ప్రజలకిచ్చిన మాట జగన్ తప్పాడని ఇప్పుడు పచ్చమీడియా ఒక కొత్త పాట ఎత్తుకుంది. సాక్ష్యాధారాలతో సహా జగన్ ఏ రకంగా మాట తప్పారో నిరూపించడానికి ప్రయత్నించింది. ఈ కథనాలను నమ్మితే.. జగన్ మాట తప్పినట్టే అందరికీ అర్థమవుతుంది. అయితే ఇదే జగన్ ఫెయిల్యూర్.. చంద్రబాబు నాయుడుకు ఒక బంపర్ ఆఫర్ గా కలిసి వచ్చే అవకాశమూ ఉంది. మరి ఆ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా లేదా అనేదే చర్చ.
జగన్ గత ఎన్నికల సందర్భంలో ఏపీలో మద్యనిషేధం తీసుకువస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. 2024 నాటికి కేవలం స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం సరఫరా పరిమితం అయ్యేలా విధానం తెస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. మద్యం ధరలు పెంచడం, లిక్కర్ దుకాణాలను ప్రభుత్వ పరం చేయడం, దుకాణాల సంఖ్య తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలన్నీ కూడా మద్యనిషేధం దిశగా తొలిఅడుగులే అని అందరూ భావించారు.
అయితే తాజాగా కొత్త లిక్కర్ పాలసీ ని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త బార్ల విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విధానం మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది. అంటే 2025 వరకు ఇదే విధానం అన్నమాట. దీన్ని ఆసరాగా చేసుకుని, 2025 వరకు ఒక్క బారు కూడా తగ్గబోయేది లేదని, అంటే 2024 నాటికి స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తానన్న మాట గాలిలో కలిసిపోయినట్లేనని పచ్చమీడియా ఆక్రోశిస్తోంది. ఆ పాయింట్ నిజమే కావచ్చు.
కానీ ఈ కొత్త విధానం బార్లకు సంబంధించింది మాత్రమే. బార్ల సంఖ్య మాత్రమే తగ్గదు. 2024 ఎన్నికల్లోగా లిక్కర్ దుకాణాల సంఖ్య తగ్గే అవకాశం లేదని చెప్పలేం. ఏదైతేనేం.. ఇదంతా జగన్ మాటతప్పడానికి నిదర్శనంగా, జగన్ ఫెయిల్యూర్ గా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
సరే ఆయనది ఫెయిల్యూరే అనుకుందాం. మరి ఈ విషయాన్ని తనకు లభించిన బంపర్ ఆఫర్ గా స్వీకరించడానికి చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారా? మద్యనిషేధం విషయంలో జగన్ ఫెయిలయ్యాడు.. ఈసారి తాను అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమల్లోకి తెస్తా అని చెప్పగల దమ్ము చంద్రబాబుకు ఉందా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
మద్యం అనేది ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మారిపోయిన సమాజం మనది. మద్యనిషేధం ఆచరణలో అంత సులభం కాదు. చంద్రబాబు తన చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న పచ్చమీడియాతో జగన్ మీద బురద చల్లించడం మాత్రమే కాదు.. తనకు ధైర్యం ఉంటే.. తాను అధికారంలోకి రాగానే మద్యనిషేధం అమల్లోకి తెస్తానని చెప్పాలి. అప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.