సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల్నీ కేంద్ర ప్రభుత్వ చేతిలో పావులనే విమర్శ వుంది. కేంద్రంలో అధికారం చెలాయించే పార్టీ ఆడించే ఆటబొమ్మలు సీబీఐ, ఈడీ అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. తమకు అనుకూలమైన నేతల కేసులపై చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారనే విమర్శలో నిజం లేకపోలేదు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుమార్తె కాన్వొకేషన్‌కు వెళ్లాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే, వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం జగన్‌కు ఎక్కడ అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే ప్రశ్న తలెత్తింది.
వైఎస్ జగన్ పారిస్ టూర్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ గట్టిగా వాదిస్తోంది. ఎందుకంటే… జగన్ పారిస్ పర్యటనకు వెళితే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని సీబీఐ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మోదీ సర్కార్ అనుకూలంగా వ్యవహరిస్తోందనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో ….ఆయన పర్యటనను అడ్డుకోవాలని సీబీఐ పిటిషన్ వేయడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్‌లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ డిగ్రీ విద్యార్థిని. జూలై 2న హర్షరెడ్డి కాన్వొకేషన్ తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కోర్టుని అనుమతి కోరారు. బెయిల్ షరతును సడలించి, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టుని ఆయన కోరారు.
ఈ నేపథ్యంలో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వివిధ కారణాలు చెబుతూ జగన్ విదేశాలకు వెళుతుండడాన్ని సీబీఐ కోర్టు దృష్టికి కేంద్ర దర్యాప్తు సంస్థ తీసుకెళ్లింది. విదేశాలకు వెళితే విచారణలో జాప్యం జరుగుతుందని, కావున ఆయనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఈ నెల 28 నుంచి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఏ విధంగా స్పందిస్తుందోననే చర్చకు తెరలేచింది.
మరి కేంద్రంలో అధికార పార్టీతో సత్సంబంధాలు ఉంటే జగన్‌కు వ్యతిరేకంగా సీబీఐ ఏ విధంగా కౌంటర్ దాఖలు చేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికి జగన్ పారిస్ టూర్‌పై ఉత్కంఠ నెలకుందని చెప్పొచ్చు.