బీజేపీతో పొత్తు.. టీడీపీకి తొత్తు.. అంబటి పంచ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. టీడీపీతో ఆల్రెడీ రహస్య స్నేహం కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్.. బీజేపీతో తన పొత్తుపై స్పష్టత ఎందుకు ఇవ్వడం…

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. టీడీపీతో ఆల్రెడీ రహస్య స్నేహం కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్.. బీజేపీతో తన పొత్తుపై స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని  ప్రశ్నించారు.

“పవన్ కల్యాణ్ ఒక్కడే రైతుల్ని పట్టించుకుంటున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. వైసీపీ మీద బురద జల్లడానికి మాత్రం పవన్ కల్యాణ్ ఉపయోగపడుతున్నారు. టీడీపీతో ఆయన ఆల్రెడీ సీక్రెట్ సంబంధాలు పెట్టుకున్నారనే విషయం ఆయన యాత్రలతో అర్థమౌతోంది. బీజేపీతో పొత్తు ఉందని చెబుతారు కానీ, ఆత్మకూరు ఉప ఎన్నికపై మాత్రం స్పందించరు. ఇవన్నీ చూసుకుంటే.. పవన్ వ్యవహారశైలి ఏంటనేది ఎవరికైనా అర్థమౌతుంది.”

బీజేపీతో జనసేన కలిసున్నట్టు తనకు అనిపించడం లేదన్నారు అంబటి. అలాంటప్పుడు బీజేపీకి రాజకీయ శత్రువుగా ఉన్న చంద్రబాబు వైపు పవన్ ఎందుకు మొగ్గుచూపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

“మేం కలిసున్నాం అని బీజేపీ అంటోంది. జనసేన కూడా అదే మాట అంటోంది. కానీ ఆ దాఖలాలు కనిపించడం లేదు. ఆత్మకూరులో బీజేపీకి ఓటు వేయమని పవన్ ఎందుకు చెప్పడం లేదు? ఎందుకీ మోసం. రాజకీయాల్లో మోసం చేయడానికే జనసేన పార్టీ వచ్చింది.”

ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం పవన్ కల్యాణ్ కు లేదని.. అందుకే బీజేపీతో పాటు ఏపీ ప్రజల్ని ఆయన మోసం చేస్తున్నారని అన్నారు. ఓవైపు బీజేపీతో పొత్తు అంటూనే, మరోవైపు చంద్రబాబు కోసం అర్రులు చాస్తున్న పవన్ కల్యాణ్ రాజకీయం తనకు బొత్తిగా అర్థం కావడం లేదన్నారు అంబటి.