తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు బాగా కావాల్సిన వాళ్లలో ఎవరైనా అరెస్టు అయితే.. వారు తమ అనారోగ్య కారణాలను సాకుగా చూపడం, ఏరికోరి రమేష్ హాస్పిటల్ కు చేరిపోవాలంటూ కోరడం, ఆ మేరకు అన్ని ఏర్పాట్లూ జరుగుతూ ఉండటం గమనార్హం. ఒకరకంగా వివాదాలతోనూ, అరెస్టైన తెలుగుదేశం నేతలకు ఆశ్రయం కల్పించే వేదికగా రమేష్ హాస్పిటల్ వార్తల్లో నిలుస్తూ ఉంది.
ఇది వరకూ ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు జైల్లో కన్నా రమేష్ హాస్పిటల్ లోనే ఎక్కువ సమయం గడిపారు. అచ్చెన్నకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఆయనకు తగిన వైద్యం చేశామని ప్రభుత్వాసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చినా అది కోర్టు ముందు అప్పట్లో నిలిచినట్టుగా లేదు.
ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అచ్చెన్నాయుడు జైల్లో ఒకటీ రెండు రోజులైనా గడపకముందే ఆయనను రమేష్ హాస్పిటల్ కు తరలించారు అప్పట్లో. బెయిల్ వచ్చే వరకూ అచ్చెన్నాయుడు రమేష్ హాస్పిటల్ లోనే గడిపారు! బెయిల్ వచ్చిన వెంటనే అక్కడ నుంచి డిశ్చార్జి అయ్యి సొంతూరికి వెళ్లారు! అదీ కథ.
ఆ తర్వాత అగ్నిప్రమాదం, కోవిడ్ పేషెంట్ల మరణంతో రమేష్ హాస్పిటల్ వివాదాల్లోకి ఎక్కింది. ఆ హాస్పిటల్ అధినేత పరారీలోనే ఉంటూనే ఆ వ్యవహారం నుంచి బయటపడినట్టుగా ఉన్నారు. ఇక ఇప్పుడు రఘురామకృష్ణంరాజు అరెస్టుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రఘురామ కూడా రమేష్ హాస్పిటల్ ను చేరుకున్నారు. ఆయన అనారోగ్య కారణాల రీత్యా రమేష్ హాస్పిటల్ లో చేరారు.
రమేష్ హాస్పిటల్ కు పంపడం అంటే తెలుగుదేశం ఆఫీసుకు పంపినట్టే అంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించినా హై కోర్టులో మాత్రం అది నిలబడినట్టుగా లేదు. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రఘురామకృష్ణంరాజును రమేష్ హాస్పిటల్ కు తరలించాలని హైకోర్టు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబుకు కావాల్సిన వాళ్లు ఎవరు అరెస్టైనా వారికి రమేష్ హాస్పిటలే కేరాఫ్ అవుతున్నట్టుగా ఉంది! పరిస్థితులు అన్నీ వారికి అలా కలిసి వస్తున్నట్టున్నాయి.
మరోవైపు సుప్రీం కోర్టులో రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా ఆయన న్యాయవాదులు వాదిస్తూ.. తమ క్లైంట్ కు రమేష్ హాస్పిటల్ లోనే పరీక్షలు జరగాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం.
ఎయిమ్స్ ఉంది కదా.. అని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చెప్పినా, రఘురామ న్యాయవాదులు మాత్రం రమేష్ హాస్పిటల్ లోనే ఆయనకు పరీక్షలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు! నేవీ హాస్పిటల్ కానీ, ఆర్మీ హాస్పిటల్ కానీ ఉందా.. అంటూ సుప్రీం కోర్టు ఆరా తీసిందట. మొత్తానికి రమేష్ హాస్పిటల్ చంద్రబాబు సన్నిహితుల నమ్మకానికి అమ్మలాంటిదేమో!