పూర్వం కలికాలం అనేవారు. కానీ ఇపుడు కరోనా కాలం అంటున్నారు. కలి కాలం కంటే ఇది చాలా దారుణమైనది. మానవ సంబంధాలను తృణ ప్రాయం చేసేస్తున్న రాకాసి కాలమిది. అందుకే కరోనా కాటుకు బలి అయిన వారు గౌరవంగా మరణించలేకపోతున్నారు. వారి అంతిమ సంస్కారం కూడా అవమానంగా మారుతోంది.
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పట్టణానికి చెందిన నుగ్గు సరోజనమ్మ అనే వృద్ధురాలు కరోనా తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమెకు అంత్య క్రియలు నిర్వహించేందుకు బంధువులు కానీ గ్రామస్థులు కానీ ముందుకు రాని దుస్థితి.
దాంతో ఆమె కూతురు దివ్య చివరికి అంత్యక్రియలు తాను చేస్తానని చెప్పి కొడుకుగా మారింది. స్థానిక రోటరీ క్లబ్ నిర్వాహకుల సాయంతో ఆమె ఈ ఆఖరి క్రతువు నిర్వహించి తల్లి రుణం తీర్చుకుంది.
కరోనా వచ్చిందంటేనే తలుపులు మూసుకునే ఈ పాడు లోకంలో కాటికి చేరిన వారికి అంత్య క్రియలకు ఎవరూ ముందుకు రాని చేటు కాలమే దాపురించింది.
స్వచ్చంద సంస్థలు అక్కడక్కడ స్పందిస్తున్నా కూడా గౌరవంగా అఖరి ప్రస్థానం దక్కని అభాగ్యులు ఎందరో ఉన్నారు. అందుకే మరో మారు చెప్పాలి ఇది కరోనా కాలమని. మానవత్వ హననానికి దారి తీస్తున్న కాలమని.