అధికారాన్ని కోల్పోయి , రోజుకొక నాయకుడు చేజారుతున్న వేళ…టీడీపీలో సంతోషాన్ని నింపిన సందర్భం. అది హైకోర్టు రూపంలో టీడీపీకి ఓదార్పు లభించింది. పలు పిటిషన్లపై విచారణ సాగిస్తున్న ఏపీ హైకోర్టు గురువారం ఏపీ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, రెవెన్యూ శాఖల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇది రాష్ట్రమా… మరొకటా! అని విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో చట్టాలు, నిబంధనలు అమలవుతున్నాయా అని ప్రశ్నించింది. హైకోర్టు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు అధికార వైసీపీకి ఖేదాన్ని, ప్రతిపక్ష టీడీపీతో పాటు మిగిలిన పక్షాలకు మోదాన్ని నింపాయని చెప్పొచ్చు.
ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగడం, ఆయన్ను కొందరు అడ్డుకోవడం, తిరిగి వెళ్లాలని పోలీసులు కోరడం, ఈ సందర్భంగా సీఆర్పీసీ 151 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేయడంపై టీడీపీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.
హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్సవాంగ్పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే పేదలకు ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న భూసేకరణ తీరునూ తప్పుపట్టింది. పోలీసులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని… అసైన్డ్ భూముల్లో వారికేం పని అని ప్రశ్నించింది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన పొలాలను ఇళ్ల స్థలాలకు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. సీఆర్డీఏ చట్టంలో ఏదో చిన్న అంశాన్ని అవకాశంగా తీసుకుని రాజధానిలో ఇంటి స్థలాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది.
అలాగే రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపుపై డీజీపీని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేతకు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. చట్టాల అమలుపై డీజీపీయే కోర్టుతో చెప్పించుకుంటే ఎలా? అని నిలదీసింది. మున్ముందు పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ జోక్యం తప్పదని, ఈ వ్యవహారాలపై తగు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టులో ఈ రకమైన పరిణామాలు ప్రతిపక్ష టీడీపీలో జోష్ నింపాయి. అలాగే రాజధానిలో ఇంటి స్థలాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో….రాజధాని తరలింపుపై కూడా న్యాయస్థానంలో జగన్ సర్కార్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేని పరిస్థితుల్లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న టీడీపీలో హైకోర్టు పరిణామాలు హ్యాపీ మూడ్ తెచ్చాయని చెప్పొచ్చు.