంటే చంద్రబాబుకు అనుచర గణం వుంది కానీ అభిమానగణం లేదు. ఆయన తన అవసరం మేరకే మనుషుల్ని చేరదీస్తారు. అవసరం లేదని తెలిసిన, లేదా వారితో తనకు ఇబ్బంది అని తెలిసినా, టక్కున వదిలేయడానికి నిమిషం కూడా ఆలోచించరు. అది ఆయన నైజం.

కానీ వైఎస్ అలా కాదు. తన మనిషి అంటే ప్రాణం పెట్టేస్తారు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు అడ్డం పడినా, సమస్యలు వస్తాయనుకున్నా, ఆ మనిషి చేయి వదలరు. ఆ మనిషికి ఏదో ఒకటి చేసి తీరాలన్న పట్టుదల వీడరు.

నిజానికి రాయలసీమలో నాయకులకు ఇలా అనుచరులను పట్టి వుంచుకోవడం, వారికి తాము, తమకు వారు అనే విధమైన బంధం పెంచుకోవడం అలవాటు. ఆ అలవాటే వైఎస్ కు వచ్చింది. కానీ మరే అదే రాయలసీమకు చెందినా చంద్రబాబుకు అలా తనకంటూ కొంత అభిమాన సైన్యాన్ని తయారుచేసుకోవడం సాధ్యం కాలేదు. స్వంత అన్నదమ్ముడే బాబుకు దూరం అయిన వైనం తెలిసిందే. మామను గద్దె దింపింది, బావమరిది హరికృష్ణను ఏ విధంగా పక్కన పెట్టిందీ, తోడల్లుడును ప్లాన్డ్ గా పక్కకు తప్పించినదీ, ఆఖరికి తానే సంబంధం కూర్చి పెళ్లి చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను ఎలా దూరం చేసుకున్నదీ అందరికీ తెలిసిన విషయాలే.

ఇలా చంద్రబాబు తన మనుషులు అనుకునేవారు లేకుండా చేసారు. కనిపించడానికి ఆయన పక్కన చాలా మంది వుండొచ్చు. ఎన్టీఆర్ ను గద్దె దింపిన నాటి నుంచీ ఆయనతో వున్న రాజకీయ నాయకులు అనేకమంది వుండొచ్చు. కానీ వీడిపోయినవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలా వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చిన వారూ వున్నారు. ఇలా అటు ఇటు అవుతున్నవారే ఎక్కువ. కానీ వైఎస్ తో పోల్చుకుంటే చంద్రబాబుకు తనవాళ్లు అనుకునేవాళ్లు దాదాపు లేరనే చెప్పాలి.

బాబుకే ఎందుకిలా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు వుండరు. కానీ వైఎస్ వ్యవహారం అలా కాదు. ఆయన మనుషులు అనేవారు ఏ పార్టీలో వున్నా వైఎస్ అంటే వుండే అభిమానం వేరు. భయభక్తులు వేరు. ఓసారి ఓ పాత్రికేయుడు మంత్రి కుతూహలమ్మ దగ్గరకు వెళ్లాడు.  ఆ టైమ్ లో కుతూహలమ్మకు ఫోన్ వచ్చింది. ఆమె టక్కున లేచి, సార్ చెప్పండి అంటూ ఫోన్ లో మాట్లాడారట. ఆ ఫోన్ చేసింది వైఎస్. ఆయన అంటే అంత గౌరవం ఆమెకు. అప్పటికి వైఎస్ సిఎమ్ గా లేరు. కానీ ఆయన వాల్యూ అది.

వైఎస్ మరణం అనంతరం జగన్ ను కొంతమంది వైఎస్ అనుచరులు వీడిపోయారు. కానీ ఏ ఒక్కరు వైఎస్ గురించి ఒక్క విమర్శ చేసిన దాఖలా లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా దాదాపు తండ్రి బాటనే సాగుతున్నారు. తనను నమ్ముకుంటే, ఆ వ్యక్తిని వదలను, ఆ చేయి విడువను అనే నమ్మకాన్ని ఆయన కలిగించకలుగుతున్నారు. మంత్రి వర్గ కూర్పు చూస్తే ఆ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. అంతే కాదు, ఎవ్వరు ఏమనుకుంటే అనుకోనీ తనను నమ్ముకున్నవారికి చేయూత ఇవ్వాలన్న పద్దతితోనే ముందుకు సాగుతున్నారు.

పార్టీ పునాదుల్లోనే సమస్య

తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చేసరికి కీలకమైన పాయింట్ ఏమంటంటే, ఆ పార్టీ పునాదులు బిసి సామాజిక వర్గంలో వున్నాయని అంటారు. కానీ ఆ పార్టీని కీలకంగా ప్రభావితం చేసేది కమ్మసామాజిక వర్గం. అది కూడా పక్కా వ్యాపార వర్గం. వ్యాపారవర్గానికి ఎప్పుడూ తమ తమ వ్యాపారాలు కీలకం. ప్రభుత్వం ఎవరిదైతే వారితో వుండాల్సిన అవసరం తప్పదు. గతంలో వెంకయ్య నాయుడు కేంద్రంలో కీలకంగా వున్న రోజుల్లో, చంద్రబాబు హవా సాగుతున్న టైమ్ లో చాలా మంది కమ్మ సామాజిక వర్గ నేతలు భాజపా వైపు మొగ్గారు. ఆ విధంగా ఆంధ్రలో భాజపాను తేదేపా 2 గా గా తయారుచేయాలనుకున్నారు.

తీరా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, వీళ్లంతా గాయబ్. అంతలో పురంధ్రీశ్వరి మంత్రి అయ్యాక మళ్లీ అటు జంప్. ఆమె హవా ముగిసాక మళ్లీ తెలుగుదేశంలోకి. ఇలా ఎటు అధికారం వుంటే అటు వెళ్లిపోయే సామాజిక వర్గాన్ని నమ్ముకుని ఎంతకని రాజకీయాలు చేయగలరు? వాస్తవానికి ఇప్పుడు జగన్ తెలుగుదేశం నుంచి వచ్చేవాళ్లకు రకరకాల ఫిల్టర్లు వాడుతున్నారు. లేదూ అంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఖాళీ అయిపోయి వుండేది. అది వాస్తవం.  అయితే వ్యాపార వర్గం రెండు రకాలుగా ఆలోచిస్తుంది. అయితే అధికార ఫక్షం వైపు వెళ్లిపోవడం లేదా, తటస్థంగా వుండిపోవడం అన్నది ప్లాన్ గా వుంటుంది.

ఈ రెండింటిలో ఏదైనా సమస్యే. ఆ వర్గం నుంచి అప్పటి దాకా అండదండలు అందుకున్న పార్టీకి సమస్యే. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అదే. అండదండలు అందించే వర్గం మౌనం వహిస్తే, రాజకీయాలు చేయడం అన్నది ఏ పార్టీకి సాధ్యం అయ్యే పని కాదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఏ నాయకుడు జేబులోంచి తీయరు. చంద్రబాబు తరపున పెట్టుబడి పెట్టి రాజకీయాలు చేసే వర్గం తటస్థంగా వుంది. కిమ్ కర్తవ్యమ్?

మరి అదే జగన్ దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు పాతిక శాతం ఎమ్మెల్యేలను లాక్కున్నా, తట్టుకుని, మిగిలిన వారిని నిలబెట్టుకుని అయిదేళ్లు నిలబడ్డారు. చంద్రబాబు ఎన్ని ఉపాయలు పన్నినా మూడు వంతుల మంది జగన్ ను నమ్ముకునే వున్నారు.  వారందరిని జగన్ తన మనుషులుగా చూసుకుంటూనే వున్నారు.  అయిదేళ్లు వేచి వుండి వనరులు సమకూర్చుకుని మళ్లీ ఢీ కొన్నారు. ఈ పరిస్థితి గతంలో చంద్రబాబుకు వుండేదేమో కానీ ఇప్పుడయితే కాదు.

జగన్ పాదయాత్ర చేస్తే, జనం సంగతి అలా వుంచి, ప్రతి చోటా నాయకులు సాయం పట్టారు. చంద్రబాబు బస్ యాత్ర ఇలా ప్రారంభించి అలా ఆపేయాల్సి వచ్చింది. రాజధాని ఉద్యమం కూడా అంతలా సాగింది అంటే అది చంద్రబాబు సత్తా కాదు, అమరావతి మార్పు అన్నది వేలాది మంది వ్యాపారులను నష్టపెట్టడం వల్ల బయటకు వచ్చారు. లేదూ అంటే రారు కాక రారు.

మరో నాలుగేళ్లు

ఇప్పటికి ఇంకా ఏడాది కాలమే పూర్తయింది జగన్ అధికారంలోకి వచ్చి. ఇంకా నాలుగేళ్లు గడవాలి. వ్యాపార వర్గం నాలుగేళ్ల పాటు తట్టుకుని వుండడం అంటే చిన్న విషయం కాదు. వ్యాపారాలతో పాటు, వ్యాపారాల కోసం రాజకీయాలు చేసేవారు అసలే వుండలేరు. వీళ్లను నమ్ముకున్న పార్టీ, ఆ పార్టీ నేతగా చంధ్రబాబు కూడా నిలబడడం అన్నది చాలా కష్టం. డబ్బు కన్నా నమ్మకం, విశ్వాసం వాటితో పార్టీని నిలబెట్టడం వేరు. వ్యాపారాల కోసం రాజకీయాలు చేసేవారితో పార్టీని నిలబెట్టడం వేరు.

బాబు చేసిన తప్పు

సుజనచౌదరి, సిఎమ్ రమేష్ లాంటి వాళ్లు తేదేపాను వీడి భాజపాలోకి వెళ్లినపుడు జరిగిన ప్రచారం ఒకటి వుంది. బాబుగారే వాళ్లను ఆ పార్టీలోకి పంపించారన్నది ఆ ప్రచారం. ఇది నిజం కాదని చంద్రబాబు నిరూపించుకోవాల్సి వుంది. ఆ దిశగా గట్టి విమర్శలు చేయాల్సి వుంది. కానీ అస్సలు అలా జరగలేదు. పైగా అలా వెళ్లిన వాళ్లు కూడా భాజపాలో వుంటూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి విషయం ఏ విధమైన సందేశాన్ని పంపిస్తుంది? బాబుగారి స్వంత మనుషులే వారి వ్యవహారాలు వారు చూసుకుంటున్నపుడు, మనం ఎందుకు చూసుకోకూడదు అనిపిస్తుంది. అంతే కదా? పైగా వెళ్లిపోయినవారంతా బాబుగారి హయాంలో అధికారం వెలగబెట్టిన వారు.  అయదేళ్లు అధికారం, దాని ద్వారా వచ్చిన ఐశ్వర్యం అనుభవించిన వారే , అధికారం లేనపుడు పక్కకు తప్పుకుంటే, ఎప్పటికైనా పైకి ఎదగాలనుకున్నవారు ఎందుకు ఈ పడవను నమ్ముకుంటారు?

భవిష్యత్ అగమ్య గోచరం

ముందే చెప్పుకున్నట్లు ఇంకా నాలుగేళ్లు సమయం వుంది మళ్లీ ఎన్నికలు రావడానికి. కానీ అప్పటికి చంద్రబాబు పూర్తిగా వృద్దుడు అవుతారు. లోకేష్ నాయుడు మీద, ఆయన శక్తి సామర్థ్యాల మీద అంతగా ఆశలు తెలుగుదేశం పార్టీలో వారికి కానీ, దానిని నమ్ముకున్న సామాజిక వర్గానికి కానీ లేవు. అలాంటపుడు ఆ పార్టీని నమ్ముకుని ఎందుకు వుంటారు?  ఏం చెప్పి చంద్రబాబు వారిని ఆపగలరు? పైగా చాలా మంది సీనియర్లతో లోకేష్ కు సరైన సంబంధాలు లేవు అని రాజకీయ వర్గాల్లో టాక్ వుంది.  రాబోయే కాలంలో కాబోయే పార్టీ చీఫ్ లోకేష్ అనే ఫిక్స్ అయిపోయిన తరువాత, అయిదేళ్ల తరువాత పార్టీ పరిస్థితి ఎలా వుంటుందో తెలియదు అన్న అనుమానం వున్నపుడు ఎవరైనా పార్టీలో ఎందుకు వుంటారు?

నిజానికి ఆ మీడియాల అండదండలు లేకపోతే, ఇప్పటికే జనాలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా వదిలేసి వుండేవారు. తెల్లవారి లేచిన దగ్గర నుంచి జగన్ ను జనం దృష్టిలో ఎలా విలన్ ను చేయాలా అని సదరు సామాజిక మీడియా కిందా మీదా పడుతోంది కనుక, ఇంకా కాస్త ఊపిరి ఆడుతోంది. లేదూ అంటే ఎప్పుడో కూనారిల్లిపోయేది తెలుగుదేశం పార్టీ. దానికి కారణం ఒక్కటే రాజకీయాలను వ్యాపారంగా చేసిన పార్టీ ఒకటి. రాజకీయాలను నమ్ముకున్న వారి కోసం చేసిన పార్టీ మరోటి కావడమే.

చాణక్య
writerchanakya@gmail.com