ఆత్మకూరులో బీజేపీకి జనసేన మొండిచేయి చూపిందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తోంది. తన అభ్యర్థిగా భరత్‌కుమార్‌ను బీజేపీ బరిలో నిలిపింది.
బద్వేలు ఉప ఎన్నికలో పాటించిన సంప్రదాయాన్ని కూడా జనసేన ఆత్మకూరులో పాటించకపోవడంపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. గతంలో బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయకపోయినా, మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తుండడంతో మద్దతు ప్రకటించింది.
కానీ ఆత్మకూరులో ఇంత వరకూ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు జనసేన నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అనేక రకాల చర్చకు దారి తీస్తోంది.
బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్ పేరు ప్రకటించాలని జనసేన నాయకులు ఇటీవల డిమాండ్ చేశారు.
ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తున్నప్పుడు ఈ డిమాండ్ రావడంపై ఆ పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశాయి. దీంతో జనసేన నాయకులు కూడా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
అందుకే ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు తమ నాయకుడు పవన్‌కల్యాణ్ ప్రకటించలేదని జనసేన కార్యకర్తలు, నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు వుంది.
అయినప్పటికీ జనసేనాని నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అంటే భవిష్యత్ రాజకీయాలు ఎలా వుండనున్నాయో పవన్ చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీతో కలిసి పొత్తు కుదుర్చుకోవాలనేది జనసేనాని ఆలోచన. అయితే టీడీపీకి దూరంగా ఉండాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే పవన్‌కల్యాణ్ ఎంతగా ఒత్తిడి తెస్తున్నా బీజేపీ మాత్రం తలొగ్గలేదు.
తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను విడిచి, దూరదృష్టితో ఆలోచించి అడుగులు వేయాలని పవన్‌కు బీజేపీ సూచిస్తోంది. అయితే వాటిని పవన్ తలకెక్కించుకుంటున్నట్టుగా లేదు.
మొత్తానికి ఆత్మకూరులో బీజేపీకి మద్దతు ఇవ్వకపోవడం ద్వారా, ఆ పార్టీకి తాను దూరమే అనే సంకేతాల్ని ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.