షాడో ఎమ్మెల్యేలు… వైఎస్ జ‌గ‌న్ ఇమేజ్ కు డ్యామేజ్!

ప్ర‌స్తుతం రాజ‌కీయం అత్యంత ఖ‌రీదుతో కూడుకున్న వ్య‌వ‌హారం. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా ఒక్క‌సారి కొంత అధికారం అందిందంటే.. ఇక వారి స్థాయి ఎక్క‌డికో వెళ్లిపోతుంది. గ‌త కొన్నేళ్ల‌లో తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే అనే హోదా మోస్ట్…

ప్ర‌స్తుతం రాజ‌కీయం అత్యంత ఖ‌రీదుతో కూడుకున్న వ్య‌వ‌హారం. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా ఒక్క‌సారి కొంత అధికారం అందిందంటే.. ఇక వారి స్థాయి ఎక్క‌డికో వెళ్లిపోతుంది. గ‌త కొన్నేళ్ల‌లో తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే అనే హోదా మోస్ట్ గ్లామ‌ర‌స్, మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది. ఎమ్మెల్యే కావ‌డం అంటే మాట‌లు కాని వ్య‌వ‌హారంగా మారింది. ఆ హోదాకు ఎదిగిన వారు కార‌ణ జ‌న్ములు అనేంత స్థాయి కి చేరింది వ్య‌వ‌హారం. ఇక ఎమ్మెల్యేగా నెగ్గిన వ్య‌క్తే కాదు.. వారి ఇంట్లోని వారు కూడా ఒక రేంజ్ పొజిష‌న్లో ఉన్న‌ట్టే!

ఎమ్మెల్యే భార్య‌, ఎమ్మెల్యే పిల్ల‌లే కాదు.. ఎమ్మెల్యే త‌మ్ముడు, చెల్లెలు, మ‌ర‌ద‌లు, అన్న‌, వ‌దినా.. ఇలా ఎమ్మెల్యేకు అతి స‌మీప బంధువులతో మొద‌లుపెడితే… ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే బంధువులు, ఎమ్మెల్యే ఇంటిపేరుతో ఉన్న వారు కూడా కాల‌ర్ ఎగ‌రేసే ప‌రిస్థితి ఉంది! ఎమ్మెల్యే తో వారి ప‌రిచ‌యం ఎంత‌, బంధుత్వం ఎంత‌.. అనేది ప‌క్క‌న పెడితే ఎమ్మెల్యే పేరుతో వీరు కూడా ఒక ఆట ఆడ‌గ‌లిగే ప‌రిస్థితి అయితే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉంది!

ఇలా మోస్ట్ గ్లామ‌ర‌స్ వృత్తి అయిన రాజ‌కీయంలో.. ఎమ్మెల్యే తో బంధుత్వం, స్నేహం అంతే స్థాయి గ్లామ‌ర్! మ‌రి ఈ గ్లామ‌ర్ ను ఎవ‌రైనా కేవ‌లం త‌మ ఆనందం కోస‌మో, తాము గ‌ర్వించ‌డం కోసమో, తాము ఎమ్మెల్యేకు ద‌గ్గ‌రి వారం అని చెప్పుకునే వ‌ర‌కే వాడితే అదో లెక్క‌. న‌లుగురిలో గౌర‌వం పొంద‌డం వ‌ర‌కే ఎమ్మెల్యే బంధువులు, స్నేహితులుగా చ‌లామ‌ణి అయితే ఎవ‌రికీ న‌ష్టం కాదు. అయితే వీరే ఎమ్మెల్యేలుగా చ‌లామ‌ణి కావ‌డ‌మే ఆశ్చ‌ర్యానికి గురి చేసే అంశం.

నియోజ‌క‌వ‌ర్గంలో వీరు ర‌క‌ర‌కాల వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. వీరే ఎమ్మెల్యేలు అనేంత స్థాయిలో హ‌డావుడి ఉంటుంది. వీరినే షాడో ఎమ్మెల్యేలుగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతూ ఉంటుంది. ఇలాంటి రాజ‌కీయం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తూ ఉంటుంది. ప్ర‌త్యేకించి నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి షాడో ఎమ్మెల్యేల హ‌డావుడి ప్ర‌త్యేక చ‌ర్చ‌గా మొద‌లై పెద‌వి విరుపుల వ‌ర‌కూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఇలాంటి వ్య‌వ‌హారాలు కొన్ని ఉన్నాయి.

ప్ర‌త్యేకించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో షాడో ఎమ్మెల్యేలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్నింటి ప్ర‌స్తావ‌న ఇది.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి వ్య‌వ‌హారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పార్టీ లో ఉన్న స‌ణుగుడే ఇది. రాప్తాడులో గ‌త ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి ఇంట్లోని వారి విష‌యంలో కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపించే టాక్ ఇది. ద‌శాబ్దాలుగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌లేని ప్రాంతంలో తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి జెండా ఎగ‌రేశారు. ప‌రిటాల కోట‌ను బ‌ద్ధ‌లు కొట్టారు. కేవ‌లం గెల‌వ‌డం వ‌ర‌కే అయితే గొప్ప గెలుపు. అయితే తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డికి వ‌చ్చిన మెజారిటీ రికార్డు స్థాయి కావ‌డం సంచ‌ల‌నం. అయితే గెలిచిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌కాష్ రెడ్డి ఇంట్లోని వారంతా ఎమ్మెల్యేలుగా చ‌లామ‌ణి అవుతున్నార‌నేది టాక్. 

ప్ర‌కాష్ రెడ్డి సోద‌రుడు ఇంకా ఇంట్లోని వారంతా ఎమ్మెల్యేలే అన్న‌ట్టుగా పరిస్థితి ఉంద‌ని, ఇంత‌మంది ఎమ్మెల్యేలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. కార్య‌క‌ర్త‌ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే మాట మొద‌టి నుంచి వినిపిస్తోంది. ఈ మ‌ధ్య‌కాలంలో అది కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా.. ప్ర‌కాష్ రెడ్డి విష‌యంలో అనుచ‌వ‌ర్గం అసంతృప్తి దాస్తే దాగేది కాక‌పోవ‌చ్చు. అది చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్నా.. ఇంట్లోని వారంతా ఎమ్మెల్యేలే అనే ట్యాగ్ తోపుదుర్తి ఫ్యామిలీకి బాగా ఉంది!

ఇక ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో క‌థ ఇంత‌క‌న్నా ప‌రాకాష్ట‌కు చేరింద‌నే టాక్ ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ద‌ర్శి నుంచి నెగ్గిన మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ రావు విష‌యంలో కూడా షాడో ఎమ్మెల్యే ఉన్నారు. ఆయ‌న త‌మ్ముడే నియోజ‌క‌వ‌ర్గంలో మూడేళ్లుగా ఎమ్మెల్యేగా చ‌లామ‌ణిలో ఉన్నార‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ కేరాఫ్ బెంగ‌ళూరుగా ఉంటార‌ని, ఆయ‌న అక్క‌డ వ్యాపార వ్య‌వ‌హారాల్లో త‌న‌మున‌క‌లై ఉండ‌గా.. ఆయ‌న సోద‌రుడు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాన్ని చ‌క్క‌బెట్టుకుంటూ ఉంటార‌నే మాట క్షేత్ర స్థాయిలో వినిపిస్తోంది. 

నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే సోద‌రుడి రాజ‌కీయ జోక్యం గ‌రిష్ట స్థాయిలో ఉంటుంద‌ట‌. మ‌రి ఇలాంటి ప‌రిస్థితే ఉంటే.. ఆ ఎమ్మెల్యే సోద‌రుడే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఉండాల్సిందేమో! ఎమ్మెల్యే సోద‌రుడు షాడో ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బాగా వ్య‌తిరేక‌త‌ను పెంచే అంశం. తాము ఒక‌రిని ఎన్నుకుంటే.. మ‌రొక‌రు వ‌చ్చి హ‌ల్చ‌ల్ చేస్తే ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద‌గా హ‌ర్షించ‌ర‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గ‌మే మ‌రోటి కావ‌లి. నెల్లూరు జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి. ఇటీవ‌లే ఈయ‌న ఇంటి లో శుభ‌కార్యానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా హ‌జ‌ర‌య్యారు. ఇలా త‌న పార్టీ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ అమిత ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం రామ్ రెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి అనుచ‌రుడు సుకుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చ‌లామ‌ణి అవుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ప‌రిస్థితే ఉంది. అయితే ప్ర‌తాప్ రెడ్డి అనుచ‌రుడు ఎమ్మెల్యేగా చ‌లామ‌ణి కావ‌డాన్ని మాత్రం స్థానికులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, శ్రేయోభిలాషులు కూడా జీర్ణించుకునే ప‌రిస్థితి లేదు.  షాడో ఎమ్మెల్యే వ్య‌వ‌హారం ఇలానే సాగితే.. పార్టీకి న‌ష్టం జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని స్థానికులు స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్ర‌స్తుతం సిట్టింగ్ స్థానాల్లో షాడో ఎమ్మెల్యేల వ్య‌వ‌హారాలు బాగా ఎక్కువగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు ఇవి. ఈ నియోజ‌క‌వ‌ర్గాలు పార్టీకి అనుకూల‌మైన‌వే. గ‌త ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీలు ద‌క్కాయి. జ‌గ‌న్ ప‌ట్ల బాగా సానుకూల‌త కూడా కొన‌సాగుతూ ఉంది. ఎమ్మెల్యేలపై వ్య‌తిరేక‌త పెర‌గ‌డానికి ఇలాంటి షాడో ఎమ్మెల్యేలు కార‌ణం అవుతుండ‌టం విశేషం. ఈ షాడో ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించ‌డం జ‌రిగే పనో కాదో కానీ.. ప‌రిస్థితి చేయి దాటే ప‌రిస్థితి ఇప్ప‌టి వ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్ కు తెలియ‌నిది కూడా కాక‌పోవ‌చ్చునేమో!