సామాన్యుడు..సామాన్యుడే

ఒక ప్రజాప్రతినిధి అయితే చాలు. ఎన్ని సదుపాయాలు. ఎన్ని వెసులుబాట్లు. ఒక కామన్ మాన్ ను పోలీసులు తీసుకుపోయారు అనుకోండి. వాళ్లు కోర్టుకు తెచ్చేవరకు ఎవరికీ తెలియదు. వాళ్లకు కావాల్సిన వ్యవహారాలు అన్నీ చక్క…

ఒక ప్రజాప్రతినిధి అయితే చాలు. ఎన్ని సదుపాయాలు. ఎన్ని వెసులుబాట్లు. ఒక కామన్ మాన్ ను పోలీసులు తీసుకుపోయారు అనుకోండి. వాళ్లు కోర్టుకు తెచ్చేవరకు ఎవరికీ తెలియదు. వాళ్లకు కావాల్సిన వ్యవహారాలు అన్నీ చక్క బెట్టుకున్నాక, ఫకడ్బందీగా ఎఫ్ ఐ ఆర్ రాసి కోర్టుకు తెస్తారు. అదే శుక్రవారం లేదా శనివారం అయితే లోపలకు పోవాల్సిందే. బెయిల్ వుండదు.

స్పెషల్ పిటిషన్లు అనీ, మోషన్ పిటిషన్లు అనీ ఇంకా ఏవేవో వెసులుబాట్లు తెలియనే తెలియవు. ఒకవేళ తెలిసినా, ప్రయత్నించడం అంత సులువు కాదు. చిన్న చిన్న లాయర్లకు అంత సులువుగా ఇలాంటి వ్యవహారాలు తెగుతాయా? అన్నది అనుమానం. 

సరే, పోలీసులు స్టేషన్ లో చేయి చేసుకోవడం అన్నది కామన్. అలా చేసుకున్నారే అనుకోండి, జడ్జికి చెప్పే వీలు వుండదు. అలా చెబితే రేపు మళ్లీ జైలులో పడ్డాక అక్కడ ఏం పీకుతారో అన్న భయం. ఎందుకుంటే పోలీసులు ఎవరైనా అంతా ఒకటేగా. 

ఇక బెయిల్ అంటే అదో పెద్ద వ్యవహారం. కింద కోర్టు..ఆపై కోర్టు..ఆపై కోర్టు ఇలా వెళ్లాల్సి వుంటుంది. ఇక్కడో ఫిటిషన్ వేసి, అది డిస్మిస్ అయిన అరగంటలో హైకోర్టుకు వెళ్తూనే, పనిలో పనిగా సుప్రీంకోర్టుకు వెళ్లిపోయే సదుపాయం అందరికీ వుండదు. ఒకవేళ వెళ్లాలనుకున్నా అంత స్తోమత వుండదు. వున్నా రోజుల్లో అన్నీ సినిమాటిక్ గా జరిగిపోవు.

ఈ దేశపు రాజ్యాంగం అన్నీ అందరికీ సమానం అంటుంది కానీ, వాస్తవం మాత్రం డబ్బు, పలుకుబడి వుంటే ఒకలా..డబ్బు..పలుకుబడి లేకపోతే మరొకలా వుంటుంది వ్యవహారం. 

నిజానికి రఘురామరాజు వేల కోట్లు బ్యాంకులకు బకాయి పడ్డారు. అదే పని కామన్ మాన్ ఎవరుచేసినా ఈ పాటికి జైల్లో వుండేవారు. అక్కడ కూడా సిబిఐ రఘురామ రాజు విషయలో సాఫ్ట్ గానే వుంది. ఇంకా అదృష్టం చాలా వుంది. 

ఒకప్పుడు ఎమ్మార్ ప్రాపర్టీస్ట్ అంటూ చాలా హడావుడి జరిగింది. రఘరామరాజు విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా గుర్రుగా వుండేది. ఆయన వ్యవహారాల మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేసేది. కానీ ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ ఆయన కోసం లేఖలు రాస్తోంది.

మొత్తం మీద ఈ దేశంలో అధికారం, పలుకుబఢి కీలకం. అందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫరవాలేదు. ఆ అధికారం, పలుకుబడి దక్కిన తరువాత ఎన్ని అడ్డదారుల్లోనైనా వెళ్లొచ్చు. ఇది ఇండియా. ఇక్కడంతే.