‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ప్రశాంత్ కిషోర్ టీం నిఘా పెట్టింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు వద్దకు ప్రతిరోజు వెళ్లక తప్పనిసరి ఏర్పడింది. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ప్రజలు నిలదీస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో 8 నెలల పాటు ప్రజల మధ్యే గడపాలని సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం మరోసారి ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ (పీకే) టీం నిఘా పెట్టినట్టు అధికార పార్టీ నేతలు గుర్తించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎలా పాల్గొంటున్నారు? చిత్తశుద్ధితో ప్రజలను కలుస్తున్నారా? నిజంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందా? ఒకవేళ వస్తుందో, ఎందుకు, ఎక్కడి నుంచి తదితర కారణాలను ఎప్పటికప్పుడు పీకే టీం సీఎం కార్యాలయానికి నివేదిస్తున్నట్టు సమాచారం.
పీకే టీం నివేదిక ఆధారంగా కొందరు ఎమ్మెల్యే, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను వైసీపీ పెద్దలు పరోక్షంగా హెచ్చరిస్తున్నారని సమాచారం. ఫలానా చోట ఎందుకు ఇలా చేశారు? అక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తోంది? ఆ తప్పును సరి చేయండి అంటూ వైసీపీ పెద్దలు, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారని సమాచారం.
దీంతో తమ దగ్గర జరిగే విషయాలు అక్కడి వరకూ ఎలా వెళ్లాయో తెలియక అయోమయంలో నేతలు ఉన్నారని సమాచారం. మొత్తానికి ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ పనితీరును అంచనా వేయడానికి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలిసింది.