స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీ కొంప కూలిపోతోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతున్న చందంగా…వైసీపీలోకి జంపింగ్‌లతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గజగజలాడుతున్నాడు. ఎప్పుడు ఎవరు పార్టీ వీడుతారోననే అశుభ వార్త వినాల్సి వస్తుందోననే బాబు బిక్కుబిక్కుమంటూ బాబు కాలం వెళ్లదీస్తున్నాడు. జగన్‌పై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా….తన పార్టీ శ్రేణుల్లోనూ, నాయకుల్లోనూ పార్టీ భవిష్యత్‌పై బాబు భరోసా కల్పించలేకపోతున్నాడు.
మరీ ముఖ్యంగా టీడీపీ హార్డ్ కోర్ నాయకులుగా పేరుగాంచిన కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం, కదిరి బాబూరావు తదితరులు జగన్ నాయకత్వంతో నడిచేందుకు సిద్ధపడటం నిజంగా సంచలనమే.
తాజాగా మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా కర్నూలు జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ టీడీపీకి మనుగడ లేదని విమర్శించాడు.
ఇక అనంతపురం జిల్లాలో కూడా టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా టీడీపీని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం. కొంత కాలంగా వీరు తమ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు దళితులను పక్కన పెడుతున్నారనే ఆక్రోశంతో పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరగుతోంది. కర్నూలుకు చెందిన బలమైన బీసీ నేత కేఈ ప్రభాకర్‌తో పాటు అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి కుటుంబం టీడీపీని వీడుతుండటం…ఆ పార్టీకి భారీ షాక్ అనే చెప్పాలి.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని వీడడాన్ని చూస్తే… త్వరలో టీడీపీ కార్యాలయాలకు TO LET బోర్డు పెట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలుతో క్షేత్రస్థాయిలో బలమైన పునాదులను ఏర్పరచుకుంటోంది. దీంతో టీడీపీ నాయకులు తమ పార్టీకి భవిష్యత్ ఉండదనే భయాందోళనలకు గురవుతూ తమ దారి తాము చూసుకుంటున్నారు.