వైసీపీ కార్యాలయాలకు ఖరీదైన భూములు కేటాయించారని ఈనాడులో వార్త. కౌంటర్‌గా సోమవారం ఏది నిజం? పేరుతో సాక్షిలో అరపేజీ ఈనాడుని ఏకుడు. నాడు వంతపాట అని హెడ్డింగ్‌తో మొదలైన వార్తలో విషయం ఏమంటే చంద్రబాబు 2016లో రాజకీయ పార్టీలు కార్యాలయాలు నిర్మించుకోడానికి ఒక జీవో తెచ్చాడు. దాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల స్థలాలను లీజు పేరిట పార్టీ కార్యాలయాలకి కేటాయించుకున్నాడు.
అపుడు అది అక్రమమని ఈనాడుకి ఎందుకు అనిపించలేదు? వందల కోట్ల ఆస్తులు బాబు స్వాహా చేస్తుంటే రామోజీ ఎందుకు పెన్ను విదిలించలేదు? హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ ట్రస్ట్ కేటాయింపు ఆగమేఘాల మీద జరగలేదా? ఇవి సాక్షి ప్రశ్నలు. న్యాయమైన ప్రశ్నలు. ఇది చదివిన ఎవరికైనా చంద్రబాబు అవినీతిపై నోరెత్తని ఈనాడు, వైసీపీపైన మాత్రం ఒంటికాలి మీద లేస్తుందని కోపం వస్తుంది.
విషయం ఏమంటే ఈనాడు విశ్వసనీయతపై ఎవరికీ భ్రమలు లేవు. సాక్షి వచ్చిన తర్వాత , సోషల్ మీడియా రాకతో పాఠకులకి క్లారిటీ వచ్చేసింది. ఇక చంద్రబాబు అడ్డగోలు పనులు చేస్తాడని అందరికీ తెలుసు. ఆయన నుంచి ప్రజాస్వామ్య పారదర్శక చర్యలు ఎవరూ ఆశించడం లేదు.
సాక్షి, ఈనాడు ఏది నిజం? వార్‌లో మనకు అర్థం కానిది ఏమంటే వీళ్లు మనకి ఏం చెప్పదలచుకున్నారు? వైసీపీ పనులు అక్రమమని ఈనాడు, బాబు చేసినవన్నీ తప్పుడు పనులే అని సాక్షి బల్లగుద్ది వాదిస్తూ వుంటారు.
ఈనాడు చెడిపోయి చాలా కాలమైంది. సొంత హితమే తప్ప ప్రజాహితం ఆశించడం వేస్ట్. ప్రజాహితం ముసుగులో సొంత ఎజెండా వుంటుంది. సాక్షి ఈ మధ్యనే వచ్చింది కదా, దీనిబాట కూడా ఈనాడే కదా! ఎందుకంటే ఏది నిజంలో చంద్రబాబు అవినీతి, ఈనాడు వంత పాటని గురించి రాయడం కరెక్టే. దీనితో పాటు రాయాల్సిన విషయం ఏమంటే తాము లీజుల పేరిట ధర్మబద్ధంగానే స్థలాలు తీసుకున్నామని ఎక్కడా లేదు.
చట్టం వేరు, ధర్మం వేరు. గవర్నమెంట్ జీవో ప్రకారమే అయినా కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని పార్టీలు తీసేసుకోవచ్చా? అదంతా ప్రజాధనం కాదా? ఆ ప్లేస్‌లో పార్టీ ఆఫీస్ ఉంటే ఎవరికి లాభం? అదే ప్లేస్‌లో ఆస్పత్రి లేదా స్కూల్ వుంటే ప్రజలకి ఉపయోగం కాదా? నడిబొడ్డున పార్టీ ఆఫీస్ ఎందుకు? చంద్రబాబు చేశాడని మీరూ చేయడం కరెక్టా?
చంద్రబాబు ఖజానాకి చిల్లు పెట్టాడు కాబట్టి, మేము అంతకు మించిన చిల్లు పెడతామనడం కరెక్టా? చంద్రబాబు జనం క్షేమం కోరే మనిషి కాదని నమ్మడం వల్లే కదా మిమ్మల్ని బంపర్ మెజార్టీతో ఎన్నుకున్నది?
ప్రతిదానికి గత ప్రభుత్వ హయాం … అంటూ దీర్ఘాలు తీసి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అని చొక్కా పట్టుకోవడం ఎబ్బెట్టుగా లేదా? అపుడు ప్రశ్నించలేదు కాబట్టి ఇపుడు ప్రశ్నించకూడదా? ప్రశ్నకి ప్రశ్నతో ఎన్నాళ్లు సమాధానం చెబుతారు?