దంపతులు పరస్పరం అనురాగంగా ఉండడం మంచిదే. అయితే భర్త బూతులను కూడా వెనకేసుకొచ్చేంత ప్రేమ, అనురాగాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతి కనబరచడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీని ప్రభుత్వం అర్ధరాత్రి కూల్చడాన్ని ఎవరూ సమర్థించరు. అయితే అందుకు దారి తీసిన పరిస్థితులను విస్మరించడం పక్షపాత ధోరణి అవుతుంది.
తమ ఇంటి ప్రహరీ కూల్చివేతపై అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ సామాజిక వర్గం కాబట్టే నిలువ నీడ లేకుండా చేశారని కులాన్ని ఆమె తెరపైకి తెచ్చారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త అయ్యన్న తప్పుగా ఏం మాట్లాడలేదని, మంత్రి రోజా వ్యాఖ్యలకు కౌంటర్ మాత్రమే ఇచ్చారని వెనకేసుకొచ్చారు. తమ కుటుంబం ఎవరికీ అన్యాయం చేసిందని ఆమె ప్రశ్నించారు.
మహానాడులో ప్రజల కోసం అయ్యన్న గళమెత్తినందుకు ఇల్లు కూల్చేస్తారా?. అయ్యన్న గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో మాట్లాడే హక్కు కూడా లేదా? ప్రజల గురించి మాట్లాడితే తప్పేంటి? అని నిలదీశారు. రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఆమెకు తప్పుగా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రోజా స్థానంలో తాను ఉండి ఒకసారి ఆలోచించాలని అధికార పార్టీ నేతలు అయ్యన్నపాత్రుడి సతీమణికి హితవు చెబుతున్నారు.
మాట్లాడే హక్కు అంటే, ప్రత్యర్థులను దూషించడం కాదని తెలుసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. కనీసం ఇంట్లో మహిళలైనా తమ భర్తల మాట తీరుపై హెచ్చరిస్తే కాస్తైనా మారుతారని, అలాంటిది వాళ్లే సమర్థిస్తే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదేదో ఒక్క అయ్యన్న దంపతులకు మాత్రమే చెప్పడం కాదని, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంస్కారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.