అదిగో ఆయన చేరాడు, ఇదిగో ఈయనా చేరాడు.. కరణం బలరాం ఫ్యామిలీ చేరింది, కేఈ ప్రభాకర్ చేరబోతున్నారు.. శమంతకమణి, యామినీ బాలా, ఇంకా.. ఐజయ్య.. వీళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ వార్తలుగా రాసుకోవడానికే పనికి వస్తాయేమో! వీరిలో చాలా మంది రాజకీయంగా ఏ మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేరు. మరి కొన్ని చోట్ల కొన్ని చేరికలు పార్టీలో గ్రూపు తగాదాలకూ కారణం కావొచ్చు.
ఇప్పటికే చీరాల నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు మొదలైనట్టుగా ఉన్నాయి. కరణం బలరాం వర్గం చేరికతో .. ఆయన చేతిలో ఓడిపోయిన ఆమంచి సహజంగానే అసంతృప్తితో ఉన్నట్టున్నారు. ఆయనను ముఖ్యమంత్రి జగన్ పిలిపించుకుని మాట్లాడారట. ఆ చేరికపై ఏదో ప్రకటన చేశారు.. అభ్యంతరం లేదన్నట్టుగా ఆమంచి. ఇంతకు మించి ఏం చేయలేని పరిస్థితి.
ఇక శమంతకమణి, ఐజయ్య వంటి వారి చేరికలతో వచ్చే ఉపయోగం పెద్దగా ఉండకపోవచ్చు. ఈ ఐజయ్య అంత వరకూ చంద్రబాబును తిట్టి.. ఎన్నికల సమయంలో తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకట! స్థానిక ఎన్నికల నేపథ్యంలో.. చేరికలు చూపించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా కండువాలు కప్పేస్తున్నట్టుగా ఉంది. ఇవన్నీ చూస్తే.. సుమతీ శతకంలోని కప్పల పద్యం ఒకటి గుర్తుకు రాకమానదు.
''ఎప్పుడు సంపదగలిగిన
అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ'' అ పద్యాన్ని గుర్తు చేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. అయితే ఇవి తెలుగుదేశానికి చేసే నష్టం మాత్రం చేయకమానవేమో!