చైనాలో పుట్టి…విశ్వ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తనకు ఎల్లలు లేవని నిరూపించుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఎఫెక్ట్ కాని ప్రాణి ఉండదంటే అతిశయోక్తి కాదు. దాని తీవ్రత పక్కన పెడితే…మానసికంగానో, శారీరకంగానో ప్రతి ప్రాణి విలవిల్లాడుతోంది.
ఎదుటి మనిషితో మాటలైనా, చేతులైనా…కలపాలంటే వణికిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా పసుపు పారాణి కూడా ఆరని ఓ జంట…ఎన్నో కలలతో ఇటలీకి హనీమూన్‌కు వెళ్లి…కరోనా దెబ్బతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ప్రవృత్తి రీత్యా గాయకుడైన ఆ నవ వరుడు, తన భార్యతో కలసి విరహ వేదననుభవిస్తూ…ఆవేదనతో గళం సవరించుకోవాల్సి వచ్చింది.
కన్నడ గాయకుడు చందన్‌శెట్టికి ఇటీవలే నివేదితాగౌడ్‌తో మైసూర్‌లో ఘనంగా పెళ్లి జరిగింది. ఇద్దరూ తమకిష్టమైన ఇటలీకి హనీమూన్‌కు వెళ్లారు. కరోనా వైరస్ విజృంభణతో ఇటలీలో ఇంటి నుంచి బయటకు కదల్లేని పరిస్థితి. దీంతో చందన్‌శెట్టి అర్ధాంతరంగా తన భార్యతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చాడు.
అయితే నూతన దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా లేదని నిర్ధారించిన తర్వాతే మైసూర్‌లోకి అనుమతించాలని కొందరు గౌడ సంఘ నేతలు కలెక్టర్‌కు విన్నవించారు. అంతేకాదు సామాన్యులకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో, వీళ్లకు కూడా అట్లే ఫాలో కావాలని కోరారు. మొత్తానికి గాయకుడు చందన్‌శెట్టి హనీమూన్ మూడ్ పాడు కావడంతో పాటు సరికొత్తగా కరోనా వైరస్ పంజా విసిరినట్టైంది. ఇప్పుడా నవ దంపతులు విరహ వేదనను పాట రూపంలో ఆలపించాలేమో!